డేటా సెంటర్: సముద్రం అడుగున కంప్యూటర్లను పెట్టిన మైక్రోసాఫ్ట్

  • రోరి సెలాన్-జోన్స్
  • బీబీసీ టెక్నాలజీ ప్రతినిధి
సముద్రం అడుగున డేటా సెంటర్

కంప్యూటర్లను నీటి అడుగున ఉంచడం ద్వారా, వాటి కూలింగ్‌కు అయ్యే ఇంధన వ్యయాన్ని తగ్గించవచ్చా? ఇదే అంశంపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది.

కంప్యూటర్లతో కూడిన డేటా సెంటర్‌ను ఒక భారీ సిలిండర్‌లో ఏర్పాటు చేసి, ఆ సిలిండర్‌ను తీసుకెళ్లి సముద్రం అడుగున పెట్టింది.

స్కాట్లాండ్‌లోని ఓక్నీ దీవుల సముదాయమున్న సముద్ర ప్రాంతంలో ఈ సిలిండర్‌ను ఉంచింది. ఈ సిలిండర్ సముద్రం అడుగునే ఐదేళ్లపాటు ఉంటుంది.

సిలిండర్‌ను ప్రత్యేక కేబుల్‌తో ఇంటర్నెట్, భూ ఉపరితలంపై ఉండే ఇతర వ్యవస్థలకు అనుసంధానించారు. డేటా సెంటర్‌కు బయటి నుంచి ఇదే కేబుల్‌ విద్యుత్‌ను తీసుకొస్తుంది.

ఫొటో క్యాప్షన్,

డేటా సెంటర్‌తో కూడిన సిలిండర్

ప్రాజెక్ట్ నాటిక్

ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ 'ప్రాజెక్ట్ నాటిక్' అని పేరు పెట్టింది.

భూమిపై కంటే నీటి అడుగున కంప్యూటర్లకు కూలింగ్ బాగుంటుందని భావిస్తున్నామని ప్రాజెక్ట్ నాటిక్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న బెన్ కట్లర్ చెప్పారు.

డేటా సెంటర్లలో పరికరాలకు వాతావరణంలోని తేమ వల్ల నష్టం కలగొచ్చని ఆయన తెలిపారు. వీటిని సముద్రగర్భంలో ఉంచితే బయటి వాతావరణంలో ఉండేంత తేమ అక్కడ ఉండదు కాబట్టి ఈ నష్టాన్ని బాగా తగ్గించవచ్చని వివరించారు.

సముద్ర గర్భంలో ఉంచిన డేటా సెంటర్‌లోని కంప్యూటర్లు చెడిపోతే అక్కడికి వెళ్లి మరమ్మతు చేయడం సాధ్యం కాదు. భూమి ఉపరితలంపై ఉండే కంప్యూటర్లతో పోలిస్తే అక్కడ ఉండే కంప్యూటర్లు చెడిపోయే అవకాశాలు తక్కువని మైక్రోసాఫ్ట్ ఆశాభావంతో ఉంది.

ఫొటో సోర్స్, AFP

ఖరీదైన వ్యవహారం

ప్రపంచంలో డేటాను నిక్షిప్తం చేయడానికి ఉపయోగిస్తున్న భారీ డేటా సెంటర్లతో పోలిస్తే 'ప్రాజెక్ట్ నాటిక్'లో వాడుతున్న డేటా సెంటర్ చాలా చిన్నది.

ఈ డేటా సెంటర్‌లో 12 ర్యాకులలో సర్వర్లు అమర్చారు. ఇది చిన్నదే అయినప్పటికీ ఐదు లక్షల సినిమాల డేటాను దాయడానికి అవసరమైనంత స్పేస్ ఇందులో ఉంది.

మైక్రోసాఫ్ట్ తొలిసారిగా 2015లో ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టింది. అప్పట్లో డేటా సెంటర్‌ను ఐదు నెలలపాటు నీటి అడుగున ఉంచింది. నాటి డేటా సెంటర్‌ను 'లియోనా ఫిలిపట్' అని పిలుస్తారు.

ప్రాజెక్ట్ నాటిక్‌ వివిధ దేశాల భాగస్వామ్యంతో కూడిన ఖరీదైన వ్యవహారం.

ఇది విజయవంతమైతే ఇలాంటి మరిన్ని సిలిండర్లను నీటి అడుగుకు చేర్చాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

ఎవరు తయారు చేశారు?

ఫ్రాన్స్‌లో నౌకానిర్మాణ సంస్థ 'నేవల్' ఈ సిలిండర్‌ను రూపొందించింది. అక్కడి నుంచి ఓక్నీలోని స్ట్రామ్‌నెస్‌కు తరలించింది. సిలిండర్ ఓక్నీకి వచ్చిన తర్వాత యూరోపియన్ సముద్ర ఇంధన కేంద్రం(ఈఎంఈసీ) తన వంతుగా సముద్రగర్భంలో కేబుల్ వ్యవస్థ ఏర్పాటు, ఇతరత్రా సహకారం అందించింది.

ఓక్నీ దీవుల సముదాయం- పవన విద్యుత్‌ను తొలి నాళ్లలోనే అందిపుచ్చుకున్న ప్రాంతం. సముద్ర కెరటాలతో విద్యుత్ ఉత్పత్తిపై ఈఎంఈసీ 14 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తోంది. ఇక్కడి ఒక బీచ్‌లో ఈ సంస్థ పరీక్ష కేంద్రం కూడా ఉంది.

ఓక్నీలోనే ఎందుకు?

పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలకు ఓక్నీ ప్రధాన కేంద్రం కావడంతో ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ఈ ప్రాంతాన్ని ఎంచుకొంది.

డేటా సెంటర్‌ను నీటి అడుగున ఉంచడం వల్ల నీరు వేడుక్కుతుందనే ఆందోళనలపై ప్రాజెక్ట్ నాటిక్ ఇన్‌ఛార్జి స్పందిస్తూ- డేటా సెంటర్‌కు దగ్గర్లో కొన్ని మీటర్ల మేర నీరు ఒక డిగ్రీలో కొన్ని వేల వంతు మేర వేడిగా మారుతుందని, ఇది నామమాత్రమని చెప్పారు. స్థూలంగా చూస్తే పర్యావరణానికి ఈ డేటా సెంటర్ మేలే చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)