‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’

  • 11 జూన్ 2018
రాళ్ల కోత Image copyright Getty Images

లక్షల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు, ఉల్కపాతాలు భూమిని సమూలంగా మార్చేశాయి. ఇప్పుడు మనుషులు అంతకంటే ఎక్కువ మార్పునే భూమ్మీద తీసుకొస్తున్నారు. మనుషుల ప్రభావం భూగ్రహం మీద ఎంతగా పడిందంటే, మొత్తంగా భూమి చరిత్రలో ఓ కొత్త శకమే మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనుషులంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని కొందరు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.

భారీ వాతావరణ మార్పులను నివారించడం మనుషులు చేతిలో పనేనని, తాము ఊహించినదానికంటే ఎక్కువ నష్టాన్నే మనుషులు పర్యావరణానికి కలిగిస్తున్నారని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సైమన్ లెవిస్, మార్క్ మెస్లిన్ చెబుతారు.

ప్రకృతి విపత్తులు, ఇతర సహజమైన చర్యల కంటే ఎక్కువగా మానవ చర్యల వల్లే మట్టి, రాళ్లు, ఇతర ఖనిజాలు ఉండాల్సిన చోటు నుంచి మరో చోటికి తరలిపోతున్నాయని వాళ్లంటారు.

ఏటా మనుషులు ఉత్పత్తి చేసే కాంక్రీట్‌తో భూమిపైన 2మి.మీ. మందంలో ఓ పొరను ఏర్పాటు చేయొచ్చు. ప్రతి సముద్ర గర్భంలో మైక్రో ప్లాస్టిక్‌లు పోగైపోయి ఉన్నాయి.

భూమిపైన ఉండే చెట్లలో సగం ఎప్పుడో కొట్టేశాం. జీవజాతులు అంతరించిపోవడం అనేది చాలా మామూలు విషయంలా మారిపోయింది.

భూమ్మీద చోటు చేసుకునే సహజమైన చర్యల కారణంగా గాల్లో నుంచి ఎంత నైట్రోజెన్ దూరమవుతుందో.. ఫ్యాక్టరీలు, వ్యవసాయం కారణంగా కూడా అంతే నైట్రోజెన్ దూరమవుతోంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరిగిపోయి వాతావరణం చాలా వేగంగా మారిపోతోంది.

ఈ లెక్కలన్నింటినీ గమనిస్తే.. పెరిగిన ఆధునికత, టెక్నాలజీ కారణంగా ప్రపంచంలోని 750కోట్ల మంది ప్రజలూ రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా జీవిస్తారా లేక ఇలానే సహజ వనరులను అడుగంటేదాకా ఉపయోగిస్తూ మొత్తం జాతి వినాశనానికి కారణమవుతారా అన్నది ప్రశ్నగా మిగిలింది.

ఓ సారి చరిత్రను గమనిస్తే, పర్యావరణంలో సమూల మార్పులకు మూడు పరిణామాలు ప్రధానంగా కారణమయ్యాయని తెలుస్తోంది. 10,500 ఏళ్ల క్రితం మొదలైన వ్యవసాయ విప్లవం కారణంగా వాతవారణంపై ప్రభావం పడటం ప్రారంభమైంది.

ఆపైన 1492లో యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టిన తరవాత చోటు చేసుకున్న పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాల కారణంగా మరో మార్పు మొదలైంది. ఇక మూడోది.. రెండో ప్రపంచ యుద్ధం. అది ముగిశాక అన్ని దేశాలు అభివృద్ధి దిశగా అడుగేశాయి. ఉత్పాదకతతో పాటు వినియోగం పెరిగిపోయింది. ఆ ప్రభావం వాతావరణ మార్పులకూ దారితీసింది.

అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి జరిగేకొద్దీ, ప్రజల జీవన విధానం మారే కొద్దీ వాతావరణ మార్పులూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పాదకతా పెరిగిపోయాయి. ఈ రెండూ ఎంత పెరిగితే పర్యావరణంపైన అంత ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది.

ముందు భూమ్మీద ఇతర జీవజాతులకూ బతికే హక్కు ఉందని గుర్తిస్తే, భూ ఉపరితలంపై కనీసం యాబై శాతం స్థలాన్ని వాటి కోసం వదిలేస్తే, వాతావరణంలో సానుకూల మార్పు దానంతటదే మొదలవుతుంది.

ప్రస్తుతం అనేక దేశాలు ఆ దిశగా అడుగేస్తున్నాయి. కోల్పోయిన అటవీ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవలే 43 దేశాలు కలిసి కోల్పోయిన 292మిలియన్ హెక్టార్ల అటవీ భూమిలో తిరిగి పచ్చదనాన్ని తీసుకొస్తామని ప్రమాణం చేశాయి. దీన్ని బట్టి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుత శకాన్ని శాస్త్రవేత్తలు ‘ఆంత్రోపొసీన్’ అని నిర్వచిస్తున్నారు. అంటే వాతారణం, పర్యవారణంపైన మనుషుల ప్రభావం అత్యధికంగా ఉన్న శకం అని అర్థం.

(శాస్త్రవేత్తలు సైమన్ లెవిస్, మార్క్ మెస్లిన్‌లు రాసిన కొత్త పుస్తకం ‘ది హ్యూమన్ ప్లానెట్‌’లో చర్చించిన అంశాలివి)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)