నేటి ప్రధాన వార్తలు: రష్యన్ జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకో కాల్చివేత

  • 30 మే 2018
Image copyright EPA

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో రష్యన్ జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకోను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్టు ఆ దేశ పోలీసులు తెలిపారు.

రక్తం మడుగులో పడివున్న బాబ్షెంకోను (41) ఆయన భార్య గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్సులోనే ఆయన మృతి చెందారు.

2016లో కూలిపోయిన రష్యన్ మిలిటరీ విమానం గురించి కథనాలు రాసిన తర్వాత బాబ్షెంకోను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆయన తన దేశాన్ని వదిలేశారు.

మొదట ఆయన ప్రేగ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నివసించసాగారు. రష్యన్ ప్రభుత్వ విధానాలను ఆయన బాహాటంగా విమర్శించేవారు.

మొదట యుద్ధరంగ ప్రతినిధిగా పని చేసిన బాబ్షెంకో ఆ తర్వాత ఉక్రెయిన్ చానెల్ ఏటీఆర్ టీవీలో ప్రెజెంటర్‌గా పని చేశారు.

హంతకుడు ఆయనపై వెనుక నుంచి అనేక సార్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

బాబ్షెంకోను ఆయన 'వృత్తిపరమైన కార్యకలాపాల' కారణంగానే హత్య చేసినట్టు అనుమానిస్తున్నామని కీవ్ పోలీసు ఉన్నతాధికారి ఆండ్రీయ్ క్రిష్చెంకో స్థానిక మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసులో నేర విచారణ జరుగుతోంది.

Image copyright Reuters

ప్రైవేటు సాయుధ మూకలతో చేయి కలుపుతున్న నికరాగ్వా ప్రభుత్వం: అమ్నెస్టీ

నికరాగ్వాలో అధ్యక్షుడు డేనియల్ ఓర్టెగాకు వ్యతిరేకంగా విద్యార్థులు పలు వారాలుగా ఆందోళనలు జరుపుతున్నారు.

ఈ ఆందోళనలను అణచివెయ్యడానికి నికరాగ్వా ప్రభుత్వం ప్రైవేటు సాయుధ మూకలను ఎగదోస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.

సెమీ-ఆటోమెటిక్ ఆయుధాలు కలిగి ఉన్న ఈ సాయుధ గ్రూపులు ప్రభుత్వ భద్రతా బలగాలతో చేయి కలిపి దాడులకు పాల్పడుతున్నాయని అమ్నెస్టీ తెలిపింది.

ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో మొదలైన ఉద్యమంలో ఆ తర్వాత ఓర్టెగా ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండు ప్రముఖంగా ముందుకు వచ్చింది.

Image copyright EPA

బెల్జియంలో దుండగుడి కాల్పులు: పోలీసులు సహా ముగ్గురు మృతి

బెల్జియంలోని లీజ్ నగరంలో ఒక వ్యక్తి ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో పాటు, ఒక పౌరుడిని కాల్చి చంపాడు.

ఒక స్కూలు వద్ద దాడికి తెగపడ్డ దుండగుడు మహిళా పారిశుధ్య కార్మికురాలిని బందీగా పట్టుకున్నాడు.

పోలీసులు అతడిని కాల్చి చంపారు. అతడి దాడిలో మరో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు.

ఆ వ్యక్తి దాడి ఉద్దేశం ఏమిటనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు.

ఆ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అని నినాదాలు చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

Image copyright Getty Images

గాలిదుమారం, పిడుగుతో ఉత్తరాదిలో 50 మంది మృతి

మంగళవారం రాత్రి గాలిదుమారం, పిడుగుపాటు ఘటనలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి.

ఈ ఘటనల కారణంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 15 మంది మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు.

"మంగళవారం రాత్రి ఉన్నావ్ జిల్లాలో ఆరుగురు, రాయబరేలి జిల్లాలో ముగ్గురు, కాన్‌పూర్, పీలీభీత్, గోండా జిల్లాల్లో ఇద్దరేసి మంది మృతి చెందారు" అని ఉత్తర్ ప్రదేశ్ సహాయ కార్యక్రమాల కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.

మరోవైపు, మంగళవారం రాత్రి బిహార్‌లో 20 మంది చనిపోయారనీ, మరో ఆరుగురు గాయాలపాలయ్యారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారి అవినాశ్ కుమార్ బీబీసీ ప్రతినిధికి తెలిపారు.

ఇటలీ Image copyright Getty Images

ఇటలీ రాజకీయ సంక్షోభంతో కుదేలవుతున్న షేర్ మార్కెట్లు

ఇటలీలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో యూరప్ షేర్ మార్కెట్లు పడిపోయాయి. దీని ప్రభావం వాల్ స్ట్రీట్‌ మార్కెట్లపై కూడా పడింది.

ఇటలీలో మళ్లీ ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు, యూరోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించే పార్టీలు బలం పంజుకోవడం వంటి పరిణామాలతో యూరోజోన్‌లో అస్థిరత్వం నెలకొనవచ్చనే భయాలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)