దక్షిణాఫ్రికా పాఠశాలలో అమ్మాయిల 'నగ్న' నాట్య ప్రదర్శనపై ఆగ్రహం

నగ్న ప్రదర్శన

ఫొటో సోర్స్, DISPATCHLIVE

దక్షిణాఫ్రికా: పాఠశాలలో 'నగ్న' నాట్య ప్రదర్శనపై ఆగ్రహం

దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో కొందరు విద్యార్థినులు 'నగ్నంగా' నాట్యం చేసిన ఉదంతంపై ఆ దేశ విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు.

'ఇంకిసియో' అని పిలిచే ఓ చిన్న గుడ్డముక్కను మాత్రమే ధరించిన ఖోసా అమ్మాయిలు డాన్స్ చేస్తున్న ఫుటేజిని చూసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని ప్రాథమిక విద్యామంత్రి ఏంజీ మోట్షెగ్గా అన్నారు.

"ఇది మన సాంస్కృతిక విలువలకు వ్యతిరేకమైన అసభ్య వ్యవహారం" అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే గాయకబృందం ముఖ్యుడు మాత్రం ఈ నాట్య ప్రదర్శనను సమర్థించుకున్నారు. దీనికి తాను గర్వపడుతున్నానని ఆయనన్నారు.

"మేం మా ఖోసా సంప్రదాయం పట్ల గర్విస్తున్నాం. మేం 'ఇంకిసియో' ధరించడం పట్ల కూడా గర్విస్తున్నాం. ఖోసా మహిళలు, అమ్మాయిల పట్ల కూడా మేం గర్వపడుతున్నాం అని ఓ ఉపాధ్యాయుడు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించినట్టుగా దక్షిణాఫ్రికాకు చెందిన డైలీ డిస్పాచ్ వెబ్‌సైట్ తెలిపింది.

దక్షిణాఫ్రికాలో ఖోసాలది రెండో అతి పెద్ద స్థానిక భాషా సమూహం.

తూర్పు కేప్‌లోని మ్తాతాలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలకు సంబంధించిన ఫుటేజి ఈ వారం ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. రొమ్ములు, పిరుదులపై ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా అమ్మాయిలు స్టేజిపై నాట్యం చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ వీడియో ఖోసా సాంప్రదాయ నృత్యానికి సంబంధించిన ప్రదర్శనకు సంబంధించినదని స్థానిక మీడియా తెలిపింది.

"మీ సంస్కృతి, వారసత్వాల పట్ల మీరు గర్వించడంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ ఆడపిల్లలతో ఇలా నగ్నంగా డాన్స్ చేయించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అమ్మాయిల శరీరాల్ని ఇలా ప్రదర్శించడం అనుచితమన్న విషయం ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి" అంటూ మంత్రి మోట్షెగ్గా ఆగ్రహం వెలిబుచ్చారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయి లావ్‌రోవ్

ఉత్తర కొరియా నేత కిమ్‌తో భేటీకి రష్యా సిద్ధం

ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ భేటీకి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు రష్యాతో శిఖరాగ్ర సదస్సుకు తాము సిద్ధమని ఉత్తర కొరియా నేత జనరల్ కిమ్ యోంగ్-చోల్ ప్రకటించారు.

కిమ్‌తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయి లావ్‌రోవ్ సమావేశం తర్వాత ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ఈ విషయమై ప్రకటన చేసింది.

కాగా, కిమ్‌తో జూన్ 12న జరగాల్సిన శిఖరాగ్ర సదస్సును డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఉత్తర కొరియాతో అణు నిరాయుధీకరణ చర్చలు సానుకూల దిశలో సాగుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.

మరోవైపు కిమ్ రాసిన లేఖను ట్రంప్‌కు అందించడానికి ఆయన కుడిభుజంగా భావించే కిమ్ యోంగ్-చోల్ అమెరికాకు పయనమయ్యారు.

ఫొటో సోర్స్, iStock

డెన్మార్క్‌లో హిజాబ్, బురఖాలపై నిషేధం

ముఖాన్ని మొత్తంగా కప్పేసే హిజాబ్‌పై డెన్మార్క్ నిషేధం విధించింది.

ఇలా నిషేధం విధించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశం డెన్మార్క్. బురఖా లేదా హిజాబ్ ధరించే ముస్లిం మహిళలపై దీని ప్రభావం పడనుంది.

గురువారం నాడు దేశ పార్లమెంటు ఈ చట్టాన్ని 75-30 ఓట్ల ఆధిక్యంతో ఆమోదించింది. అగస్ట్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి రానుంది.

ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై 157 డాలర్లు, అంటే దాదాపు రూ. 10,500 జరిమానా విధిస్తారు. రెండో సారి ఉల్లంఘించిన వారిపై దీనికి పది రెట్ల జరిమానా ఉంటుంది.

"బహిరంగ స్థలాల్లో ఎవరైనా తమ ముఖాన్ని పూర్తిగా కప్పేసే విధంగా దుస్తుల్ని ధరిస్తే వారిపై జరిమానా విధిస్తారు" అని ఈ కొత్త చట్టంలో ముస్లిం మహిళల ప్రస్తావన లేకుండానే పేర్కొన్నారు.

అయితే డెన్మార్క్ చేసిన ఈ చట్టం మహిళల హక్కులను ఉల్లంఘించే విధంగా, పక్షపాతపూరితంగా ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది.

ఫొటో సోర్స్, EPA

స్పెయిన్‌లో సంక్షోభం: ప్రధాని రఖాయ్‌పై అవిశ్వాస తీర్మానం

స్పెయిన్ ప్రధాని మారియాన్ రఖాయ్ తన పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.

ప్రతిపక్ష సోషలిస్టు పార్టీ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. శుక్రవారం దానిపై ఓటింగ్ జరగాల్సి ఉంది.

ఆ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతునిస్తామని ఆ దేశంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీ ప్రకటించింది.

సోషలిస్ట్ పార్టీ నేత పెద్రో సాంచెజ్ ఆధిక్యం సాధించాలంటే 176 ఓట్ల మెజారిటీ కావాల్సి ఉంటుంది.

అవిశ్వాస తీర్మానం నెగ్గితే సాంచెజ్ ప్రధాని కావడానికి మార్గం సుగమమవుతుంది.

అధికార పీపుల్స్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణల మధ్య సాంచెజ్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.

అవినీతి కేసులో పీపుల్స్ పార్టీ కోశాధికారి లూయిస్ బార్సెనస్‌కు గతవారం మాడ్రిడ్ హైకోర్టు 33 ఏళ్ల శిక్ష విధించాక ఈ ఆరోపణలు ప్రధాని రఖాయ్‌ను కూడా చుట్టుకున్నాయి.

లంచం తీసుకోవడం, మనీ లాండరింగ్, పన్నుల ఎగవేతకు సంబంధించిన వివిధ నేరాల్లో కోర్టు లూయిస్‌ను దోషిగా నిర్ధరించింది.

1999-2005 మధ్య విరాళాల సేకరణ కోసం పీపుల్స్ పార్టీ చేపట్టిన రహస్య కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ఈ కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)