తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?

  • 2 ఆగస్టు 2018
తల్లిపాలు, లాభాలు Image copyright Getty Images

పిల్లలకు ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయా? బ్రిటన్‌లో అయితే శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.

తల్లిపాలను ఏ వయసులో ఆపేయాలనేదానిపై ఎన్‌హెచ్ఎస్ నిర్దిష్ట సూచనలేవీ చేయలేదు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాతి నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

Image copyright Getty Images

ఇద్దరికీ మంచిది

శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి, శిశువుకు ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతారు.

తల్లిపాలు పట్టించడంవల్ల శిశుకు ఇన్‌ఫెక్షన్ల నుంచి, రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటేమిటి?

రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

రెండేళ్ల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాలపరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్‌లోని 'రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్'కు చెందిన డాక్టర్ మాక్స్ డేవీ చెప్పారు.

రెండేళ్ల వయసు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు శిశువు తీసుకొనే ఇతర ఆహారంతో అందాలని ఆయన తెలిపారు.

Image copyright Getty Images

పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయాన్ని చాలా అంశాల ప్రాతిపదికగా మహిళలు నిర్ణయించుకుంటారు. పాలు ఇవ్వడంలో సౌకర్యం/అసౌకర్యం, కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాటు, తిరిగి ఉద్యోగ విధుల్లో చేరాల్సి ఉండటం లాంటి అంశాలను బట్టి వారు నిర్ణయానికి వస్తారు.

బ్రిటన్‌లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారు.

ఆరు నెలల వయసు వచ్చేసరికి దాదాపు 33 శాతం మంది శిశువులకు తల్లిపాలు అందుతున్నాయి.

తల్లిపాలు ఇవ్వడం చాలా తక్కువగా ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటని 2016 ప్రథమార్ధంలో వెలువడిన ఒక అధ్యయనం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)