‘మిస్.. మీ బడి పాఠాలతో నేను గుడ్డిదాన్ని అవుతునా?’

  • 8 జూన్ 2018
హ్రస్వదృష్టి, పిల్లలు, చదువు Image copyright Getty Images

''మిస్, మిస్! మీ క్లాసులతో నేను గుడ్డిదాన్ని అవుతానా?''

ఇది చాలా వింత ప్రశ్నగా కనిపించొచ్చు కానీ, దీని వెనకాల సైన్స్ ఉంది.

ఇటీవల బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక పరిశోధనా ఫలితాలలో, పిల్లలు చదువుపై ఎంత ఎక్కువ సమయం వెచ్చిస్తే, వాళ్లకు కళ్లద్దాలు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంది అనడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయి.

అందువల్ల, తరగతి గదిలో పిల్లల చేతులు గాల్లోకి లేచినపుడు, ఉపాధ్యాయులు ఎలా ఆ ప్రశ్నల తాకిడిని తట్టుకుంటారు?

''మిస్, ఇది పాత వార్తే. మాకు ఇది ముందే తెలుసు.''

ఈ ఆలోచన చాలా కాలం నుంచి ఉన్నదే. కానీ తరగతి గదిలో ఎక్కువ సేపు ఉంటే కళ్లద్దాలు అవసరం అవుతాయన్న విషయాన్ని ఎవరూ నిరూపించలేకపోయారు.

''ఎందుకలా, మిస్?''

ఎందుకంటే పిల్లలను కొన్ని దశాబ్దాల పాటు బంధించి, అది వాళ్ల కళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశోధన నిర్వహించడం నైతికం కాదు. పిల్లలకు వాళ్లకై వాళ్లు ముందుకొస్తే తప్ప..

''అది సాధ్యం కాదు మిస్. కానీ మరి ఇప్పుడు ఎలా కనుగొన్నారు?''

ఈ పరిశోధన కోసం యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ కార్డిఫ్‌లు ఒక ఉపాయం పన్నాయి.

ఈ పరిశోధనలో వాళ్లు 68,000 మందిని, వాళ్ల డీఎన్‌ఏను పరిశీలించారు.

Image copyright Getty Images

''డీఎన్‌ఏ అంటే ఏమిటిమిస్?''

అది మనిషి నిర్మాణానికి సంబంధించిన నియమాల చేతిపుస్తకం లాంటిది. మనిషి మనిషికీ అది ప్రత్యేకం.

ఈ చేతి పుస్తకంలో కొంత మంది కళ్లు ఎలా పెరుగుతాయో, దాని వల్ల వాళ్లకు ఎలా హ్రస్వదృష్టి వచ్చే అవకాశం ఉందో ఉంటుంది.

డీఎన్‌ఏ అనేది చాలా శక్తివంతమైనది. డీఎన్‌ఏలోని కొన్ని భాగాలు మీరు ఎన్నేళ్ల వరకు చదువుకుంటారో కూడా అంచనా వేయగలవు.

''అయితే ఏంటి?''

ఈ పరిశోధనను బట్టి డీఎన్‌ఏలో హ్రస్వ దృష్టి లక్షణాలు కలిగిన పిల్లలు ఎక్కువ కాలం పాఠశాలల్లో గడపలేదని తెలుస్తోంది.

అయితే పాఠశాల, యూనివర్సిటీ అంటే ఇష్టపడే డీఎన్‌ఏ లక్షణాలున్న పిల్లలకు హ్రస్వదృష్టి ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

అంటే దీని అర్థం - తరగతి గదుల్లో కళ్లకు చెరుపు చేసేది ఏదో ఉన్నట్లు తెలుస్తోంది.

''కానీ నిజంగా నా కళ్లు అంత పాడైపోతున్నాయా మిస్?''

అది చెప్పడం అసాధ్యం. అది ఒక్కొక్కరి మీద ఒక్కో రకం ప్రభావం చూపుతుంది.

కానీ సగటున, 16 ఏళ్లకు చదువు ఆపేయడానికి, యూనివర్సిటీ విద్య పూర్తయ్యే వరకు చదువు కొనసాగించడానికి మధ్య తేడా 'మైనస్ వన్ డయాప్టర్'.

''అంటే?''

కాంతి వెలుతురు చూడగలిగే సామర్థ్యాన్ని డయాప్టర్‌లలో కొలుస్తారు. మైనస్ వన్ డయాప్టర్ అంటే చాలా తక్కువే. కానీ, మీరు డ్రైవింగ్ చేయడానికి కళ్లద్దాలు తప్పనిసరి కావడానికి ఆ మాత్రం చాలు.

''కానీ ఇప్పుడు నాకు ఎలాగూ కళ్లద్దాలు ఉండనే ఉన్నాయిగా?''

తీవ్రమైన హ్రస్వదృష్టి వల్ల చాలా సమస్యలున్నాయి. దాని వల్ల 'మయోపిక్ మాకులోపతి' రావచ్చు. రెండూ కలిస్తే నీకు అంధత్వం రావచ్చు.

''వింటుంటే భయమేస్తోంది మిస్''

ఇదింకా సగమే. చిన్న వయసులో చత్వారం (దూరదృష్టి) ఉంటుంది. కానీ పెరిగే కొద్దీ పిల్లల చూపు చక్కబడుతుంది.

అందువల్ల చిన్నప్పుడే హ్రస్వదృష్టి వచ్చిందంటే నీ పరిస్థితి దిగజారుతోందన్న మాట.

''అంటే నేను చదువు ఆపేయాలా''

ఊహూ, వద్దు.

పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ డెనీజ్ అటాన్, 'ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పే విధానంపై చర్చ జరిగేట్లు చేయాలన్నదే మా లక్ష్యం' అన్నారు.

Image copyright Getty Images

''మిస్, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు చైనాలోని చాలా మంది పిల్లలు కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు.''

నువ్వు చెప్పింది నిజమే, చైనాలోని కొన్ని ప్రాంతాలలో 80 శాతం మంది పిల్లలు హ్రస్వదృష్టితో పాఠశాల నుంచి బయట పడుతున్నారు.

''మిస్, నేను ఫోన్‌నే చూస్తూ ఉంటే గుడ్డిదానిని అవుతానని మా అమ్మ అంటూ ఉంటుంది''

ఈ పరిశోధనను 50 ఏళ్ల క్రితం పాఠశాలకు వెళ్లిన వాళ్లపై జరిపారు.

''అంటే అది పాతబడిపోయిందా మిస్?''

నేను దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ - ఆధునిక జీవితం మన కళ్లను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలీదు. మన చాలా సమయాన్ని ఇళ్ల లోపలే గడుపుతున్నాం. అందుకే డాక్టర్ అటన్ భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తవచ్చని అంటారు.

''నాకు బోర్ కొడుతోంది. నేను వెళ్లి బైట ఆడుకోవచ్చా మిస్?''

బైట కాలం గడపడం నీ కళ్లను సంరక్షిస్తుంది. ఆగ్నేయాసియాలో జరిగిన చాలా పరిశోధనల్లో కాంతివంతమైన వెలుతురు, కళ్లు సాధారణంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని, హ్రస్వదృష్టిని అరికడుతుందని తేల్చాయి.

'మిస్..''

ఇంక ప్రశ్నలు చాలు. ఇక నీకు స్పెల్లింగ్ పరీక్ష మొదలెడదాం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు