మొదటి ప్రపంచ యుద్ధం: శత్రు సేనలను హడలెత్తించిన బుల్లి యుద్ధ ట్యాంక్

  • 4 జూన్ 2018
యుద్ధ ట్యాంకు Image copyright Getty Images

వందేళ్ల క్రితం రూపుదిద్దుకున్న 'ది ఎఫ్‌టీ' అనే బుల్లి యుద్ధ ట్యాంకు మొదటి ప్రపంచ యుద్ధం రూపురేఖలనే మార్చేసింది.

మొదటి ప్రపంచ యుద్ధం హోరాహోరీగా జరుగుతున్న సమయం అది. అప్పటికే మూడేళ్లుగా భీకర పోరు నడుస్తోంది.

1918 మే 31న ఈశాన్య ఫ్రాన్స్‌లో జర్మనీ ఆకస్మికంగా దాడి ప్రారంభించింది. బ్రిటిష్ సంకీర్ణ దళాలపై పై చేయి సాధించేందుకు జర్మనీ సేనలు తీవ్రంగా పోరాడుతున్నాయి.

ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఫ్రాన్స్ బలగాలు కొత్తగా సమకూర్చుకున్న బలంతో ముందుకు కదిలాయి. ఆ కొత్త బలమే ఈ బుల్లి యుద్ధ ట్యాంకు.

'ది ఎఫ్‌టీ' అని పిలిచే ఈ ట్యాంకు చాలా పొట్టిగా ఉంటుంది. అప్పటి దాకా 18 నెలల పాటు బ్రిటిష్ సంకీర్ణ దళాలు వినియోగించిన భారీ యుద్ధ ట్యాంకులతో పోల్చితే ఇదో 'పిల్లకాయ' లాంటిది. కానీ, చేతల్లో మాత్రం చాలా గట్టిది.

దీని లోపల కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంటుంది.

చాలా తేలికగా ఉండే ఈ ట్యాంకు, కొద్దిపాటి సందు దొరికినా చాలు.. దూసుకెళ్తూనే ఉంటుంది.

Image copyright Richard Chasemore/gettyimages

అంతకుముందు బ్రిటిష్ వాళ్లు మార్క్ I పేరుతో తయారు చేసిన భారీ యుద్ధ ట్యాంకుల వేగం చాలా తక్కువ. అవి కదులుతుంటే భారీ ఎత్తున శబ్దం వస్తుండేది. దాంతో ప్రత్యర్థి దళాలు వాటి ఆచూకీని సులువుగా కనిపెట్టేవి.

తర్వాత వచ్చిన మార్క్ 4 తోనూ అదే సమస్య.

వాగులు వంకలు ఎక్కువగా ఉన్న చోట, దట్టమైన అడవుల్లో భారీ ట్యాంకులు వెళ్లడం కష్టంగా ఉండేది.

ఈ సమస్యలకు పరిష్కారంగా తక్కువ పరిమాణం కలిగి ఉండి, వేగంగా పరుగెత్తగల ట్యాంకులు అవసరమన్న ఆలోచనతో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ సంస్థ ఎఫ్‌టీ ట్యాంకును రూపొందించింది.

ఈ పొట్టి ట్యాంకుతో ఆ సమస్యలు లేవు. శత్రువుల నుంచి సులువుగా తప్పించుకోగలదు. మాటువేసి దాడి చేయగలదు. అక్కడికక్కడే సులువుగా 360 డిగ్రీల కోణంలో చుట్టూ తిరగగలదు.

2017లో అందుబాటులోకి వచ్చిన బ్రిటిష్ మార్క్ IV ట్యాంకు బరువు దాదాపు 29 టన్నుల దాకా ఉండేది. అదే ఈ కొత్త ట్యాంకు బరువు మాత్రం కేవలం 7 టన్నులే.

అంతేకాదు, బ్రిటిష్ మార్క్ ట్యాంకులు బాగా వేడెక్కుతుండేవి. ఈ పొట్టి ట్యాంకులో ఆ సమస్య కూడా లేదు. ఎప్పుడూ గాలి పీల్చుకుంటూ ఇంజిన్‌ని చల్లబరుస్తుంది, వేడి గాలిని బయటకు వదులుతుంది.

Image copyright Hulton Archive/ gettyimages

గోతులను, కాలువలను కూడా దాటుకుంటూ వెళ్లేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇది గంటకు 11 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. 1918 నాటికి అది చాలా ఎక్కువ.

మాటువేసి ప్రత్యర్థి దళాలపై దాడి చేసేందుకు ఈ ట్యాంకులు బాగా ఉపయోగపడుతుండేవి.

1918 మే 31న ఒకేసారి 30 ఎఫ్‌టీ ట్యాంకులు రంగంలోకి దిగి, జర్మనీ బలగాలను వెనక్కి పంపించడంలో కీలకపాత్ర పోషించాయి.

దాంతో 1919 ఆఖరులోగా 12,000కు పైగా ఎఫ్‌టీ యుద్ధ ట్యాంకులను తయారు చేసివ్వాలని రెనాల్ట్ సంస్థను ఫ్రాన్స్ కోరింది. కానీ, ఆ గడువులోగా అన్నీ తయారు చేయలేకపోయింది.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జర్మనీ సుమారు 20 యుద్ధ ట్యాంకులను తయారు చేయగా, ఫ్రాన్స్ వద్ద ఉన్న ఎఫ్‌టీ ట్యాంకుల సంఖ్య 1,000 దాటింది.

ఎఫ్‌టీ ట్యాంకులను తయారు చేసి ఇప్పటికి వందేళ్లు గడుస్తున్నా.. ఇంకా కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి.

దక్షిణ ఇంగ్లాండ్‌లోని కెంట్ ప్రాంతంలో ఉన్న ఓ వర్క్‌షాప్‌లో ప్రస్తుతం రెండు ఎఫ్‌టీ ట్యాంకులు ఉన్నాయి.

వాటిలో ఒకటి ఇప్పుడు కూడా చక్కగా నడుస్తోంది. అది దాదాపు వందేళ్ల నుంచీ పనిచేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు