1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- జెరెమీ బోవెన్
- బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్
ఫొటో సోర్స్, Alamy
51 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత కరువైంది.
1948లో కొత్తగా ఏర్పడ్డ ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఆ దేశాన్ని నాశనం చేయాలని ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ లాంటి అరబ్ దేశాలు ప్రయత్నించాయి. కానీ విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ చేతిలో ఈజిప్ట్ సహా ఇతర అరబ్ సేనలు ఘోరంగా ఓడిపోయాయి.
ఈజిప్ట్ సైన్యానికి గమాల్ అబ్దెల్ నాజర్ నాయకత్వం వహించగా, ఇజ్రాయెల్ సేనల్ని ఇత్జాక్ రబిన్ నడిపించారు.
60 లక్షలకు పైగా యూదులను నాజీలు హతమార్చిన కొన్నేళ్ల తరవాత తమకంటూ ఓ సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న యూదుల కల ఇజ్రాయెల్ రూపంలో నెరవేరిన రోజులవి.
1948నాటి ఆ యుద్ధాన్ని పాలస్తీనియన్లు మహా విపత్తుగా అభివర్ణిస్తారు. దాదాపు 7.5లక్షల మంది పాలస్తీనియన్లను ఆ సమయంలో ఇజ్రాయెల్ నుంచి వెళ్లగొట్టారు. వారు మళ్లీ ఎప్పటికీ తిరిగి రాలేదు.
ఇజ్రాయెల్ చేతిలో ఎదురైన ఓటమి అరబ్ దేశాలను రాజకీయంగా కుదిపేసింది. చాలా ఏళ్లపాటు ఆ దేశాల్లో అంతర్గత తిరుగుబాటు వాతావరణం కొనసాగింది. ఆ ఓటమిని అవమానకరంగా భావించిన ఆర్మీ ఈజిప్ట్, సిరియాల్లో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది.
సిరియాలో సైనిక తిరుగుబాట్లు చాలా మూములైపోయాయి.
ఫొటో సోర్స్, Getty Images
అరబ్ దేశాల్లో నాజర్ హీరోగా అవతరించాడు
యుద్ధం ముగిసిన నాలుగేళ్ల తరవాత గమాల్ అబ్దెల్ నాజర్, కొందరు యువ సైన్యాధికారులు సాయంతో ఈజిప్ట్ రాజును గద్దె దించడంలో విజయం సాధించారు.
1956 నాటికి నాజర్ ఈజిప్ట్ అధ్యక్షుడిగా అవతరించారు. తనను పదవి నుంచి తప్పించి, సూయెజ్ కెనాల్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ప్రయత్నాలకు నాజర్ గట్టిగా బదులివ్వడంతో అరబ్ ప్రజలు అతడిని హీరోగా, బలమైన నాయకుడిగా చూడటం మొదలుపెట్టారు.
1948 యుద్ధంలో ఇజ్రాయెల్ సేనల్ని నడిపించిన రబిన్ 1967నాటికి ఆ దేశంలో అత్యంత కీలకమైన సైన్యాధికారిగా ఎదిగారు.
అన్నేళ్లు గడిచినా అరబ్ దేశాలు 1948నాటి ఓటమిని జీర్ణించుకోలేకపోయాయి. పొరుగు దేశాల వాళ్లే తమను నాశనం చేయడానికి చూశారన్న విషయాన్ని ఇజ్రాయెల్ కూడా అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. ఏదో ఒక రోజు మళ్లీ యుద్ధం తథ్యమనే భావన రెండు పక్షాల్లోనూ నెలకొంది.
పొరుగు దేశాల మధ్య చిచ్చు
ఇజ్రాయెల్‌కు, ఇతర అరబ్ దేశాలకూ మధ్య ద్వేషం పెరగడానికి, ఒకర్నొకరు అనుమానించడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 1950-60 మధ్య జరిగిన కోల్డ్ వార్ కూడా అందులో ప్రధానమైంది.
సోవియట్ యూనియన్ ఈజిప్ట్‌కు అండగా నిలిచింది. అత్యాధునిక వైమానిక ఆయుధ సంపత్తిని ఆ దేశానికి అందించింది. మరోపక్క ఇజ్రాయెల్‌కు అమెరికాతో మంచి సంబంధాలు కొనసాగేవి కానీ ఆయుధాలపరంగా మాత్రం ఆ దేశానికి అమెరికా నుంచి ఎలాంటి సాయం అందేది కాదు. దాంతో 1960ల్లో ఫ్రాన్స్ నుంచి విమానాలను, బ్రిటన్ నుంచి యుద్ధ ట్యాంకులను ఇజ్రాయెల్ కొనుగోలు చేసింది.
1948 తరవాత భౌగోళికంగా తమకున్న అనుకూలతలను ఇజ్రాయెల్ సద్వినియోగం చేసుకోవాలనుకుంది. పదిలక్షలకుపైగా వలసదారులను దేశంలోకి స్వాగతించింది. అత్యంత వేగంగా శక్తిమంతమైన సైనిక వ్యవస్థను నిర్మించింది.
1967 నాటికి సొంతంగా అణ్వాయుధాలను రూపొందించుకునే స్థాయికి ఇజ్రాయెల్ చేరింది. రబిన్ నేతృత్వంలో ఇజ్రాయెల్ సైన్యం ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో గెలవడమే లక్ష్యంగా అక్కడి సైనిక శిక్షణ కొనసాగింది.
ఫొటో సోర్స్, Getty Images
1967 నాటికి రబిన్(ఎడమ వైపున్న వ్యక్తి) ఇజ్రాయెలీ సేనలకు నాయకుడిగా మారారు
అరబ్ దేశాల వ్యాప్తంగా ఓ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ శత్రు దేశాలన్నింటినీ ఒకేతాటిపైకి తేవాలని ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ ప్రయత్నించారు. నాజర్ నాయకత్వంలో ఇజ్రాయెల్‌పైన విజయం సాధించగలమని ఇతర అరబ్ దేశాలు భావించేవి. నాజర్ తనకు నమ్మిన బంటైన అబ్దుల్ హకిమ్ ఆమిర్‌ను ఈజిప్ట్ సైనిక దళాలకు నాయకుడిని చేశారు.
కానీ 1967 యెమెన్ యుద్ధంలో ఆమిర్ నాయకత్వంలోని ఈజిప్ట్ సేనలు సమర్థంగా పోరాడలేకపోయాయి. కానీ ఆమిర్కంటే మెరుగైన నాయకుడు నాజర్‌కు కనిపించలేదు. దాంతో ఆయన్ను తప్పించలేదు.
సిరియాలో కూడా రాజకీయ వాతావరణం దెబ్బతింది. ఎప్పటికప్పుడు సైనిక తిరుగుబాట్ల కారణంగా కొత్త నాయకులు ఆ దేశంలో అవతరిస్తూ వచ్చారు.
అరబ్ దేశాలన్నీ తరచూ ఐక్యత, జాతీయవాదం, సామ్యవాదం గురించి మాట్లాడుతుండేవి. కానీ ఆచరణలో మాత్రం అవి కనిపించవు. ఈజిప్ట్, సిరియా తరహాల్లోనే సైన్యాధికారులు తమ దేశాల్లోనూ తిరుగుబాటుకు పురికొల్పి ఎక్కడ తమను గద్దెదించుతారేమోనని జోర్డాన్, సౌదీ రాజులు భయపడేవారు.
ఫొటో సోర్స్, Getty Images
జోర్డాన్ రాజు హుసేన్
జోర్డాన్‌లో పరిస్థితి
జోర్డాన్ రాజు హుసేన్‌కు బ్రిటన్, అమెరికాలతో మంచి సంబంధాలున్నాయి. 1948 యుద్ధం తరవాత ఎలాంటి నష్టం లేకుండా బయటపడ్డ అరబ్ రాజ్యం జోర్డాన్ మాత్రమే.
హుసేన్ తాత అబ్దుల్లాకు పాలస్తీనాలోని యూదులతో రహస్య సంబంధాలుండేవి. దాంతో 1951లో ఆయన్ను జెరూసలెంలో హుసేన్ కళ్లముందే హత్య చేశారు. ఆ మరుసటి రోజే హుసేన్ తొలిసారి తుపాకీ పట్టాడు.
ఏడాది తరవాత, 16ఏళ్ల వయసులో అతడు జోర్డాన్ రాజుగా అవతరించాడు. హుసేన్ హయాంలో జోర్డాన్, ఇజ్రాయెల్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. కానీ పూర్తి స్థాయిలో ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనలేదు.
జోర్డాన్‌లో అధిక భాగం ఎడారి ప్రాంతమే. దేశంలో పాలస్తీనా శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. తమకున్న ప్రతికూలతల గురించి తెలిసే హుసేన్ ఇజ్రాయెల్‌తో రహస్యంగా అనేకసార్లు చర్చలు జరిపారు.
మళ్లీ యుద్ధం
1948 తరవాత ఏదో ఒక రోజు మళ్లీ యుద్ధం ఆరంభమవుతుందనే భావన అందరిలోనూ నెలకొంది. 1967లో ఆ రోజు రానే వచ్చింది. అరబ్ దేశాలు, ఇజ్రాయెల్‌కు మధ్య తరచూ చోటుచేసుకునే సరిహద్దు వివాదాలు చిలికి చిలికి యుద్ధానికి దారితీశాయి.
అందరి దృష్టీ ఇజ్రాయెల్‌కు ఉత్తర దిక్కులో ఉన్న సిరియా సరిహద్దు ప్రాంతంపైనే పడింది. ఆ భూభాగంపై నెలకొన్న వివాదంతో పాటు, జోర్డాన్ నదిని ఇజ్రాయెల్ జాతీయ వాటర్ గ్రిడ్‌కు దూరంగా మళ్లించే ప్రయత్నాలు సిరియా చేయడంతో ఆ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది.
ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడుతున్న పాలస్తీనా గెరిల్లాలకు సిరియా ఆశ్రయం కల్పించింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంపై అమెరికాకు పూర్తి అవగాహన ఉంది. అరబ్ దేశాలన్నీ ఏకమైనా కనీసం ఐదేళ్ల దాకా ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేవనే నమ్మకం నాటి అమెరికా సైన్యాధికారుల్లో నెలకొంది.
‘మంచి శిక్షణ, ఆయుధాలు కలిగిన ఇజ్రాయెల్ సైన్యం మునుపెన్నడూ లేని విధంగా యుద్ధానికి సన్నద్ధంగా ఉంది. అక్కడి సైనికులు సమరోత్సాహంతో ఉన్నారు. తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం యుద్ధంలో పాల్గొనడానికి వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు’ అని టెల్ అవీవ్‌లోని బ్రిటిష్ బృందం 1967లో తన నివేదికలో పేర్కొంది.
పాలస్తీనా ఆశ్రయం కల్పించిన గెరిల్లాలు కంచెను దాటి ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకెళ్లారు. దాంతో ఇజ్రాయెల్ వాళ్లపై టెర్రరిస్టులనే ముద్ర వేసింది. వాళ్లను చాలా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.
ఇజ్రాయెలీ దళాలు
మే 1967
2,64,000
సైన్యం
-
800 యుద్ధ ట్యాంకులు
-
300 యుద్ధ విమానాలు
యుద్ధానికి మార్గం
మొదట జోర్డాన్ ఆక్రమణలో ఉన్న వెస్ట్ బ్యాంక్‌లోని సమువా గ్రామాన్ని లక్ష్యంగా చేసుకొని 1966లో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఆ దాడి వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లను ఆగ్రహానికి గురిచేసింది. ఆ పరిణామంతో జోర్డాన్ రాజు హుసేన్ హతాశుడయ్యారు.
తాను మూడేళ్లుగా ఇజ్రాయెల్‌తో రహస్యంగా చర్చలు జరుపుతున్నాననీ, అయినా కూడా ఆ దేశం తమ భూభాగంపై దాడి చేసిందనీ అమెరికా సీఐఏతో హుసేన్ చెప్పారు.
అమెరికా కూడా జోర్డాన్‌పై సానుభూతి చూపింది. సమువా దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది.
తన పదవి ప్రమాదంలో ఉందని, ఆగ్రహంతో ఉన్న పాలస్తీనియన్లు తనను కుర్చీ నుంచి దించేస్తారనే అనుమానం హుసేన్‌లో బలపడింది. తమ ఆర్మీలో ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్‌కు అనుకూలంగా ఉన్న సైన్యాధికారుల్ని సాకుగా చూపి, ఇజ్రాయెల్ దాడి చేసి వెస్ట్ బ్యాంక్‌ను, తూర్పు జెరూసలెంను ఆక్రమిస్తుందని భావించారు.
ఇరాక్‌లో తన కజిన్, అక్కడి రాజు ఫైజల్‌ను కుట్ర పన్ని హత్య చేసినట్టుగా తనపై ఎలాంటి కుట్రా జరగకూడదని హుసేన్ భావించారు.
ఈ క్రమంలో ఇజ్రాయెల్-సిరియా సరిహద్దుల్లో పరిస్థితి సమస్యాత్మకంగా మారుతూ వచ్చింది. వివాదాస్పద భూభాగంలోకి పాలస్తీనియన్లు చొరబడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు హుసేన్ చెబుతున్నా, సిరియా మాత్రం అక్రమ చొరబాటుదార్లను ప్రోత్సహించింది.
మరోవైపు ఇజ్రాయెల్ కూడా వివాదాస్పద భూభాగంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆయుధాలు అమర్చిన ట్రాక్టర్ల సాయంతో అక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది.
ఫొటో సోర్స్, Getty Images
1965లో జెరూసలెం
ఈ పరిణామాలన్నీ 1967, ఏప్రిల్ 7 నాటికి ఇజ్రాయెల్, సిరియాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీశాయి. దాంట్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది.
ఇజ్రాయెల్ చేసిన పోరాటాన్ని చూసి జెరూసలెంలోని యువ పాలస్తీనియన్లు ఆశ్చర్యపోయారు. యుద్ధం సమయంలో ఈజిప్ట్ ఎక్కడికి వెళ్లిందని వాళ్లు ప్రశ్నించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ తన మాటలను చేతల్లో చూపాలనే ఒత్తిడి మొదలైంది.
యుద్ధంలో విజయంపై ఇజ్రాయెల్‌లో ఆనందాలు వెల్లివిరిశాయి. కానీ ఆ దేశంలోని కొందరు సీనియర్ రాజకీయ నేతలు, సైన్యాధికారులు మాత్రం ఇజ్రాయెల్ యుద్ధానికి ముందడుగు వేయడం సరికాదన్నారు.
మంటపెట్టిన సోవియట్ యూనియన్
ఇజ్రాయెల్ ఏదో బలమైన అడుగే వేయనుందనే అనుమానం సిరియా, ఈజిప్ట్‌లతో పాటు బ్రిటన్, అమెరికా అధికారుల్లోనూ మొదలైంది. ఓ వార్తా సంస్థ చూపిన అత్యుత్సాహం, ఈ అనుమానాన్ని మరింత బలపర్చింది.
‘సిరియన్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్‌లో అణచివేత చర్యలను కొనసాగిస్తే, పరిమిత సైనిక చర్య ద్వారా సిరియాలో సైనిక పాలనను ఇజ్రాయెల్ కూల్చేస్తుంది’ అని ఓ వార్తా పత్రిక పేర్కొంది. ఇజ్రాయెల్ నిఘా విభాగాధిపతి అహరోన్ యారివ్ ఆ సమాచారాన్ని అందించినట్లు తెలిపింది. కానీ ఉన్న అన్ని అవకాశాల్లో అది చిట్టచివరిది మాత్రమేనని ఆయన చెప్పారు. కానీ ఆ వార్త మరోలా బయటికొచ్చింది. సిరియాతో పాటు ఇజ్రాయెలీ మీడియా కూడా దాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఈలోగా సోవియట్ యూనియన్ కూడా యుద్ధానికి ఆజ్యం పోసింది. సిరియా సరిహద్దులోకి ఇజ్రాయెల్ భారీ సంఖ్యలో బలగాల్ని మోహరిస్తోందని, మరో వారం రోజుల్లో అది దాడికి దిగుతుందని ఈజిప్ట్‌ను మే13న హెచ్చరించింది.
ఫొటో సోర్స్, Getty Images
మోషే దయాన్
అసలు యుద్ధ హెచ్చరికను సోవియట్ యూనియన్ ముందుగా ఎందుకు జారీ చేసిందనే విషయం ఇప్పటికీ చర్చనీయాంశమే.
ఇజ్రాయెల్ అణ్వాయుధ ప్రణాళికలను నిరోధించాలని సోవియట్ యూనియన్ భావించిందనీ, అందుకే కావాలనే యూఎస్ఎస్ఆర్ ఆ హెచ్చరిక జారీచేసిందనీ ఇజ్రాయెల్‌కు చెందిన చరిత్రకారులు ఇసబెల్లా గినర్, గిడియాన్ రెమెజ్ తెలిపారు.
అమెరికాకు సమస్యలు సృష్టించేందుకే అరబ్ దేశాలను ఇజ్రాయెల్‌పై ఉసిగొల్పేందుకు సోవియట్ యూనియన్ ప్రయత్నిస్తోందని నాటి సోవియట్ అధికారి ఒకరు సీఐఏకు తెలిపారు.
అలా ముందు నుంచీ అందరూ ఊహిస్తున్నట్టుగానే ఇజ్రాయెల్, అరబ్ దేశాలు తమంతట తాముగానే నేరుగా సంక్షోభంలోకి ప్రవేశించాయి.
నాజర్ - ది గ్యాంబ్లర్
ఇజ్రాయెల్ గురించి సోవియట్ యూనియన్ హెచ్చరించిన 24గంటల్లో ఈజిప్ట్ సుప్రీమ్ కమాండర్, ఫీల్డ్ మార్షల్ ఆమిర్ సైన్యాన్ని యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉండమని హెచ్చరించారు.
కానీ తమ అత్యున్నత బలగాలతో సహా, సగానికి పైగా సైన్యం యెమెన్‌లో కూలిపోయిందనీ, తమ దేశం ఇజ్రాయెల్‌తో పోరాడే స్థితిలో ఏమాత్రం లేదనీ ఈజిప్ట్ సైనిక కార్యకలాపాల చీఫ్, లెఫ్ట్‌నెంట్ జనరల్ అన్వర్ అల్-ఖదీ, ఆమిర్‌కు సూచించారు.
యుద్ధం తమ ప్రణాళికలో లేదనీ, ఇజ్రాయెల్ నుంచి సిరియాకు పొంచి ఉన్న ముప్పుని దృష్టిలో పెట్టుకొనే సైనిక ప్రదర్శనకు దిగుతున్నామనీ ఆమిర్ చెప్పారు.
రెండ్రోజుల తరవాత సిరియా సరిహద్దులో 1956 నుంచి కాపు కాస్తున్న ఐరాస శాంతి పరిరక్షకులను సైతం ఈజిప్ట్ తప్పించి, సినాయ్ ఏడారిలోకి బలగాలను మోహరించింది. అలా తనంతట తానుగా సంక్షోభ స్థితిలోకి అడుగుపెట్టింది.
ఫొటో సోర్స్, Getty Images
ఐరాస శాంతి పరిరక్షకులను ఈజిప్ట్ వెనక్కు పంపింది
ఇజ్రాయెల్ ఆర్మీ మొదట్నుంచీ ఈజిప్ట్ విషయంలో ఓపికగానే ఉంది. అలాంటిది ఈజిప్ట్ ముందుగా సైన్యాన్ని మోహరించడం తమను ఆశ్చర్యపరిచిందనీ, యుద్ధానికి ఈజిప్ట్ సిద్ధంగా ఉందనడాన్ని ఆ చర్య సూచిస్తోందని ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగ అధికారి ష్లోమో గజిట్, అమెరికా దౌత్యవేత్తలతో చెప్పారు.
దానికితోడు ఈజిప్ట్‌లోని ప్రభుత్వ రేడియో స్టేషన్ నిరంతరాయంగా ఇజ్రాయెల్‌కు రక్తపాతానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అరబ్ దేశాలకు తన గొంతును వినిపించడానికి ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ ఆ రేడియో స్టేషన్‌ను సాధనంగా ఉపయోగిస్తారు.
ఇజ్రాయెల్ నౌకా వాణిజ్యాన్ని నియంత్రించేందుకు నాజర్ మే22న ఏలట్ పోర్ట్ దగ్గర నిషేదాజ్ఞలను విధించారు. అలా 1956లో ఎత్తేసిన నిషేధాన్ని ఆయన మళ్లీ పునరుద్ధరించారు. ఆ నిషేదం ఇజ్రాయెల్‌కు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని ఈజిప్ట్‌కు తెలుసు.
ఆపై ‘ఇజ్రాయెల్ యుద్ధాన్ని కోరుకుంటే, మేం దాన్ని స్వాగతిస్తున్నాం’ అని నాజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ సమయంలో ఎలాంటి చీకూ చింతాలేనట్టుగా వైమానిక దళ అధికారులతో కలిసి నాజర్ దిగిన ఓ ఫొటో కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మొత్తం అరబ్ సేనలు
ఈజిప్ట్,సిరియా,జోర్డన్ - మే 1967
3,40,000
సైనిక బలగం
-
1800 యుద్ధ ట్యాంకులు
-
660 యుద్ధ విమానాలు
పోర్టు వివాదం
నాజర్ ప్రకటన విడుదల చేసిన 42నిమిషాలకు అమెరికా స్పందించింది. ఆ చర్యపై అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ కోపంగా ఉన్నట్టు తెలిపింది.
ఆ సమయంలో ఐరాస కార్యదర్శి యూ థంట్ కూడా శాంతి చర్చల కోసం కైరో బయల్దేరారు. మొదటి తూటాను ఈజిప్ట్ పేల్చదని గతంలో తాను చేసిన వాగ్దానాన్నే నాజర్ పునరుద్ఘాటించారు.
కానీ ఏలట్ పోర్టు దగ్గర దిగ్బంధాన్ని తొలగించకపోతే యుద్ధం అనివార్యమని యూ థంట్ పేర్కొన్నారు.
ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్, నౌకా వాణిజ్యానికి కేంద్రమైన స్ట్రెయిట్స్ ఆఫ్ టిరాన్ గేట్లను మూసేయడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. 48గంటల్లో 2.5లక్షల మందికిపైగా సైనికులను సరిహద్దులో మోహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని లెవీ ఎష్కోల్ నిర్ణయించారు.
రాజ్యంలో మగవాళ్లందరూ సైన్యంలో భాగమవ్వాలని ఆదేశించారు. దాంతో 50ఏళ్లు లోపున్న మగవాళ్లంతా యూనిఫాం ధరించి వివిధ సైనిక విధుల్లో చేరారు.
జరుగుతున్న పరిణామాలన్నీ ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్ రబిన్ను ఒత్తిడిలోకి నెట్టేశాయి. దాంతో ఆయన అదేపనిగా సిగరెట్లను కాలుస్తూ 24గంటల పాటు గాఢ నిద్రలోకి జారుకున్నారు. మళ్లీ కోలుకొని విధుల్లో చేరారు.
యుద్ధం జరగకుండా నివారించాలని వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్ యుద్ధ విమానాల పైలట్లతో నాజర్, 1967
1956లో బ్రిటన్, ప్రాన్స్‌తో చేసుకున్న రహస్య ఒప్పందం మేరకు ఈజిప్ట్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. దాంతో ఇజ్రాయెల్‌ది దుందుడుకు స్వభావమని అమెరికా పేర్కొంది. తాము ఆక్రమించిన భూభాగం నుంచి వెంటనే వెనక్కు రావాలని ఇజ్రాయెల్‌ను అమెరికా ఒత్తిడి చేసింది.
అందుకే మళ్లీ తమకు మాట రాకూడదని అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌తో చర్చించేందుకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బా ఎబాన్ అమెరికా బయల్దేరారు. ఏం జరిగినా సరే మొదటి తూటా ఇజ్రాయెల్ పేల్చకూడదని జాన్సన్ సూచించారు. వాళ్లు యుద్ధాన్ని కోరుకుంటే, వాళ్లను నాశనం చేయడానికి ఎంతో సమయం పట్టదని ఆయన పేర్కొన్నారు.
యుద్ధం తలెత్తకుండా గేట్లను తెరిపించే మార్గాన్ని చూస్తానని, కానీ దానికి సమయం పట్టొచ్చని జాన్సన్ అన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎబాన్ కూడా జాన్సన్ సూచనతో సానుకూలంగానే ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ సైన్యాధికారుల్లో అప్పటికే సహనం నశించింది. వాళ్లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ యుద్ధానికి వెళ్లకుండా రెండు వారాలపాటు ఎదురు చూడాలని క్యాబినెట్ నిర్ణయించింది. దాంతో ఆర్మీ అధికారుల్లో ఆగ్రహం పెరిగిపోయింది.
ప్రభుత్వం స్ట్రెయిట్స్ ఆఫ్ టిరాన్ గేట్లను తెరిపించేందుకు మాత్రమే చూస్తుంది. కానీ ఆర్మీ అధికారుల లక్ష్యం అదొక్కటే కాదు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నాజర్ అరబ్ దేశాలన్నింటినీ ఏకం చేస్తున్నాడనీ, ఇజ్రాయెల్ సరిహద్దులకు సైన్యాన్ని మోహరిస్తున్నాడనీ వాళ్లకు తెలుసు. వాటిని నివారించాలంటే యుద్ధమే శరణ్యమని వాళ్లు భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెలీలను తొలి తూటా పేల్చొద్దని అమెరికా అధ్యక్షుడు జాన్సన్ కోరారు
సంశయంలో జోర్డాన్
1956నుంచి అరబ్ దేశాల్లో నాజర్ తిరుగులేని నాయకుడిగా గుర్తింపు సాధించారు. వాళ్లంతా ద్వేషించే ఇజ్రాయెల్‌కు ఎదురు నిలబడినందుకు రాజకీయంగా ఆయన స్థానం మరింత బలపడింది.
మే28న నాజర్ కైరోలో అంతర్జాతీయ జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పరిణామాలకు ఇజ్రాయెల్ కారణమనీ, పాలస్తీనియన్లను అణచివేయడానికి వాళ్లు తీసుకుంటున్న చర్యల కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనీ పేర్కొన్నారు.
1948లో ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను దోచుకొని, వెళ్లగొట్టిందని చెప్పారు. సిరియాలో కుట్ర పన్ని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించినందుకు వాళ్లకు తగని శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.
కానీ జోర్డాన్ రాజు హుసేన్ మాత్రం నాజర్‌ను విశ్వసించలేదు. ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం జోర్డాన్‌లోని వెస్ట్ బ్యాంక్ పైనే ఉంటుందని హుసేన్ గ్రహించారు. జోర్డాన్ లోని సీనియర్ సైన్యాధికారులు మాత్రం హుసేన్‌ను నాజర్‌కు మద్దతుగా నిలవమని ఒత్తిడి చేశారు.
హుసేన్‌కు అది జీవన్మరణ సమస్యలా మారింది. దాంతో తప్పని పరిస్థితుల్లో ఆయన కైరో వెళ్లి నాజర్‌తో జోర్డాన్-ఈజిప్ట్ డిఫెన్స్ ఒప్పందం కుదర్చుకున్నారు.
నాజర్‌తో చేతులు కలపడానికి హుసేన్‌కు రెండు కారణాలున్నాయి. ఒకవేళ నాజర్‌కు మద్దతివ్వకపోతే స్వదేశంలోని పాలస్తీనియన్లలో ఆగ్రహం పెరిగి తనను గద్దె దించే కుట్ర జరుగుతుందని ఆయన భావించారు. యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌లోకి ప్రవేశించకుండా ఈజిప్ట్ సైన్యం కొంత కాలం అడ్డుకుంటుందనీ, ఈలోగా ఐరాస రంగంలోకి దిగి కాల్పుల విరమణను అమలు చేస్తుందని, ఏది జరిగినా తనకు మంచిదేనని ఆయన అనుకున్నారు.
మే 30న హుసేన్ కైరో వెళ్లి నాజర్‌తో ఒప్పందం కుదుర్చుకొని తిరిగొచ్చేసరికి స్వదేశంలో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కారుతో సహా పైకి లేపి ఆయన్ను ఊరేగించాలని ప్రయత్నించారు. వాళ్ల ఆనందం హుసేన్ నాజర్‌కు మద్దతిచ్చారని కాదు.. హుసేన్తో చేతులు కలపడానికి నాజర్ అంగీకరించినందుకు.
ఫొటో సోర్స్, Getty Images
హుసేన్, నాజర్‌లు 1967లో డిఫెన్స్ ఒప్పందం చేసుకున్నారు
యద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్
తమంతట తాముగా యుద్ధానికి దిగితే కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఇజ్రాయెల్ సైన్యానికి ఉండేది. కానీ అక్కడ ఆర్మీకి ఉన్న ఆంక్షల కారణంగా తమ బలాబలాల్ని బయటకు వెల్లడించలేరు.
మరోపక్క అరబ్ దేశాలు మాత్రం రేడియో ద్వారా ఇజ్రాయెల్‌కు భారీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.
క్రమంగా ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం వేలాది శవపేటికలను సిద్ధం చేసింది. పార్కులను అత్యవసర స్మశానాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేసింది. లక్షల యూనిట్ల రక్తాన్ని సైతం సేకరించి పెట్టింది.
కానీ మే28న రేడియో ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని లెవీ ఎష్కోల్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సైన్యాన్ని నిరుత్సాహపరిచింది. ప్రసంగం ఆద్యంతం ఆయన తడబడుతూనే ఉన్నారు.
దాంతో సైన్యంలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. ప్రభుత్వాన్ని పిరికిపందగా భావించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ ఏర్పడ్డాక అక్కడ పుట్టిన యువకులకు కూడా ప్రధాని ప్రసంగం రుచించలేదు. ఎష్కోల్ ఆలోచనలకు, ఆయన తరవాత తరంలో పుట్టిన యువ ఇజ్రాయెలీల ఆలోచనలకు మధ్య అంతరం పెరిగిపోయింది.
ప్రధాని ఎష్కోల్ రక్షణ మంత్రిగా కూడా ఉండేవారు. కానీ ఒత్తిడి పెరగడంతో ఆయన ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఒక కన్ను మాత్రమే ఉన్న ఆర్మీ జనరల్ మోషే దయాన్ ఆ పదవి చేపట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌లో ప్రజల సన్నాహాలు
వార్ ప్లాన్ మొదలు
ఈజిప్ట్‌లో నాజర్ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేశారు. ఈజిప్ట్ దగ్గర ఆధునిక యుద్ధ విమానాలున్నాయి కానీ సైన్యం మాత్రం బలహీనంగా ఉంది.
అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు యుద్ధం లేకుండానే టిరాన్ గేట్లను బలవంతంగా ఎత్తించాలనుకున్నా అది కుదరలేదు.
ఇజ్రాయెల్ ఆర్మీ జనరల్స్ కూడా జూన్ 2న క్యాబినెట్ ముందు యుద్ధానికి తెరతీయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. తాము యుద్ధంలో కచ్చితంగా గెలుస్తామనీ, కానీ యుద్ధం ఎంత ఆలస్యమైతే, పరిస్థితులు అంత క్లిష్టంగా మారతాయని వారు పేర్కొన్నారు.
ఇజ్రాయెలీ స్పై ఏజెన్సీ హెడ్ మీర్ అమిత్ అమెరికా వెళ్లి ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మెక్ నమారాను కలిశారు. తాము యుద్ధానికి దిగబోతున్నట్లు చెప్పారు. తిరిగొచ్చేప్పుడు ఓ విమానం నిండా గ్యాస్ మాస్కులతో పాటు వాషింగ్టన్ అంబాసిడర్ అబే హర్మాన్‌ను కూడా వెంటబెట్టుకొని జూన్ 3న నేరుగా ప్రధాని ఎష్కోల్ ఇంటికి వెళ్లారు.
అక్కడే క్యాబినెట్ సమావేశం జరిగింది. మరో వారం రోజులు వేచి చూద్దామని హర్మాన్ అన్నారు. కానీ మోషే దయాన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆలస్యమయ్యే కొద్దీ వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని, తొలి దెబ్బ తామే కొట్టాలని చెప్పారు. దాంతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతోందని క్యాబినెట్లో అందరికీ స్పష్టమైపోయింది.
మరుసటి రోజు ఉదయాన్నే యుద్ధ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.
జూన్ 4 లేదా 5న ఇజ్రాయెల్ దాడి చేస్తుందని ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ కూడా ఊహించారు. ఇజ్రాయెల్, జోర్డాన్ వ్యాలీ దిక్కుగా ఇరాక్ సాయుధ బలగాలు కదుల్తుండడాన్ని ఇజ్రాయెల్ సహించలేదని, కాబట్టి వారు యుద్ధానికి కాలుదువ్వుతారని ఆయన అంచనా వేశారు.
ఫొటో సోర్స్, Alamy
ఇజ్రాయెల్ ప్రధాని ఎష్కోల్ విధానం యువ ఇజ్రాయెలీలకు నచ్చలేదు
ఇజ్రాయెల్ బాంబుల వర్షం
1967 జూన్ 5 ఉదయం 7.40కు అరబ్ దేశాలతో మరో యుద్ధానికి ఇజ్రాయెల్ శంఖం పూరించింది. అరబ్ దేశాలకు చెందిన వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులను మొదలుపెట్టింది. దానిపేరు ‘ఆపరేషన్ ఫోకస్‘. మొదట ఈజిప్ట్‌తో పని ప్రారంభించింది.
ఆ దాడులు అప్పటికప్పుడు అనుకొని చేసినవి కాదు. చాలా ఏళ్లపాటు ఇజ్రాయెల్ సైనికులు వైమానిక దాడులకు అవసరమైన కసరత్తులు చేశారు. అరబ్ దేశాలపై కొన్ని వందల నిఘా ఆపరేషన్లు నిర్వహించారు. ఈజిప్ట్, జోర్డాన్, సిరియాలోని ప్రతి ఒక్క వైమానిక స్థావరం ఎక్కడుందో పక్కాగా తెలుసుకున్నారు.
ఆ స్థావరాలకు సంబంధించిన ప్రతి మ్యాప్ ఇజ్రాయెల్ యుద్ధ విమానాల పైలట్ల చేతికి అందింది. చాలా పకడ్బందీగా ఇజ్రాయెలీలు ఆ ప్రణాళికను అమలు చేశారు. అలాంటి మెరుపు దాడిని ఈజిప్ట్ అసలు ఏమాత్రం ఊహించలేదు.
ఈజిప్ట్ ఫీల్డ్ మార్షల్ ఆమిర్, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో చర్చించేందుకు ఆ రోజు ఉదయాన్నే సినాయ్‌లోని వైమానిక స్థావరానికి చేరుకున్నారు. వాళ్లు సమావేశం మొదలుపెట్టే సమయానికి ఆ స్థావరంపై ఇజ్రాయెలీ సేనల బాంబుల దాడి మొదలైంది.
ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్ ఆర్మీ అధికారులకు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈజిప్ట్‌లోనే అంతర్గతంగా ఏదో కుట్ర జరిగిందని కొందరికి అనుమానం కలిగింది తప్ప, ఇజ్రాయెలీ సేనలు అలా దాడి చేశాయని మాత్రం వారనుకోలేదు.
ఎలాగోలా ఆమిర్ విమానంలో అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. విమానం గాల్లోకైతే లేచింది కానీ, దాన్ని ఎక్కడ దింపాలో పైలట్‌కు అర్థం కాలేదు. ఈజిప్ట్‌లోని దాదాపు అన్ని వైమానిక స్థావరాలపైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది.
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఉన్న సైనిక ఉన్నతాధికారి ఎజెర్ వైజ్మెన్ సంతోషం పట్టలేకపోయారు. మెరుపుదాడి ద్వారా ప్రత్యర్థులపై పైచేయి సాధించనట్లు ఆయనకు అర్థమైంది. వెంటనే తన భార్యకు ఫోన్ చేసి ‘మనం యుద్ధంలో గెలిచాం’ అని అరిచారు.
రోజు గడిచేసరికి జోర్డాన్, సిరియా వైమానిక దళాల్ని ఇజ్రాయెల్ దాదాపుగా నాశనం చేసింది. గగనతలాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇక మిగిలింది ఈజిప్ట్‌ను ధ్వంసం చేసే పని పూర్తి చేయడమే.
ఫొటో సోర్స్, Empics
ఈజిప్ట్ అసత్య ప్రచారం
జోర్డాన్ రాజును యుద్ధంలో అడుగుపెట్టొద్దని ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించింది. అలా చేస్తే జోర్డాన్‌ను వదిలేస్తామని కూడా చెప్పింది. కానీ హుసేన్ వినలేదు. మంచి శిక్షణ పొందిన జోర్డాన్ సైనికులను సమర్థత లేని ఈజిప్ట్ జనరల్ చేతిలో పెట్టారు.
తాను యుద్ధంలోకి ప్రవేశించకపోతే స్వదేశంలోని పాలస్తీనయన్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ఆయన గ్రహించారు. దాంతో అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యారు.
వైమానిక దళం తరవాత ఇజ్రాయెలీ సైన్యం కూడా భూమార్గం ద్వారా ఈజిప్ట్‌లోకి చొచ్చుకెళ్లడం మొదలుపెట్టింది. కైరోలోని ఈజిప్ట్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని అధికారులకు తాము యుద్ధాన్ని సగం ఓడిపోయామనే విషయం అర్థమైంది.
కానీ అరబ్ రేడియో మాత్రం పూర్తిగా విరుద్ధమైన వార్తలను ప్రసారం చేసింది. ఆ రోజు రాత్రి 08:17కు ప్రసారమైన వార్తల్లో.. ఈజిప్ట్ యుద్ధ ట్యాంకులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని, 86 ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు నేల కూలాయనీ పేర్కొన్నారు. అవన్నీ అబద్దాలే. జనం మాత్రం వాటిని నిజమని నమ్మారు. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
తమకున్న అత్యుత్తమ ఆయుధాల్లో రేడియో ఒకటని, దాని సాయంతో ప్రజల్లో ధైర్యం నూరిపోయాలని ఈజిప్ట్ భావించింది. అందుకే అసత్య వార్తలను ప్రసారం చేసింది. వాటిని నమ్మిన ప్రజలు ‘పరాజయానికి’ సంబరాలు చేసుకున్నారు.
ఫొటో సోర్స్, Empics
ధ్వంసమైన ఈజిప్ట్ యుద్ధ విమానాలు
అరబ్ నేలపై ఇజ్రాయెల్ జెండా
5 రోజులు గడిచేసరికి అరబ్ దేశాలను ఇజ్రాయెల్ చిత్తు చేసింది. ఈజిప్ట్‌లోని గాజా స్ట్రిప్, సినాయ్ ఎడారులను ఆక్రమించింది. సిరియాలోని గోలన్ హైట్స్‌ను కైవసం చేసుకుంది. జోర్డాన్‌లోని వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలలో జెండా పాతింది.
దాదాపు 2వేల సంవత్సరాలలో తొలిసారిగా జెరూసలెంలోని అనేక యూదుల పవిత్ర స్థలాలు యూదుల అధీనంలోకే వచ్చాయి. చాలామంది పాలస్తీనియన్లు హతమయ్యారు. కొందరు పారిపోయారు. ఇంకొందర్ని తరిమికొట్టారు.
ఘోరమైన పరాజయానికి బాధ్యత వహించి ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ మొదట తన పదవికి రాజీనామా చేశారు. కానీ లక్షలాది ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి రాజీనామాకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టారు. 1970లో చనిపోయేవరకూ ఆయన ఆ పదవిలోనే ఉన్నారు.
ఈజిప్ట్ ఫీల్డ్ మార్షల్ ఆమిర్ అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అతడికి విషం పెట్టి చంపారని అతడి కుటుంబ సభ్యులు భావించారు.
జోర్డాన్ రాజు హుసేన్ తూర్పు జెరూసలెంను కోల్పోయారు. కానీ కుర్చీ మాత్రం మిగిలింది. తరవాత కూడా ఆయన ఇజ్రాయెల్‌తో రహస్య చర్చలు కొనసాగించారు. 1994లో శాంతి ఒప్పందం చేసుకున్నారు.
1970లో సిరియా నావికా దళ కమాండర్ హఫీజ్ అల్-అసద్ ఆ దేశంలో అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు. 2000లో చనిపోయే వరకు ఆయన సిరియా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపైన అతడి కొడుకు బషర్ అల్-అసద్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఇజ్రాయెల్ ప్రధాని ఎష్కోల్ 1969లో గుండెపోటుతో చనిపోయారు. రక్షణ మంత్రి పదవి నుంచి తప్పించడాన్ని ఆయన చివరి వరకూ జీర్ణించుకోలేకపోయారని ఎష్కోల్ భార్య మిరియమ్ పేర్కొన్నారు.
ఎష్కోల్ తరవాత గోల్డా మీర్ ఇజ్రాయెల్ పాలన చేపట్టారు. ఈజిప్ట్, సిరియాలు మెరుపు దాడులకు ప్రణాళిక రచిస్తున్నాయని 1973లో ఆయనకు హెచ్చరికలు అందాయి. కానీ 1967 విజయం తాలూకు గర్వం ఇజ్రాయెలీలను వదిలిపోలేదు.
దాంతో తరవాత జరిగిన యుద్ధంలో తమను తాము రక్షించుకోవడానికి అమెరికా సరఫరా చేసిన భారీ ఆయుధ సంపత్తిపై ఆధారపడాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో ఈజిప్ట్ మెరుగ్గా పోరాడటంతో వారి పరువు దక్కింది. ఆపైన ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్, ఇజ్రాయెల్‌తో చారిత్రక శాంతి ఒప్పందానికి తెరతీశారు.
ఫొటో సోర్స్, Getty Images
తూర్పు జెరూసలెంలోని డోమ్ ఆఫ్ రాక్‌ను చేరుతున్న ఇజ్రాయెలీ సేనలు
యుద్ధానంతర పరిణామాలు
1967 తరవాత ఇజ్రాయెల్‌ను అమెరికా కొత్త దృష్టితో చూడటం మొదలుపెట్టింది. మూడు అరబ్ దేశాలను యువ ఇజ్రాయెలీలు ఓడించిన తీరు అమెరికాను ఆశ్చర్యపరిచింది.
పాలస్తీనియన్లకు చెందిన భూభాగాన్ని ఇజ్రాయెల్ క్రమంగా ఆక్రమించసాగింది. యాభై ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ ఆక్రమణ కొనసాగుతోంది. తూర్పు జెరూసలెంను, గోలన్ హైట్స్‌ను తమతో కలుపుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతున్నా, అంతర్జాతీయ సమాజం మాత్రం దాన్ని గుర్తించట్లేదు.
ఆ యుద్ధం అనంతరం చెలరేగిన హింస, ఆక్రమణలు, వలసలు, జెరూసలెం వివాదం లాంటివి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్ మొదటి ప్రధాని డేవిడ్ మెన్ గురియన్ మాట్లాడుతూ.. తమది కాని భూమిలో ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమనీ, శాంతి ఒప్పందం జరిగినా, జరగకపోయినా జెరూసలెంను అట్టిపెట్టుకొని మిగతాదంతా అరబ్‌లకు తిరిగిచ్చేయాలనీ అన్నారు.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బా ఎబాన్ కూడా ఆక్రమిత భూమి యుద్ధాన్ని స్వాగతిస్తుందని పేర్కొన్నారు. కానీ గెలుపు ఇచ్చిన కిక్కులో ఉన్న సైనికులూ, ప్రజలూ ఎలాంటి సందేశాల్నీ వినడానికి సిద్ధంగా లేరు.
ఫొటో సోర్స్, Getty Images
చాలామంది ఇజ్రాయెలీలు ఆ గెలుపు తమకు దేవుడు ప్రసాదించిందిగా భావించారు. దేవుడు ఇచ్చిన భూమిని తిరిగిచ్చేయడం సరికాదని అనుకున్నారు. మరోపక్క పాలస్తీనియన్లు కూడా ఆ భూమిని తమదిగా భావిస్తున్నారు. తమ పవిత్ర స్థలాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వారు అనుకుంటున్నారు.
ఆగస్టులో సూడాన్‌లోని ఖార్టోమ్‌లో జరిగిన సదస్సులో ఇజ్రాయెల్‌తో చేతులు కలపడానికి అరబ్ దేశాలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తమను అవమానించిన ఇజ్రాయెల్‌తో చర్చలకు, శాంతికీ తాము ఏమాత్రం సిద్ధంగా లేమని అవి తేల్చి చెప్పాయి.
1967లో అరబ్ దేశాల ఓటమి తరవాత పాలస్తీనియన్ జాతీయోద్యమం ఊపందుకుంది. అంతకుముందు నాజర్ చేతిలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కీలుబొమ్మలా ఉండేది. కానీ ఆ తరవాత యాసర్ అరాఫత్, అతడి అనుచరులు పీఎల్‌ఓను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
1968లో కేవలం మూడు నెలల్లోనే ఇజ్రాయెల్‌లో అనేక దాడులకు వాళ్లు పాల్పడ్డారు. జోర్డాన్‌లోని కరామే శరణార్థుల శిబిరాల్లో వాళ్లు తలదాచుకునేవారు. చివరికి ఓసారి వివాదం ముదరడంతో కరామే శిబిరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
100కు పైగా పీఎల్ఓ సభ్యులు చనిపోయారు. పాలస్తీనియన్లు వాళ్లను జాతీయ హీరోలుగా కీర్తించారు. సంస్థ తన ఉనికిని కోల్పోతున్న సమయంలో అరాఫత్ పీఎల్ఓ ఛైర్మన్‌గా మారి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన ఉగ్రవాదులుగా ఇజ్రాయెల్ వారిపై ముద్ర వేసింది.
ఫొటో సోర్స్, Getty Images
వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించిన ఇజ్రాయెలీ సేనలు
యుద్ధం తరవాత ఎవరేమయ్యారు?
ఇత్జాక్ రబిన్: 1970ల్లో, 1992-95 మధ్య రెండు దఫాలు ఇజ్రాయెల్ ప్రధానిగా సేవలందించారు. పాలస్తీనియన్లతో చారిత్రక ఓస్లో శాంతి ఒప్పందానికి ఆయన తెరతీశారు. అందుకుగానూ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి సైతం దక్కింది. కానీ ఆ ఒప్పందం కారణంగానే 1995లో ఇజ్రాయెల్‌లో ప్రధానిగా ఉండగానే ఆయన్ను హత్య చేశారు.
జోర్డాన్ రాజు హుసేన్: 1970ల్లో జోర్డాన్ నుంచి పీఎల్ఓ బలగాలను బహిష్కరించారు. 1973లో ఇజ్రాయెల్‌పై యుద్ధంలో చేతులు కలపాలన్న ఈజిప్ట్, సిరియా ప్రతిపాదనలను తిరస్కరించారు. అనేక చర్చల అనంతరం 1994లో ఇజ్రాయెల్‌తో ఆయన శాంతి ఒప్పందం చేసుకున్నారు. 1999లో హుసేన్ చనిపోయారు.
హఫీజ్ అల్-అసద్: 1970లో కుట్ర ద్వారా సిరియా అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ మరుసటి ఏడాది జరిగిన రిఫరెండంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2000లో చనిపోయేవరకూ ఆయన సిరియాను పాలించారు. 1973లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
గమాల్ అబ్దెల్ నాజర్: 1970లో గుండెపోటుతో చనిపోయారు. ఆ తరవాత ఆయన స్థానంలో ఈజిప్ట్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అన్వర్ సాదత్, 1979లో ఇజ్రాయెల్‌తో చారిత్రక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. 1981లో ఆర్మీ అధికారులే ఆయన్ను హత్య చేశారు.
ఫొటో సోర్స్, AFP
51ఏళ్లు గడిచినా పరిస్థితి మారలేదు
మానని గాయాలు
1967 యుద్ధం తరవాత అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన ఆక్రమిత భూముల్లో యూదులకు నివాసాలను ఏర్పాటు చేసింది.
పాలస్తీనియన్లు తమ గౌరవాన్ని, స్వేచ్ఛను, జెండాలను ఎప్పటికీ వదులుకోరని అబ్బా ఎబాన్ ఊహించారు. దానికి తగ్గట్టుగానే యూదులకు, పాలస్తీనియన్లకు మధ్య ఇప్పటికీ హింస చెలరేగుతోంది.
1990 తరవాత శాంతి చర్చలు మొదలయ్యాయి. 1993లో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ నేతృత్వంలో ఇజ్రాయెల్ ప్రధాని రబిన్, తన పాత శత్రువు యాసర్ అరాఫత్‌తో కరచాలనం చేశారు.
కానీ ఆ శాంతి చర్చలకు తొలి నుంచి తూట్లు పడుతూనే ఉన్నాయి. శాంతి దిశగా అడుగేసిన రబిన్ను 1995లో హత్య చేశారు. ఆ చంపిన వ్యక్తి రబిన్ను దేశద్రోహిగా పేర్కొన్నాడు. రబిన్ హత్యతో ఓ శకానికి తెరపడింది.
1967 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్సన్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ దాకా.. అందరూ ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్టుగానే చెప్పారు.
మున్ముందు ఎలాంటి చర్చలు జరిగినా అవి 1967 యుద్ధం సమయంలో ఆ ఆరు రోజుల్లో ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగ భవిష్యత్తును తేల్చాలి. లేకపోతే ఎన్ని చర్చలు జరిగినా ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు.
ఆరు రోజుల ఆ యుద్ధం మూడు తరాల ఇజ్రాయెలీలు, అరబ్ ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు.
51ఏళ్లు గడిచినా, పవిత్ర స్థలంగా గుర్తింపు ఉన్న జెరూసలెం చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకొనే ఉన్నాయి. అవి ఎప్పుడు విడిపోతాయో, ప్రజల జీవితంలో ఎప్పుడు వెలుగులు ప్రసరిస్తాయోనన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలుంది.
ఇవి కూడా చదవండి
- సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
- ప్రకాశం ఫ్లోరోసిస్: ‘బతుకు వికసించదు... చావు కరుణించదు’
- బ్రెజిల్: చుక్క కూడా మిగలకుండా పెట్రోల్ కొనేస్తున్న ప్రజలు.. ఖాళీ అయిపోతున్న బంకులు
- తెలంగాణ: విలీనం నుంచి విభజన దాకా..
- అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)