ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?

  • విక్కీ స్ప్రాట్
  • బీబీసీ కోసం
ఇల్లస్ట్రేషన్

ఫొటో సోర్స్, Danae Diaz

చొక్కా మీద లిప్‌స్టిక్ గుర్తులు, బొత్తాలకు చిక్కుకున్న శిరోజాలు, అబ్బాయిల దగ్గర ఫీమేల్ పర్‌ఫ్యూమ్ సువాసనలు.. అమ్మాయిల బట్టలపై మేల్ పర్‌ఫ్యూమ్ పరిమళాలు ఇవన్నీ ఉంటే.. అతను లేదా ఆమె తప్పు చేసినట్టే!! ఇది ఒకప్పటి మాట!.

పెళ్లయిన వాళ్లు, ప్రేమలో ఉన్న వారు చాలా మంది పురుషులు, మహిళలు.. ఆన్‌లైన్ ‘యాప్’ల ద్వారా తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. అలాంటి వారిని కనిపెట్టడం మరింత కష్టమవుతోంది.

సోషల్ మీడియాలో ఫాలో కావడాలు, లైక్ కొట్టడాలు, కామెంట్ పెట్టడాలు ఇలాంటి పోకడలన్నీ మీ భాగస్వామిని మోసం చేయడమే అవుతుందా?

అవును అంటున్నారు నిపుణులు. దీన్నే ‘మైక్రో చీటింగ్’ అంటున్నారు.

ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాత ఫోటోలను కూడా లైక్ చేయడం ద్వారా, సదరు వ్యక్తికి పరోక్షంగా సంకేతాలు పంపినట్లేనని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

మీరు ఎప్పుడైనా మైక్రో చీటింగ్ చేశారా? లేక మీ భాగస్వామి మైక్రో చీటింగ్ చేస్తున్నారా?

‘శృంగారంలో పాల్గొనే సమయంలో ఇతరులను ఊహించుకోవడం’, ‘పెళ్లయ్యాక కూడా డేటింగ్ యాప్స్‌ వాడటం..’ ఇలా చేస్తే భాగస్వామిని మోసం చేయడమేనా? ఇలాంటి 5 సందర్భాలపై డా.గ్రాఫ్, డా.నీషి, డా.లీలా కోలిన్స్ ఏమంటున్నారో చదవండి.

ఫొటో సోర్స్, Danae Diaz

01. పెళ్లయ్యాక లవర్‌కి మెసేజ్ పంపడం

మీ భాగస్వామితో కలిసి ఒక సంగీత కచేరిలో ఉంటారు. అక్కడ పాడుతున్న పాట.. గతంలో మీరు ప్రేమించిన అబ్బాయి / అమ్మాయికి అత్యంత ఇష్టమైన పాట కావచ్చు. ఆ పాటను రికార్డు చేసి, వారికి పంపుతారు.

వెంటనే అటువైపు నుంచి రిప్లై వస్తుంది. ఆ రిప్లై చివర్లో కిస్ ఎమోజీ కూడా ఉంటుంది. మీ సంభాషణను అలాగే కొనసాగిస్తారు.

ఇలా చేస్తే.. మీ భర్త / భార్యను మోసం చేసినట్టవుతుందా?

నిపుణుల అభిప్రాయం :

నీషి : ''మీ ప్రేయసి లేదా ప్రియుడితో టచ్‌లో ఉండడం తప్పుకాదు. కానీ ఇలాంటి సందర్భాల ద్వారా తిరిగి వారితో సంబంధాలను కొనసాగించాలని, వారిని ఆకర్షించాలని మనసులో లేకపోతే.. పై సందర్భం తప్పు కాదు. చాలా మంది.. తమ ప్రేయసి/ప్రియుడిని మర్చిపోలేదు అని తెలిపేందుక్కూడా మెసేజ్‌లు పంపుతుంటారు.

లీలా : ''పెళ్లయ్యాక కూడా మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఎందుకు టచ్‌లో ఉండాలి? ఉద్దేశం ఏదైనాసరే.. అలా మెసేజ్‌లు చేయడం మీ భాగస్వామిని మోసం చేయడమే అవుతుంది!''

ఇందులో మోసం పాళ్లు : 3/5

02. సోషల్ మీడియాలో ఇతరుల పోస్టులను లైక్ చేయడం

మీరు పడకపై వాలారు. లైట్లు ఆఫ్ చేశారు. మీ భాగస్వామి నిదురపోతున్నారు. మీకు నిదుర పట్టలేదు. స్మార్ట్ ఫోన్ అందుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు.

ఓ అపరిచిత వ్యక్తి పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా అనిపించింది. వారి ఫోటోలను లైక్ చేశారు.

ఆఫీసులో లంచ్ టైంలో, ఆఫీస్ అయ్యాక ఇంటికొచ్చే దారిలో కూడా ఆ వ్యక్తి పోస్ట్ చేసిన కొత్త పోస్ట్‌లకు కొన్ని ఎమోజీలను పంపారు. అందులో హార్ట్ ఎమోజీ కూడా ఉంది.

నిపుణుల అభిప్రాయం :

నీషి : ''ఇలా ప్రవర్తిస్తున్నారంటే.. వారి వైవాహిక సంబంధంలో ఇబ్బందులు ఉన్నాయనడానికి ఇది ఓ సంకేతం. ఇతరుల పోస్టులను లైక్ చేయడం అన్నది తప్పేమీ కాదు. కానీ ఒకే వ్యక్తి పోస్టులను తరచూ లైక్ చేయడం అంటే.. వారి గురించి పదేపదే ఆలోచిస్తున్నారని, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అర్థం.''

మార్టిన్ గ్రాఫ్ : ‘‘ఇది అనుమానించాల్సిన విషయమే! ఇతరుల పోస్టులను ఫాలో కావడం, లైక్ చేయడం మధ్యాహ్న సమయంలోనా లేక రాత్రి సమయంలోనా అన్నది కీలకాంశం. ఆ సమయాన్ని బట్టి వారి ఉద్దేశాన్ని తెలుసుకోవచ్చు.’’

మోసం పాళ్లు : పగటి పూట చేస్తే - 2/5. చీకటి పడ్డాక చేస్తే - 5/5

ఫొటో సోర్స్, Danae Diaz

03. ఆరాధనా పూర్వకమైన స్నేహం

మీ పాత కాలేజ్ మిత్రులు లేక పాత కొలీగ్స్‌తో కలిసి ఔటింగ్ వెళ్తారు. అక్కడ ఆటపాటలతో ఓ రాత్రి అందరూ సరదాగా గడుపుతారు.

వాళ్లలో ఒకరి పట్ల మీకు గతంలో ఆరాధనా భావం లేక ఆకర్షణ ఏర్పడి ఉంటుంది. ఆరోజులు గుర్తొస్తాయి.

ట్రిప్ ముగిశాక సహజంగానే ఇద్దరూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అవుతారు. ఇతర సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు ఫాలో అవుతారు.

ఓ సాయంకాలం ఆ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ వస్తుంది. 'మీ మొబైల్ నంబర్ కావాలని, మీతో మాట్లాడాలని' ఆ మెసేజ్ సారాంశం.

నిపుణుల అభిప్రాయం :

లీలా : ''ఇలాంటి సందర్భాల్లో మీరు నిజాయితీగా, హుందాగా ఉండాలి. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతున్నపుడు కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవడం, తరచు మెసేజ్‌లు చేయడం అనుమానించాల్సిన విషయమే!''

నీషి : ''పాత మిత్రులను కలవడం, వాళ్లతో సరదాగా గడపడంలో తప్పు లేదు. కానీ మీరు ఏం చేస్తున్నారో మీకు స్పష్టత ఉండాలి. మీరు అవతలి వ్యక్తితో మెసేజ్‌ల రూపంలో రహస్య సంభాషణలు చేస్తున్నారంటే మీరేదో తప్పు చేస్తున్నారని అర్థం.''

మోసం పాళ్లు : 4/5

04. డేటింగ్ యాప్స్‌లో మీ ప్రొఫైల్ డిలీట్ చేయకపోవడం

మిమ్మల్ని ఆకర్షించే డేటింగ్ యాప్స్‌తో కొంత కాలం గడిపారు. ఇప్పుడు మీకు పెళ్లయ్యింది. దాంపత్య జీవితంలో అసలైన వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నారు. మంచిదే కానీ..

మీ స్మార్ట్ ఫోన్‌లో డేటింగ్ యాప్స్ ఇంకా చప్పుడు చేస్తూనే ఉన్నాయి. ఆ యాప్స్‌ను మీరు డిలీట్ చేయకుండా అప్పుడప్పుడూ వాటితో కాలక్షేపం చేస్తారు.

నిపుణుల అభిప్రాయం :

నీషి : ''ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌ను డిలీట్ చేయకపోవడం క్షమించరానిది. ఇతర అబ్బాయిలు/అమ్మాయిలకు మీ ప్రొఫైల్ పట్ల కుతూహలాన్ని పెంచడమే అవుతుంది.''

లీలా : ''ఇలా చేయడం క్రూరమైన చర్య. ఇది మైక్రో చీటింగే కాదు.. పెద్ద మోసం కూడా! దాంపత్య జీవితంలో ఉన్నపుడు, లేదా ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నపుడు అసలు వేరొక వ్యక్తితో చాటింగ్ ఎందుకు చేస్తారు? మీ భాగస్వామికి తెలియకుండా రహస్యంగా సందేశాలు, సంభాషణలు పంపుతున్నారంటే మీరు మోసం చేస్తున్నారని అర్థం! ఇందుకు మినహాయింపు లేదు.''

మోసం పాళ్లు : 10/5

ఫొటో సోర్స్, Danae Diaz

05. శృంగారంలో పాల్గొనే సమయంలో వేరొక వ్యక్తిని ఊహించుకోవడం

శృంగారంలో పాల్గొంటున్నపుడు మీ భాగస్వామి స్థానంలో మీ బాస్ మీ ఊహల్లోకి చొరబడతారు. అప్పుడు మీరు ఒకరకమైన షాక్‌కు గురవుతారు.

ఈ ప్రక్రియ మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఎందుకంటే.. ఇది అప్రయత్నంగా జరిగే చర్య.

ఉదాహరణకు.. మీ ఊహల్లోకొచ్చిన వ్యక్తి మీ బాస్ అనుకుంటే, ఆరోజు శృంగారం జరిపే ముందు క్షణం వరకూ మీరు పడకపై.. ఆఫీస్ తాలూకు పని, లేదా మెయిల్స్ చూస్తున్నారు.

మీ బుర్రలో ఆఫీస్ వాతావరణం ఇంకా చురుకుగా పని చేస్తుంటుంది. అలాంటపుడు శృంగార సమయంలో ఆ ఆఫీస్ వాతావరణం నుంచి, ఆ మెయిల్స్ నుంచి మీ బాస్ హఠాత్తుగా మీ ఊహల్లోకి వచ్చారు.

ఇలా ఊహించుకోవడం భాగస్వామిని మోసం చేయడమే అవుతుందా?

నిపుణుల అభిప్రాయం :

లీలా : ''ఒకరి గురించి ఊహించుకోవడం అంటే మోసం చేయడం కాదు. ఊహలు పూర్తిగా మీ వ్యక్తిగతం. కానీ అలా ఊహలోకి వచ్చిన వ్యక్తికి మెసేజ్‌లు చేయడం, వారిని అదే దృష్టితో చూడటం అన్నది పద్దతి కాదు. ఎందుకంటే.. మీ ఊహలు మీవరకే పరిమితం.''

నీషి : ''మన ఊహలు.. భాగస్వామిని మోసం చేయకుండా కాపాడే కవచాలు అని నేను గట్టగా చెప్పగలను. ఎందుకుంటే ఊహించుకోవడమంటే మోసం చేయడం కాదు. ఇది సర్వసాధారణం. మనలో చాలా మందికి ఇలాంటి ఊహలుంటాయి.''

ఇలా ఊహించుకోవడం అలవాటుగా మారితే!

''శృంగార సమయంలో మీ ఊహలో వేరొక వ్యక్తి ఉంటే, మీ దృష్టి మీ భాగస్వామిపై ఉండదు. అపుడు మీ ఊహల్లో ఎవరున్నారో మీ భర్త లేక భార్య కనిపెట్టలేకపోవచ్చు కానీ, మీ దృష్టి తమపై లేదన్న విషయం మాత్రం వాళ్లకు ఇట్టే అర్థమవుతుంది. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి.. అపుడు మీ భాగస్వామితో ఉన్నది నిజంగా మీరేనా?''

మోసం పాళ్లు : 0

మైక్రో చీటింగ్ అన్నది పూర్తి స్థాయి అక్రమ సంబంధం కాదు. కానీ, అక్రమ సంబంధాలకు ఊతమిచ్చే, ప్రోత్సహించే ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆన్‌లైన్ సోషల్ జీవితం మీ నిజ జీవితంపై ఏమేరకు ప్రభావం చూపిస్తోందో అర్థం చేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు.

ఈ 5 సందర్భాలతో మీ జీవితాన్ని ఓసారి తరచి చూసుకోండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)