సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌ల రక్షణకు గూర్ఖా జవాన్లు రెడీ

ట్రంప్, కిమ్ గూర్ఖా జవాన్లు

ఫొటో సోర్స్, EPA

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య జరుగనున్న శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఒకప్పుడు ఉప్పు, నిప్పుగా ఉన్న ఇద్దరు నేతలూ త్వరలోనే ఎదురెదురుగా కూర్చోబోతున్నారు. ఇద్దరూ జూన్ 12న సింగపూర్‌లో సమావేశం కానున్నారు.

ఈ చరిత్రాత్మక సమావేశానికి ఏర్పాట్లు కూడా జోరందుకున్నాయి. అగ్రనేతలిద్దరికీ రక్షణ కల్పించడమే ఈ ఏర్పాట్లలో అత్యంత కీలకం.

ట్రంప్, కిమ్‌ల రక్షణ కోసం పోలీస్ ధైర్యానికి, సాహసానికి మారుపేరుగా నిలిచిన తమ గూర్ఖా విభాగాన్ని కూడా సింగపూర్ ప్రభుత్వం మోహరించనుంది.

ప్రత్యేక సందర్భాల్లో బాధ్యతలు

ట్రంప్, కిమ్ రక్షణ ఏర్పాట్ల గురించి సింగపూర్‌లో వీఐపీల రక్షణ ఏర్పాట్లు చూసుకునే దౌత్యవేత్తలు రాయిటర్స్‌కు చెప్పారు.

"ఇరు దేశాల నేతలు తమ తమ రక్షణ బృందాలతో వస్తారు, కానీ సింగపూర్ పోలీసులతో కలిసి గూర్ఖా జవాన్లు సమావేశం జరిగే ప్రాంతంలో, హోటల్ దగ్గర రక్షణ బాధ్యతలు చూసుకుంటారు."

సింగపూర్లో గూర్ఖా జవాన్ల సంఖ్య అంత ఎక్కువేం లేదు, కానీ ప్రత్యేక సందర్భాల్లో ఈ విభాగానికి అధికారులు రక్షణ బాధ్యతలు అప్పగిస్తారు.

ఇటీవల షాంగ్రీ-లా హోటల్‌లో రక్షణ అంశాలపై జరిగిన సమ్మేళనం కోసం గూర్ఖా జవాన్లను మోహరించారు. ఈ కాన్ఫరెన్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మేటిస్, ఇతర దేశాల నేతలు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఖుఖ్రీతో గూర్ఖాల రక్షణ

సింగపూర్ పోలీస్‌లో ఉన్న గూర్ఖా జవాన్లను నేపాల్ మారుమూల పర్వత ప్రాంతాల నుంచి భర్తీ చేశారు. వారి దగ్గర ఎన్నో రకాల అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఎన్ని ఆయుధాలున్నా గూర్ఖాలు సాంప్రదాయక ఖుఖ్రీలనే తమ ప్రధాన ఆయుధంగా భావిస్తారు.

ఖుఖ్రీ (బాకు) వారికి ఇష్టమైన ఆయుధం. వాళ్లు ఎప్పుడు ఖుఖ్రీని బయటకు తీసినా, అది శత్రువు రక్తం అంటకుండా తిరిగి ఒరలోకి వెళ్లదని చెబుతారు.

"వారు (గూర్ఖా జవాన్లు) సింగపూర్‌లో అత్యంత మెరుగైన రక్షణ అందించగలరు. అందుకే వారిని భద్రతకు మోహరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్టడీస్ (ఐఐఎస్ఎస్)లో సింగపూర్ భద్రతా దళాల నిపుణుడు, టిమ్ హక్సలీ ‌రాయిటర్స్‌తో అన్నారు.

"గూర్ఖాలు చాలా సమర్థులు, ఆ దళం అందరికంటే ముందుంటుంది. ఇలాంటి కార్యక్రమాలకు, ప్రత్యేక ఆపరేషన్‌లకు తగినట్టు మేం గూర్ఖాలకు శిక్షణ అందించాం" అని టిమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

అయితే, సింగపూర్ పోలీస్ ప్రతినిధులు మాత్రం, గూర్ఖాల మోహరింపుపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సింగపూర్ పోలీస్‌లో 1800 మంది గూర్ఖా జవాన్లు ఉన్నారు. వీరందరూ ఆరు పారామిలిటరీ కంపెనీల్లో విధులు నిర్వహిస్తుంటారు.

"గూర్ఖా విభాగాన్ని సింగపూర్ పోలీస్‌లో చాలా ప్రధానమైనదిగా భావిస్తారు" అని టిమ్ హక్సలీ చెప్పారు. వీఐపీల భద్రతతోపాటూ దేశంలో అల్లర్లు జరిగినప్పుడు కూడా వీరిని ఉపయోగిస్తారు.

సింగపూర్ పోలీస్ వెబ్‌సైట్‌లో అలర్ట్, యునైటెడ్, స్ట్రాంగ్ అని ఉంటుంది. వీరు సింగపూర్ భద్రతకు తమ సహకారం అందిస్తారు.

ఫొటో సోర్స్, Reuters

ఆంగ్లేయులతో గూర్ఖాల బంధం

సింగపూర్‌లో గూర్ఖా జవాన్ల నియామకానికి బ్రిటిష్ సంప్రదాయంతో సంబంధం ఉంది. బ్రిటన్‌ 200 ఏళ్లకు పైగా తమ ప్రధాన రెజిమెంట్ల కోసం నేపాల్ నుంచి జవాన్లను భర్తీ చేసింది. వారికి వేతనాలు చెల్లించింది.

గూర్ఖా సైనికులు మొట్టమొదట 19వ శతాబ్దంలో పశ్చిమ ప్రాంతాలకు చేరారు. అప్పట్లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా నేపాల్‌ యుద్ధం చేసింది. అయితే, ఈ యుద్ధంలో ఆంగ్లేయులే గెలిచారు.

కానీ ఆ యుద్ధంలో గూర్ఖాల సాహసం, యుద్ధ నైపుణ్యాలు ఆంగ్లేయులను చాలా ప్రభావితం చేశాయి.

ఆ తర్వాత ఆంగ్లేయులు బ్రిటిష్ సైన్యంలో గూర్ఖా జవాన్లను భర్తీ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు గూర్ఖాలు, బ్రిటిష్, భారత్, నేపాల్ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. బ్రూనై, సింగపూర్ భద్రతా దళాలలో భాగం అయ్యారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ప్రత్యేక ప్రాంతంలో గూర్ఖాల నివాసం

సింగపూర్‌ గూర్ఖా జవాన్లు సెక్యూరిటీ మౌంట్ వేర్‌నాన్ కేంప్‌లో తమ కుటుంబాలతో పాటూ ఉంటారు. ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి సింగపూర్ పౌరులకు అనుమతి లేదు.

గూర్ఖా జవాన్లు, వారి కుటుంబాలు ఇక్కడ కఠినమైన నియమాలతో జీవిస్తున్నారు. వారి పిల్లలు స్థానిక స్కూళ్లలోనే చదువుకుంటారు. వారికి స్థానిక యువతులను పెళ్లి చేసుకోడానికి అనుమతి లేదు.

సింగపూర్‌లో శిక్షణ తీసుకునే ముందు వారిని 18, 19 ఏళ్లకే భద్రతా దళంలో భర్తీ చేస్తారు. వీరు 45 ఏళ్ల వరకూ తమ సేవలు అందిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇంకా ఖాయం కాని ట్రంప్, కిమ్ సమావేశ వేదిక

ఇటు డొనాల్ట్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్ సమావేశానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని అమెరికా చెబుతోంది.

అయితే, ఇద్దరూ ఎక్కడ సమావేశం అవుతారో మాత్రం చెప్పడం లేదు.

ఈ సమావేశంలో ప్రధానంగా అణు నిరాయుధీకరణ అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా తమ అణ్వాయుధాలు ధ్వంసం చేసేవరకూ ఆ దేశంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం కుదరదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇద్దరు నేతల సమావేశం గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. మే నెలలో ఈ సమావేశం రద్దు చేసుకున్న డొనాల్ట్ ట్రంప్, ఆ తర్వా కొద్ది రోజులకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)