డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే ఆ దేశంలో డిప్లొమా ఇస్తారు..

  • 2 జూన్ 2018
ఆ దేశంలో ద్వందార్థాలు నేర్పిస్తారు Image copyright Getty Images

ప్రతి దేశంలోనూ, ప్రతి సమాజంలోనూ ద్వంద్వార్థాల మాటలు సహజమే. ఇలాంటి మాటలు మనం చాలానే వింటూనే ఉంటాం. ఒకే పదానికి ఎన్నో అర్థాలు కూడా ఉంటాయి.

ముఖ్యంగా అందరి ముందూ చెప్పలేనివి, అంటే సెక్స్ గురించి మనసులోని భావాలు పంచుకోడానికి, తమ కోరికల గురించి చెప్పడానికి చాలా మంది ద్వంద్వార్థాల భాషనే ఉపయోగిస్తుంటారు.

అంటే అశ్లీలంగా ఉన్న మాటలను ఉపయోగించకుండా, కొన్ని సందర్భాలలో తమ ఉద్దేశం చెప్పడానికి ఇలాంటి ద్వంద్వార్థాల మాటల్ని ప్రయోగిస్తారు.

మరి కొందరు ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి లేదా అవమానించడానికి కూడా ద్వంద్వార్థాల భాషను వాడతారు.

ఇదంతా సరే గానీ, అసలు ఇలా ద్వంద్వార్థాలు మాట్లాడడాన్ని ఒక దేశం తమ వారసత్వ సంపదగా పరిగణిస్తోందనే విషయం మీకు తెలుసా?

ఆ దేశమే మెక్సికో. లాటిన్ అమెరికా దేశమైన మెక్సికోలో స్పానిష్ భాష మాట్లాడుతారు. రెండు వందల ఏళ్ల క్రితం ఇది స్పెయిన్ పాలనలో ఉండేది.

మెక్సికోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ద్వంద్వార్థాలు మాట్లాడడంలో ఈ దేశం చాలా పాపులర్ అయ్యింది. మెక్సికో చిల్లీ, అంటే ఆ దేశంలోని మిరపకాయ కూడా చాలా ఫేమస్. చాలా కారంగా ఉండే ఆ మిర్చిని ఇక్కడే పండిస్తారు.

కానీ మిర్చి గురించి మాట్లాడితే ఇక్కడ అందరూ పగలబడి నవ్వుకునే మరో అర్థం కూడా ఉంది.

Image copyright Getty Images

దీనిని రాసిన సుజానా రిగ్ బ్రిటన్‌లో ఉంటారు. ఆమె మెక్సికోకు వెళ్లి స్పెయిన్ మాట్లాడ్డం బాగా నేర్చుకున్నారు. కానీ ఆమెకు ఆ భాషలోని ద్వంద్వార్థాలను అర్థం చేసుకునేంత పట్టు మాత్రం రాలేదు.

ఒక రోజు ఆమె రెస్టారెంటుకు వెళ్లారు. వెయిటర్ ఆమెను "మీకు స్పైసీ ఫుడ్ ఇష్టమా" అని అడిగాడు. కానీ ఆ మాట అడగడానికి ముందు వెయిటర్ ఆమెను తిప్పి తిప్పి చాలా ప్రశ్నలు అడిగాడు.

ఆమె ఏ దేశంలో ఉంటుంది, ఏ భాష మాట్లాడుతుంది, ఇంగ్లండ్‌లో ఆమె ఎక్కడ ఉంటుంది వంటి ప్రశ్నలన్నీ అడిగాడు. చివర్లో "మీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా" అని అడిగాడు.

జవాబు చెప్పగానే, వెయిటర్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. అతను అలా ఎందుకు నవ్వుతున్నాడో సుజానాకు అర్థం కాలేదు.

ఆ తర్వాత మరో సంఘటన జరిగింది. మెక్సికోలోని ఒక్సాకాలో సుజానా తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. స్నేహితులు "నీకు మిర్చి అంటే ఇష్టమా" అని నవ్వుతూ అడిగారు.

Image copyright Getty Images

సుజానా సందేహం

వెయిటర్‌తో జరిగిన అనుభవం గుర్తుంది, కానీ సుజానా వెంటనే "ఆ, నాకు మిర్చి ఇష్టమే" అని చెప్పింది. తర్వాత మిర్చి గురించి ఇంకా చాలా చెబుతూనే ఉంది. మిరపకాయ అంటే తన ఇష్టాలను ఆమె చెబుతున్నప్పుడు, ఆమె స్నేహితులు మాత్రం పడీపడీ నవ్వారు.

వాళ్లకు అంత నవ్వెందుకు వస్తోందో సుజానాకు అర్థం కాలేదు. కానీ ఆమె స్నేహితులు మాత్రం ఇక నవ్వలేక పొట్టలు పట్టుకున్నారు.

సుజానా కూడా నవ్వుతూ, తను అన్న మాటల గురించి ఆలోచించింది. పొరపాటున స్పానిష్‌లో ఏవైనా అనరాని మాటలు అనేశానా అనే సందేహం వచ్చింది. ఆమెకు తన మాటల్లో అలాంటి తప్పేం కనిపించలేదు.

అంతలో, ఆమె మెక్సికన్ స్నేహితుడు నవ్వుతూనే "నీకు మెక్సికన్ మిర్చి అంటే నిజంగా అంత ఇష్టమా" అన్నాడు. అంతే, అక్కడున్న వాళ్లంతా మళ్లీ పగలబడి నవ్వారు.

సుజానాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. తను మిర్చి అనే మాట ఉపయోగించింది. ఆ పదానికి వేరే అర్థం కూడా ఉంది. తన బుగ్గలు ఎరుపెక్కాయి. కానీ ఆమె స్నేహితులు మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నారు.

Image copyright Getty Images

మాటలతో ఆటలు

సుజానాను నిజానికి మెక్సికో సంస్కృతిలో ప్రత్యేకమైన "ఎల్బర్" అనే వాడుక భాషలో ఆటపట్టించారు. "ఎల్బర్" అంటే మెక్సికోలో మాట్లాడే ఒక పద్ధతి. అందులో ఒక మాటకు ద్వంద్వార్థాలు, ఇంకా ఎన్నో అర్థాలు ఉంటాయి. మెక్సికోలో అలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడ్డం సాధారణం.

చాలా దేశాలలోలాగే మెక్సికోలో కూడా సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడాలంటే వెనకాడుతారు. అలాంటప్పుడు వాళ్లు "ఎల్బర్", అంటే ద్వంద్వార్థాల మాటలు ప్రయోగిస్తారు.

సుజానాకు ఈ విషయం గురించి, మోరెలస్ యూనివర్సిటీలో భాషా ప్రొఫెసర్, డాక్టర్ లూయీస్ హెరాస్తీ, వివరంగా చెప్పారు. సెక్స్ సంబంధిత విషయాలు చెప్పాలంటే మెక్సికోలో ద్వంద్వార్థాలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారని, మిర్చి అంటే పురుషాంగం అనే అర్థం కూడా ఉందని అన్నారు.

స్నేహితులందరూ తన మాటలకు అంత పడీపడీ ఎందుకు నవ్వారో సుజానాకు అర్థమైంది. మెక్సికోలో "ఎల్బర్" శైలి గురించి తెలీని వారెవరైనా, మిర్చి అంటే తన ఇష్టాఇష్టాలను చెప్పినపుడు, అవి అక్కడి వారికి ఎలా అర్థమవుతాయో తెలిసింది.

మిర్చి గురించి ద్వంద్వార్థాలు ఆలోచించే ఆ దేశంలో, వేరే ఏం చెప్పినా దానికి మరో అర్థం తీసుకుని నవ్వుకోవచ్చు.

Image copyright Getty Images

మెక్సికన్ కళ

ప్రతి దేశంలో ద్వంద్వార్థాలు ప్రయోగిస్తుంటారు. దేనికైనా మరో అర్థం ఊహించుకుంటారు. సెక్స్ విషయంలో ఇలాంటి మాటలను సరదాగా ఉపయోగిస్తారు.

కానీ మెక్సికో మాత్రం వీటిని తమ సంస్కృతిగా, తమతో విడదీయరాని ఒక గుర్తింపుగా భావిస్తోంది. అందుకే అక్కడ నివసించే వారు సంకేతాలు చూపిస్తూ తిట్టడమే కాదు, సరదా కోసం అలాంటి మాటలను ప్రయోగించడం కూడా మామూలైపోయింది.

"ఇది ఒక మెక్సికన్ కళ, భాషపై పట్టు ఉన్న వారు మాత్రమే వీటిని మాట్లాడగలరు" అని డాక్టర్ లూసిల్ హెరాస్తీ చెబుతారు.

అలాంటప్పుడు, ఎవరైనా బయటి నుంచి మెక్సికో వస్తే, ఈ కళ గురించి వారికి తెలియడానికి చాలానే సమయం పడుతుంది. ఈ లోపు వాళ్లు స్నేహితుల సరదా మాటలకు నవ్వులపాలు కావల్సిందే.

"మాతృభాష కాకుండా వేరే భాష స్లాంగ్ నేర్చుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది" అని ఒక్సాకాలో మెక్సికో తిట్లు, ద్వంద్వార్థాల ట్రైనింగ్ ఇచ్చే గ్రెగోరియో డెస్గారెనెస్ అంటారు.

"అలాంటప్పుడు మెక్సికన్ ఎల్బర్ అర్థం చేసుకోవడం ఇంకా కష్టం, కొన్నిసార్లు అవి ఎంత గూఢంగా ఉంటాయంటే దానికి అర్థం ఏంటో, మెక్సికోలో ఉన్న వాళ్లకే తెలీదు" అని చెబుతారు.

Image copyright Getty Images

ద్వంద్వార్థాల వాడుక ఎలా మొదలైంది?

"ఎల్బర్ ప్రారంభం ఎప్పుడో, మెక్సికోలో అది ఎప్పుడు వాడుకలోకి వచ్చిందో చెప్పడం కష్టం" అంటారు డాక్టర్ హెరాస్తీ. ద్వంద్వార్థాల విషయానికి వస్తే, "మధ్య మెక్సికోలో గని కార్మికులు మొదట అలా మాట్లాడారని, గంటలపాటు మైనింగ్ చేసే కార్మికులు పనిలో బోర్ కొట్టినపుడు, ఉత్సాహం కోసం ద్వంద్వార్థాలతో మాట్లాడుకునేవారు" అని చెబుతారు.

మెక్సికోలోని కొందరు భాషా నిపుణులు మాత్రం, "స్పెయిన్ ఆక్రమణ తర్వాత, మెక్సికోలో నివసించిన వారే ఈ శైలిని సృష్టించారు" అని చెబుతారు.

"స్పానిష్ వలస పాలకులకు అర్థం కాకుండా ఉండేందుకు వారు ద్వంద్వార్థాలతో మాట్లాడుకునేవారు, మెక్సికోలో ఉన్నవారిపై స్పానిష్ మాట్లాడాలని ఒత్తిడి చేయడంతో వాళ్లు రహస్యంగా మాట్లాడుకోడానికి ఈ పద్ధతి ఉపయోగించారు" అని అంటారు.

"నిజానికి 'ఎల్బర్' అనేది సమాజంలో దిగువస్థాయి వారు ఎగువ స్థాయి వారికి విసిరిన సవాలు లాంటిది. మేం సమాజంలో దిగువ స్థాయికి చెందిన వాళ్లం. కానీ మాకు కూడా వారికి ఉన్న హక్కులే ఉంటాయి."

"ఎల్బర్" మాట్లాడే ఇద్దరు కలిసినప్పుడు, వారి మధ్య త్వరగా 'మన' అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే సమాజంలో ఒకే ప్రాంతానికి చెందిన వారి మధ్య బంధం బలంగా ఉంటుంది అంటారు గ్రెగోరియో.

Image copyright Getty Images

ద్వంద్వార్థాల మాటల పోటీలు

ప్రస్తుతం మెక్సికోలో ద్వంద్వార్థాల మాటల ప్రయోగం ఎంతగా ఉందంటే, వీటిని మాట్లాడ్డంలో ఇక్కడ పోటీలు జరుగుతుంటాయి. ఈ పోటీలో గెలిచినవారికి "ఎల్బురెరోస్" లేదా "మాటల మాంత్రికులు" అనే టైటిల్ ఇస్తారు.

ఏళ్ల నుంచీ దీన్ని పురుషులే గెలుచుకుంటూ వచ్చారు. కానీ 20 ఏళ్ల క్రితం దీన్ని "లార్డ్స్ రూజ్" అనే మహిళ మొదటిసారి గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఆమెను ద్వంద్వార్థాల మాటల్లో ఎవరూ గెలవలేకపోయారు.

ప్రస్తుతం లార్డ్స్ రూజ్ మెక్సికో సిటీలో "ఎల్బర్" నేర్చుకోవాలనుకునేవారికి కోచింగ్ కూడా ఇస్తున్నారు. రూజ్‌కు "క్వీన్ ఆఫ్ ఎల్బర్" అనే అవార్డు కూడా దక్కింది.

మెక్సికోలో "ఎల్బర్" మాట్లాడేవాళ్లకు డిప్లొమా కూడా ఇస్తారు. ఇప్పుడు రూజ్‌ మాత్రమే కాదు ఎంతో మంది అమ్మాయిలు, ఇతరులు "ఎల్బర్" మాట్లాడ్డం నేర్చుకుంటున్నారు. మాటలతో ఆడుకుంటున్నారు.

మెక్సికో ప్రాంతంలో పనులు చేసుకునేవారికి "ఎల్బర్" నేర్పించడం ఇప్పుడు ఒక ఉపాధిగా మారిపోయిందని స్థానికులు కొందరు చెబుతారు.

Image copyright Getty Images

దేశానికి గుర్తింపు

మిగతా వారికి అశ్లీలంగా అనిపించినా మెక్సికో వాసులకు మాత్రం "ఎల్బర్" మాటలు కవితాత్మకంగా వినిపిస్తాయి. అది ఎంతగా అంటే 2014 నుంచి 2016 మధ్య యునెస్కో "ఎల్బర్"ను వారసత్వ సంపదగా గుర్తించింది అనే వదంతులు కూడా వచ్చేంతగా.

కానీ, ఒక సర్వే ప్రకారం కేవలం 21 శాతం మంది మెక్సికన్లు మాత్రమే దీనిని తమ దేశం గుర్తింపు అని భావిస్తున్నారు.

మెక్సికో వెళ్తున్న కొత్త వారు మాత్రం అక్కడ ద్వంద్వార్థాల గురించి తెలుసుకుని, వాటిని వింటూ, ఆ మజాను ఆస్వాదించాలని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)