రష్యా జర్నలిస్టుది హత్య కాదు, ఉక్రెయిన్ డ్రామా

  • 30 మే 2018
బాబ్షెంకో (మధ్యలో) Image copyright Reuters
చిత్రం శీర్షిక బాబ్షెంకో (మధ్యలో)

ఉక్రెయిన్‌లో మంగళవారం హత్యకు గురయ్యారని వార్తలు వచ్చిన రష్యా జర్నలిస్టు ఆర్కాదీ బాబ్షెంకో బతికే ఉన్నారు. నిక్షేపంగా ఉన్నారు. బుధవారం ఉక్రెయిన్‌లో టీవీలో మీడియా సమావేశంలో కనిపించారు. మరి హత్యకు గురయ్యారనే ప్రచారం ఎందుకు జరిగింది? ఎవరు చేశారు?

బాబ్షెంకో హత్యకు గురికాకున్నా హత్యకు గురైనట్లు కావాలనే ప్రచారం చేశామని ఉక్రెయిన్ భద్రతా సంస్థ అధినేత వసిల్ హైరిత్సక్ మీడియాకు వెల్లడించారు.

''బాబ్షెంకో హత్యకు రష్యా భద్రతా సంస్థలు కుట్ర పన్నాయి. దీనిని భగ్నం చేసేందుకు మేమే ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాం. ఆయన్ను హత మార్చేందుకు రష్యా భద్రతా సంస్థలు రంగంలోకి దించిన కొందరు కిరాయి హంతకులను గుర్తించేందుకే ఇలా చేశాం'' అని ఆయన చెప్పారు.

ఈ ఆపరేషన్‌తో తాము ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక యుద్ధరంగ ప్రతినిధిగా పని చేసిన బాబ్షెంకో ఆ తర్వాత ఉక్రెయిన్ చానెల్ ఏటీఆర్ టీవీలో ప్రెజెంటర్‌గా పని చేశారు

బాబ్షెంకోకు 41 సంవత్సరాలు. తన ప్రాణాలు కాపాడారంటూ ఉక్రెయిన్ భద్రతా సంస్థకు బాబ్షెంకో కృతజ్ఞతలు తెలిపారు. మరో మార్గం లేక తప్పనిసరై ఈ ఆపరేషన్‌లో తాను పాల్గొన్నానని చెప్పారు. తాను హత్యకు గురైనట్లు వచ్చిన సమాచారంపై క్షమాపణలు చెప్పారు.

అంతకుముందు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాబ్షెంకోను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్టు ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు. ఈ హత్య వెనుక రష్యా హస్తం ఉందని ఉక్రెయిన్ ప్రధానమంత్రి వోలోదిమిర్ గ్రోయిస్మాన్ ఆరోపించారు.

''బాబ్షెంకో నివసిస్తున్న అపార్ట్‌మెంటు వెలుపల దుండగులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. రక్తం మడుగులో పడివున్న ఆయన్ను ఆయన భార్య గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్సులోనే ఆయన మృతి చెందారు'' అని వార్తలు వచ్చాయి.

2016లో కూలిపోయిన రష్యన్ మిలిటరీ విమానం గురించి కథనాలు రాసిన తర్వాత బాబ్షెంకోను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆయన తన దేశాన్ని వదిలేశారు.

మొదట ఆయన ప్రేగ్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌లోని కీవ్‌లో నివసించసాగారు. రష్యన్ ప్రభుత్వ విధానాలను ఆయన బాహాటంగా విమర్శిస్తుంటారు.

2014లో క్రిమియాను రష్యా తనలో కలిపివేసుకోవడం, ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలను రష్యా అనుకూల బలగాలు స్వాధీనం చేసుకోవటం పరిణామాలతో రష్యా - ఉక్రెయిన్ సంబంధాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)