మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!

  • 30 మే 2018
చైనా కరెన్సీ Image copyright Getty Images

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గత కొన్ని రోజులుగా దిగజారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాకిస్తాన్ కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతోంది. మరో 10వారాల్లో ఆ దేశ విదేశీ నిధుల ఖజానా ఖాళీ అవ్వొచ్చని భావిస్తున్నారు. ఇలా జరిగితే ఆ దేశానికి దిగుమతులు ఆగిపోయి.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొనే ప్రమాదముంది.

మరోవైపు అక్కడ ప్రభుత్వానికీ, ఆర్మీకి మధ్య నెలకొన్న సంక్షోభం మాత్రం తగ్గట్లేదు.

ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే అక్కడి కరెన్సీ విలువ 120 రూపాయలకు పడిపోయింది.

పాకిస్తాన్ ఖజానాలో ప్రస్తుతం 10.3బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిధులు మాత్రమే మిగిలున్నాయి. గత ఏడాది మేలో ప్రభుత్వం దగ్గర దాదాపు 16.4బిలియన్ డాలర్ల విదేశీ నిధులుండేవి.

ఈ పరిస్థితుల్లో పాక్ మళ్లీ చైనాను ఆశ్రయించొచ్చనీ, 1 లేదా 2 బిలియన్ డాలర్లు ఇమ్మని అడగొచ్చని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘డాన్’ పేర్కొంది.

వచ్చే జూలైలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిశాక పాకిస్తాన్ మళ్లీ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం కూడా అడిగే అవకాశం ఉంది. 2013లో కూడా పాక్ ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ తలుపు తట్టింది.

పాకిస్తాన్ దగ్గరున్న విదేశీ నిధులు మరో 10వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గత కొన్నాళ్లుగా విదేశాల్లో స్థిరపడ్డ పాక్ వాసులు తమ దేశానికి పంపే డబ్బుల విలువ కూడా బాగా తగ్గిపోయిందని ఆ పత్రిక తెలిపింది.

దీనికి తోడు పాక్‌కు దిగుమతులు పెరిగిపోవడం కూడా ఖజానాపై ప్రభావం చూపింది. మరోపక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా పాక్ భారీగా విదేశీ మారకాన్ని ఖర్చు చేసింది. చైనా-పాక్‌లు సంయుక్తంగా చేపట్టిన ఈ ఎకనామిక్ కారిడర్ అంచనా వ్యయం దాదాపు 60బిలియన్ డాలర్లు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆర్థిక వృద్ధి కోసం పాక్ చైనాపైన ఎక్కువగా ఆధారపడుతోంది

చైనాకు ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యం. అందుకే పాక్‌లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం తలెత్తకూడదనీ, ఆ ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనీ చైనా కోరుకుంటోంది.

కానీ ఈ ప్రాజెక్టులో భాగంగా చైనీస్ యంత్రాలను పాక్ దిగుమతి చేసుకుంటోందనీ, దీనివల్ల భారీ మొత్తంలో విదేశీ నిధులు ఖర్చవుతున్నాయనీ, ఫలితంగా విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయనీ డాన్ పత్రిక చెబుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతోన్న ముడి చమురు ధరలు కూడా పాక్ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచుతున్నాయి.

ప్రస్తుతమున్న లోటును పూడ్చాలంటే ఈ ఏడాదిలో పాక్‌కు 17బిలియన్ డాలర్లు అవసరమవుతాయని గత అక్టోబర్‌లోనే ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.

విదేశాల్లో స్థిరపడ్డ పాకిస్తానీయులను ఆకర్షించగలిగితే, వారికోసం ఏవైనా ప్రోత్సాహకాలను అందించగలిగితే, వాళ్లు స్వదేశానికి ఎక్కువ మొత్తంలో విదేశీ నిధుల్ని పంపే అవకాశం ఉందనీ, ఫలితంగా సమస్య కొంత తీరుతుందనీ పాక్‌ సెంట్రల్ బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు.

నిధుల లోటుకు తోడు పాకిస్తాన్‌కు అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. జూన్‌లో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి పాక్‌ ఇప్పటిదాకా 5బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాక్‌కు అందించే నిధుల్లో ట్రంప్ భారీ కొతలు విధించారు

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికా నుంచి పాక్‌కు అందే ఆర్థిక సాయంలో కూడా భారీ కోతలు పడ్డాయి. గతంతో పోలిస్తే పాక్‌తో తమ దేశ సంబంధాలు చాలా దెబ్బతిన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో అన్నారు.

వచ్చే ఏడాది పాక్‌కు అందే నిధుల్లో మరింత కోత పడుతుందని పాంపేయో తెలిపారు.

అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో చైనాపైన పాకిస్తాన్ ఆధారపడటం మొదలుపెట్టింది. దాంతో క్రమంగా అక్కడ చైనా ప్రాబల్యం పెరిగిపోతోంది.

మరోపక్క పాకిస్తాన్‌కు అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. 2009 నుంచి 2018 మధ్యలో పాక్‌కు విదేశీ రుణభారం 50శాతం మేర పెరిగిందని ఐఎంఎఫ్ నివేదికలు చెబుతున్నాయి. 2013లో పాక్‌కు 6.7 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో ఓ ప్యాకేజీని ఐఎంఎఫ్ ప్రకటించింది.

ఈ నెల మొదట్లో పాక్ ఆర్థిక వృద్ధికి సంబంధించి వెలువడిన నివేదిక కూడా ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేదే. పాక్ ఈ ఏడాదిలో తన వృద్ధి రేటు 6శాతం కంటే ఎక్కువే ఉంటుందని భావిస్తూ వస్తోంది. కానీ ఐఎంఎఫ్ మాత్రం అది 4.7శాతానికే పరిమితమవుతుందని తెలిపింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా పాక్ ఎకనామిక్ కారిడర్ ప్రాజెక్టులో భాగంగా పాక్ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది

ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే పాక్ కేవలం చైనా మీద ఆధారపడితే సరిపోదని ఆ దేశ ఆర్థిక నిపుణులు అంటున్నారు. దానికి తగ్గట్టే సౌదీ అరేబియాతో సంబంధాలపై కూడా పాక్ దృష్టి సారించింది.

పాకిస్తాన్ వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఏటికేడు ఎగుమతులు తగ్గడంతో పాటు దిగుమతులు పెరుగుతున్నాయి. గతేడాది పాక్ వాణిజ్య లోటు విలువ 33బిలియన్ డాలర్లకు చేరింది. ఈ నష్టాన్ని పాక్ అసలు ఊహించలేదు.

వాణిజ్య లోటు పెరుగుతుందంటే.. పాక్ ఉత్పత్తులకు ఇతర దేశాల్లో ఆదరణ తగ్గుతోందనీ, లేదా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ ఉత్పత్తులు పోటీ పడలేకపోతున్నాయనీ భావించొచ్చు.

పాకిస్తాన్‌లో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక కథనం ప్రకారం 2007లో ఆ దేశంలో దాదాపు 21 లక్షల మంది ఆదాయపన్ను చెల్లించారు. కానీ 2017లో 12.6లక్షల మంది మాత్రమే ఆ పన్ను కట్టారు. ఈ ఏడాది ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య మరింత తగ్గొచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు