అమెరికాపై జీ7 దేశాల ఆగ్రహం

  • 3 జూన్ 2018
డొనాల్డ్ ట్రంప్ Image copyright EPA

ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు విధించడం పట్ల ఇతర జీ7 దేశాల ఆర్థిక మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా చర్యలకు తాము గట్టిగా బదులివ్వాల్సి వస్తుందని కెనడాలోని రిసార్టులో వాడివేడిగా జరిగిన సదస్సులో ఈయూ, కెనడా దేశాల మంత్రులు హెచ్చరించారు.

మరికొద్ది రోజుల్లో వాణిజ్య యుద్ధం (ట్రేడ్ వార్) మొదలయ్యే అవకాశముందని ఫ్రాన్స్ మంత్రి బ్రునో లీ వ్యాఖ్యానించారు.

అయితే, వాణిజ్యపరంగా ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

తాజా సుంకాలు అమెరికా దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షిస్తుందని, అది జాతీయ భద్రతకు కీలకమని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరప్, తదితర దేశాల్లో అమెరికా సంస్థలు అడ్డంకులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు.

ప్లాస్టిక్ నిషేధానికి భారత కృషి భేష్

ప్లాస్టిక్ నిషేధానికి కట్టుబడి కృషి చేస్తున్న భారత్ ప్రపంచ దేశాలకు ఓ ఆదర్శంగా నిలుస్తోందని ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారి ఒకరు ప్రశంసించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సంవత్సరం భారత్ నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ నెయ్‌సాన్ సాబా మాట్లాడుతూ... పర్యావరణ సమస్యలు, కాలుష్య నివారణకు మార్గాలను కనుక్కోవడంలో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు.

ప్లాస్టిక్ మన నిత్యజీవితంలో భాగమైపోయిందని, దాని వాడకాన్ని తగ్గించకపోతే సమస్యలు తప్పవని భారత్‌లో యూఎన్ఓ పర్యావరణ విభాగ ప్రచారకర్త, సినీనటి దియా మీర్జా ప్రజలకు సూచించారు.

Image copyright twitter.com/arbaazSkhan
చిత్రం శీర్షిక అర్బాజ్ ఖాన్

"నిజమే.. ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.2.83 కోట్లు కోల్పోయా"

ఐపీఎల్ మ్యాచ్‌లో తాను బెట్టింగ్ చేసిన విషయం నిజమే అని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ అంగీకరించారు. కొన్నేళ్లుగా బెట్టింగ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని థానే బలవంతపు వసూళ్ల నిరోధక విభాగం అధికారులు శనివారం అర్బాజ్ ఖాన్‌ను 4 గంటలపాటు విచారించారు.

"గతేడాది జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌ చేసి అర్బాజ్‌ఖాన్‌ రూ.2.83 కోట్లు నష్టపోయారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో అర్బాజ్‌పై బుకీ సోను జలాన్‌ బెదిరింపులకు పాల్పడ్డారు" అని పోలీసు అధికారి ప్రదీప్ శర్మ తెలిపారు.

బుకీ జలాన్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని డైరీలో వంద మందికిపైగా క్రికెట్ బుకీల ఫోన్ నంబర్లు ఉన్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

బ్యాలెట్ పేపర్ తీసుకువచ్చే ఆలోచనే లేదు: సీఈసీ

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టే ఆలోచనే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. "రాజకీయ పార్టీలు తమ ఓటమికి ఎవరినో ఒకరిని బాధ్యులను చేయాలి కాబట్టి ఈవీఎంలను బలిపశువులను చేస్తున్నాయి, ఎందుకంటే అవి తిరిగి మాట్లాడలేవు కదా" అని ఆయన వ్యాఖ్యానించారు. 'ఎన్నికల్లో నైతికత, డబ్బు పాత్ర' అనే అంశంపై దిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం అనేది పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం వల్ల వచ్చే సమస్యే తప్ప మెషిన్‌లో లోపం ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు.

"పోలింగ్ సిబ్బంది ఓ రెండు నిమిషాలు ట్రైనింగ్ తీసుకుంటారు, ఆ సమయంలో కూడా ఫోన్లు, వాట్సాప్‌లతో బిజీగా ఉంటారు. అసలైన విషయాన్ని అర్థం చేసుకోరు. దీంతో ఈవీఎంను సరిగా వినియోగించలేక ఇబ్బందులు పడతారు. ఇది ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది" అని ఆయనన్నారు.

Image copyright RAKESH BAKSHI/gettimages

ముంబయిలో వర్షాలు, ముగ్గురు మృతి

ముంబయితోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వర్షాలు పడ్డాయి. వర్షం కారణంగా తెగిపడిన ఎలక్ట్రిక్ వైర్లు ముంబయిలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురిని బలిగొన్నాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షాల కారణంగా ముంబయి నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నెమ్మదించింది.

"రుతుపవనాలు ఇంకా రాష్ట్రాన్ని తాకలేదు. రుతుపవనాల రాకకు ముందుగా వర్షాలు పడటం సర్వసాధారణం" అని ప్రాంతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ విశ్వంభర్ సింగ్ తెలిపారు.

వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం లభించిందంటూ ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)