చైనా: సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని నడుస్తున్నారా? అయితే మీరు వెళ్లాల్సిన రోడ్డు ఇదీ..

సరికొత్త నడక దారి

ఫొటో సోర్స్, THE PAPER

కాలం పరిగెడుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది. ప్రపంచంలో భాగమైన మనిషికి ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచం..

కొందరు సెల్‌ఫోన్‌ చూస్తూ భోంచేస్తే, మరికొందరు సెల్‌ఫోన్ చూస్తూ నడుస్తారు. ఇదీ వర్తమాన జీవన శైలి.

అయితే, ట్రాఫిక్‌ రద్దీలో కూడా సెల్‌ఫోన్ వైపే చూస్తూ నడిచే వారికోసం ప్రత్యేకంగా చైనాలోని ఓ నగరంలో కొత్తగా దారులు వేశారు.

సెల్‌ఫోన్‌లో చూస్తూ.. ప్రపంచాన్ని మరిచి నడిచేవారి కోసం షియాన్ నగరంలోని యాన్తా రోడ్లకు పక్కనే పక్కగా ఈ నడక దారిని ఏర్పాటు చేసినట్లు షాన్షీ ఆన్‌లైన్ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ నడక దారిపై ఎరుపు, నీలం ఆకుపచ్చ రంగులు వేశారు. ఈ దారులు 80 సె.మీ. వెడల్పు, 100 మీ. పొడవు ఉన్నాయి. ఈ దారిపై వేసిన స్మార్ట్ ఫోన్ల బొమ్మలు.. ఈ దారి ఫోన్‌ధారులకు ప్రత్యేకం అని చెప్పకనే చెబుతాయి.

ఈ మార్గం చాలా రద్దీగా ఉంటుంది. పాదచారులు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటారు. వారిలో చాలా మంది తమ ఫోన్లలోకి చూస్తూ నడుస్తుంటారు. అపుడపుడూ కాలిబాటపైకి కార్లు కూడా దూసుకు వస్తుంటాయి. అది చాలా ప్రమాదం అని షాన్షి ఆన్‌లైన్ తెలిపింది.

ఈ నడక దారి గురించి 'ది పేపర్' వార్తా సంస్థ స్థానికులతో మాట్లాడింది. వారిలో చాలా మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. వారి స్పందనలు..

''ఇలాంటి మార్గాన్ని చూడడం ఇదే మొదటిసారి. ఇలాంటి నడక దారుల వల్ల చాలా ఉపయోగకరం'' అని ఒక స్థానికుడు అన్నారు.

ఫొటో సోర్స్, THE PAPER

''చాలా మంది తమ ఫోన్లలోకి చూస్తూ నడుస్తూ తాము సురక్షితంగానే ఉన్నామనే భ్రమలో ఉంటారు. కానీ చుట్టుపక్కల కార్లు, ఇతర వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. కొన్నిసార్లు అవి ప్రజలపైకి కూడా దూసుకొస్తుంటాయి.''

''మనుషుల జీవితాల్లో వేగం పెరిగింది. రోడ్లపై నడుస్తున్నపుడు వాళ్ల చూపులన్నీ ఫోన్లలో చిక్కుకుపోయి ఉంటాయి. ఇలాంటి మార్గాలు కాస్త రక్షణ కల్పిస్తాయి'' అని అభిప్రాయపడ్డారు.

'షీనా వీబో మైక్రో బ్లాగ్' యూజర్లు ఈ సరికొత్త నడక దారిపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

'‘ఇప్పటి యువత.. సెల్‌ఫోన్ మత్తులో కూరుకుపోయింది'’ అని ఒకరంటే.. '‘స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కళ్లుండీ గుడ్డి వాళ్లలా ప్రవర్తిస్తున్నారు’' అని, '‘ఈ నడకదారిలో వెళుతున్నా, ఫోన్‌లో చూస్తూ.. ఒకరికొకరు ఢీకొని, తలలు బొప్పి కడుతాయి’’ అని మరి కొందరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)