సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?

  • 31 మే 2018
సింగపూర్ Image copyright Getty Images

సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తాం అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో చెబతుంటారు.

అభివృద్ధికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది రాజకీయ నేతలు సింగపూర్‌ని ఉదాహరణగా చూపిస్తుంటారు.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ కూడా సింగపూర్ వెళ్లనున్నారు.

విస్తీర్ణ పరంగా చూస్తే భారత్ రాజధాని దిల్లీ అంత కూడా లేని చిన్న దేశం సింగపూర్. 53ఏళ్ల క్రితం ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పేదరికం నుంచి బయటపడేసే ఎలాంటి వనరులూ సింగపూర్ దగ్గర లేవు.

వ్యవసాయానికి పనికొచ్చే భూములు కానీ ఖనిజ నిక్షేపాలు కానీ లేవు. చాలామంది ప్రజలు మురికివాడల్లోనే జీవించేవారు.

అలాంటిది అతి తక్కువ కాలంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా సింగపూర్ ఎదిగి మరెన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1955 నాటి సింగపూర్‌లో ఓ రిక్షాలో సేదతీరుతున్న చిన్నారి

పౌరుల సగటు జీతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రపంచంలో ఆ దేశం మూడో స్థానంలో ఉంది. రవాణా, భద్రత, ఉత్పాదకత, ఆరోగ్యం లాంటి అనేక అంశాల్లో సింగపూర్ ముందు వరసలో ఉందని కన్సల్టింగ్ ఫర్మ్ జునిపర్ రీసెర్చ్ ఫలితాలు చెబుతున్నాయి.

జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పరంగా గత ఐదేళ్లుగా సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తోందని ‘ది ఎకనమిస్ట్’ మేగజీన్ పేర్కొంది.

కానీ సింగపూర్ కథ గతంలో ఇలా లేదు. భారత్, ఆస్ట్రేలియా, మియన్మార్ లాంటి అనేక దేశాల్లానే సింగపూర్ కూడా బ్రిటన్‌ పాలనలో ఉండేది.

Image copyright HULTON ARCHIVE
చిత్రం శీర్షిక జపాన్ ఆక్రమిత సింగపూర్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది

సింగపూర్‌పై బాంబుల వర్షం

సింగపూర్‌లో గతంలో బ్రిటన్ సేనలు పెద్ద సంఖ్యలో ఉండేవి. అందుకే దాన్ని ‘జిబ్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్’ అని పిలిచేవారు.

కానీ 1942లో బ్రిటన్‌ను జపాన్ చాలా అవమానకర రీతిలో ఓడించింది. ఆ ఓటమిని బ్రిటన్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదిగా నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అభివర్ణించారు.

1944-45లో జపాన్ ఆక్రమిత సింగపూర్‌పై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడుల్లో సింగపూర్‌కు చెందిన అనేక పోర్టులు, వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి.

అయినా సింగపూర్ అధైర్య పడలేదు. ఆ శిధిలాల నుంచే ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లీ కువాన్ యూ.. సింగపూర్ నిర్మాత

ఓ హీరో దొరికాడు

లీ కువాన్ యూ.. సింగపూర్ తలరాతను మార్చిన నేతగా ప్రజలు ఆయన్ను కొలుస్తారు. మూడు దశాబ్దాల పాటు ప్రధానిగా ఆయన సింగపూర్‌ను నడిపించారు.

1923లో సింగపూర్‌లో స్థిరపడ్డ చైనా సంతతికి చెందిన కుటుంబంలో లీ పుట్టారు. చిన్నప్పట్నుంచీ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లోనే చదువకున్న లీ ఆలోచనలపై ఆంగ్లేయుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే ఆయన్ను చిన్నప్పుడు స్నేహితులు ‘హ్యారీ లీ’ అని పిలచేవారు.

సింగపూర్‌ను జపాన్ ఆక్రమించినప్పుడు ఆ ప్రభావం అక్కడి పౌరుల జీవనంపై తీవ్రంగా పడింది. లీ చదువుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. యుద్ధం ముగిశాక లీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో, ఆ తరవాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్లారు

చదువు ముగిశాక ఆయన సింగపూర్ తిరిగొచ్చి ప్రముఖ ట్రేడ్ యూనియన్ లాయర్‌గా అవతరించారు.

Image copyright HULTON ARCHIVE
చిత్రం శీర్షిక 1959 ఎన్నికల ప్రచారంలో లీ కువాన్ యూ

1954లో పీపుల్స్ యాక్షన్ పార్టీని(పీఏపీ) లీ నెలకొల్పారు. 1959లో ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. అలా సింగపూర్‌లో లీ నేతృత్వంలో ఓ కొత్త శకం మొదలైంది. ఆంగ్లేయుల నియంత్రణ నుంచి పూర్తిగా బయటికొచ్చి స్వతంత్ర దేశంగా అడుగులు వేయడం ప్రారంభించింది.

1963లో లీ సింగపూర్‌ను మలేసియా సమాఖ్యలో విలీనం చేశారు. కానీ అనేక కారణాల వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1965 తరవాత దేశంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల అనంతరం సమాఖ్య నుంచి సింగపూర్ బయటకు వచ్చింది. ఆ పరిణామాన్ని చాలా దురదృష్టకరమైనదిగా లీ భావించేవారు.

సింగపూర్‌కు కొత్త ఊపిరి

మొదట బ్రిటన్ పాలన, ఆ తరవాత జపాన్ ఆక్రమణ, ఆ పైన మలేసియా ప్రభుత్వ ఏర్పాటు.. ఇవన్నీ ముగిశాక చాలా రోజుల తరవాత సింగపూర్ స్వతంత్ర దేశంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది.

ఆ దశలో సింగపూర్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి అక్కడ ఎలాంటి వనరులూ లేవు. ఎక్కువ మంది ప్రజలు పూరి గుడిసెల్లోనే జీవించేవారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1965లో సింగపూర్ తలసరి స్థూల జాతీయోత్పత్తి 516 డాలర్లుగా ఉండేది. దాదాపు సగం మంది పౌరులు నిరక్షరాస్యులే. కానీ ఆ తరవాత 1960-80 మధ్య సింగపూర్ తలసరి స్థూల జాతీయోత్పత్తి ఏకంగా 15రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది.

ఇజ్రాయెల్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన పొరుగు దేశాలను వెనక్కునెట్టి బహుళ జాతి సంస్థలను ఆకర్షించడంలో సింగపూర్ ముందుండాలని లీ తపించేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన విధానాలను రూపొందించారు.

Image copyright HULTON ARCHIVE
చిత్రం శీర్షిక 1965లో సింగపూర్‌కు ఎలాంటి ఆదాయ వనరులూ లేవు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రస్తుతం ఆ దేశం ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక కేంద్రాల్లో ఒకటి

పూరి గుడిసెల నుంచి ధగధగలాడే ఆకాశ హర్మ్యాల దేశంగా ఎదిగే క్రమంలో సింగపూర్ పౌరులు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది.

అధిక జనాభా అభివృద్ధికి ఆటంకమని భావించిన సింగపూర్, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే వాళ్లకు పన్నులు విధించడం మొదలుపెట్టింది. నేతలు, అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది.

మౌలిక వసతులు మెరుగు పడితేనే జీవన ప్రమాణాలు పెరుగుతాయనీ, విదేశీ సంస్థలను ఆకర్షించొచ్చనీ, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందనీ భావించిన సింగపూర్, రోడ్లు - రహదారుల నిర్మాణంపై ఎక్కువగా ఖర్చు చేయసాగింది.

అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఓడ రేవు సింగపూర్‌లోనే ఉంది

సింగపూర్ భౌగోళిక స్థానం కూడా ఆ దేశ అభివృద్ధికి ఓ కారణమైంది. ప్రపంచంలోని 40శాతం సముద్ర వాణిజ్యం ఆ దేశం మీదుగానే సాగుతుంది. 190కి.మీ.ల పొడవున్న ఆ దేశ సముద్ర తీరంలో అనేక ఓడ రేవులున్నాయి. వాటివల్ల కూడా ఆ దేశానికి చాలా ఆదాయం సమకూరుతోంది.

వీటికి తోడు లీ కువాన్ యూ హయాంలో సింగపూర్ మానవ వనరుల అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిపెట్టింది. ప్రజలకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాన్ని కల్పించేందుకు చాలా ఖర్చు చేసింది. ఆ ఫలాలు దేశానికి క్రమంగా అందసాగాయి. అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి సేవలను అందించే సత్తా ఉన్న వ్యక్తులుగా సింగపూర్ పౌరులకు గుర్తింపు దక్కుతూ వచ్చింది. అందుకే ప్రస్తుతం ఆ దేశాన్ని అత్యుత్తమ ఎకనామిక్ హబ్‌గా భావిస్తున్నారు.

2017 గ్లోబల్ ఫైనాన్స్ సెంటర్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం అత్యుత్తమ ఆర్థిక కేంద్రాల జాబితాలో లండన్, న్యూయార్క్ తరవాత సింగపూర్ మూడో స్థానంలో ఉంది.

సింగపూర్ అధికారుల లెక్కల ప్రకారం 2017లో 1.7కోట్ల మంది విదేశీ పర్యటకులు సింగపూర్‌కు వచ్చారు. ఆ దేశ జనాభాకంటే ఆ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. ఆ విధంగానూ వారికి చాలా ఆదాయం అందుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017లో 1.7కోట్ల మంది విదేశీ పర్యటకులు సింగపూర్‌కు వచ్చారు.

సింగపూర్‌లో సగటు ఆదాయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ స్థిరపడ్డ విదేశీయులు ఆ దేశ ద్రవోల్యబణం గురించి కూడా ఎక్కువగా చింతించరు.

అధికారిక లెక్కల ప్రకారం సింగపూర్‌లో 90.7శాతం కుటుంబాలకు సొంతిళ్లున్నాయి. లీ చూపిన చొరవతోనే ఇది సాధ్యమైందంటారు. అవినీతి నిర్మూలన కోసం కఠిన చట్టాలను ప్రవేశపెట్టడంతో పాటు తక్కువ వ్యయంతో ఇళ్ల నిర్మాణ పథకం, నూతన పారిశ్రామిక విధానాలను రూపొందించారు.

సింగపూర్‌ను భిన్న సంస్కృతుల కలయికగా చూడాలన్నది లీ కల. దానికోసం అన్ని జాతుల వారినీ ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ఇంగ్లిష్, తమిళ్, మలయ్, చైనీస్ భాషలు కూడా అక్కడ అధికారిక భాషలుగా చలామణీలో ఉన్నాయి.

సింగపూర్ అభివృద్ధిలో విదేశీయుల పాత్ర కూడా ఉంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఇద్దరు విదేశీ పౌరులే ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆ దేశం విదేశీయుల్ని ఆహ్వానిస్తూనే ఉంది.

Image copyright Getty Images

సింగపూర్ సాధించిన ఈ అభివృద్ధి గురించి ప్రస్తావించేప్పుడు చాలా మంది లీ కువాన్ యూ చెప్పిన ఓ మాటను గుర్తు చేస్తుంటారు.

‘చివరికి నాకు దక్కిందేంటి? ఓ అభివృద్ధి చెందిన దేశం. దానికోసం నేను చేసిందేంటి? నా జీవితాన్ని త్యాగం’.. అనేదే ఆ మాట.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: బోటు ప్రమాదంలో 11 మంది మృతి, 27 మంది సురక్షితం.. మిగతా 23 మంది కోసం గోదావరిలో కొనసాగనున్న గాలింపు చర్యలు

ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే

కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..

11 త‌రాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ

గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'

9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం

పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు.. ఇవ్వదు - కేటీఆర్