అమెరికా విదేశాంగ మంత్రితో సమావేశమైన కిమ్ కుడిభుజం

  • 31 మే 2018
జనరల్ కిమ్ యాంగ్-చోల్ (ఎడమ), మైక్ పాంపేయో(మధ్యలో) Image copyright AFP
చిత్రం శీర్షిక జనరల్ కిమ్ యాంగ్ చోల్ (ఎడమ), మైక్ పాంపేయో(మధ్యలో)

అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి, అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ చీఫ్ మైక్ పాంపేయోతో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్‌ కుడిభుజమైన జనరల్ కిమ్ యాంగ్ చోల్ బుధవారం రాత్రి న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. చోల్ చైనా నుంచి వచ్చి ఆయన్ను కలుసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మధ్య ప్రతిపాదిత సమావేశం గురించి పాంపేయో, చోల్ చర్చించారు.

ట్రంప్, కిమ్ మధ్య జూన్ 12న తలపెట్టిన శిఖరాగ్ర సమావేశం రద్దైంది. వారి మధ్య భేటీ ఏర్పాటుకు తిరిగి సన్నాహాలు జరుగుతున్నాయి.

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి సమీపంలోని ఓ అపార్టుమెంటులో పాంపేయో-చోల్ విందు సమావేశం జరిగింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక యూఎన్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని ఓ అపార్టుమెంటులో ఈ విందు సమావేశం జరిగింది.

చోల్‌తో సమావేశం బాగా జరిగిందని పాంపేయో 'ట్విటర్‌'లో చెప్పారు.

కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణే తమ లక్ష్యమని భేటీకి ముందు ఆయన ట్వీట్ చేశారు.

నేడు మళ్లీ సమావేశం

పాంపేయో, చోల్ గురువారం(మే 31) తిరిగి సమావేశం కానున్నారు.

దాదాపు 20 ఏళ్ల కాలంలో అమెరికాను సందర్శించిన ఉత్తర కొరియా అత్యున్నతస్థాయి అధికారి చోల్. ఇటీవలి వరకు ఆయన్ను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ అయిన చోల్ ఉత్తర కొరియాలోని అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. 18 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ అమెరికాలో అడుగుపెట్టారు.

చర్చల కోసం అమెరికాకు ఉత్తర కొరియా చోల్‌ను పంపడం కీలక పరిణామం. ఇటీవల ఉత్తరకొరియా, అమెరికా దౌత్య అధికారుల సమావేశంలోనూ చోల్ పాల్గొన్నారు.

ఉత్తర కొరియా: మాటల యుద్ధం నుంచి శాంతి చర్చల వరకు...

2016, 2017లో తన అణు, క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూ, మాటల దాడికి దిగిన ఉత్తర కొరియా ఇప్పుడు చర్చల విషయంలో ఇంత దూరం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమని ఈ ఏడాది జనవరిలో కిమ్ సూచించగానే, సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో రెండు దేశాలూ కలిసి ఒకే పతాకం కింద కవాతు చేశాయి.

అణు పరీక్షలు నిలిపి వేస్తున్నట్టు కిమ్ గత నెల్లో ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)