ట్రంప్ చేతులు కట్టుకున్న ఈ ఫొటో చెబుతున్న కథేంటంటే..

ట్రంప్‌‌ను చుట్టుముట్టిన జీ7 దేశాధినేతలు

ఫొటో సోర్స్, JESCO DENZE

ఫొటో క్యాప్షన్,

జర్మనీ ఫొటోగ్రాఫర్ జెస్కో డెన్జె ఈ చిత్రాన్ని తీశారు

పారిశ్రామికంగా శక్తిమంతమైన ఏడు దేశాల కూటమి జీ7 శిఖరాగ్ర సదస్సులో అనుకున్నట్లుగానే ఇబ్బందికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అయితే, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ అధికారిక అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఫొటో అందరి దృష్టీ ఆకర్షించింది.

ఈ ఫొటోలో ఉన్నది ఎవరెవరు? సదస్సులో ఏర్పడ్డ ప్రతిష్టంభనపై వారి వైఖరి ఏంటి?

1. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికా మిత్రపక్షాలు.. యురోపియన్ యూనియన్, మెక్సికో, కెనడాల నుంచి వచ్చే స్టీలు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించి డొనాల్డ్ ట్రంప్ అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇప్పుడు ఆయా దేశాలన్నీ ప్రతీకార చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నాయి. ఈ ప్రభావం సదస్సుపై పడింది. అమెరికా అధ్యక్షుడు ఏకాకి అయ్యారు. అందరికంటే ముందే ట్రంప్ సదస్సును వీడి వెళ్లిపోయారు. అమెరికా ఒక ‘పిగ్గీ బ్యాంకు, అందరూ దాన్ని దోచుకోవాలనుకుంటున్నారు’ అని ఆయన ఫిర్యాదు చేశారు.

తర్వాత కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై ట్రంప్ మండిపడ్డారు. ఆయన ‘‘నిజాయితీలేని, బలహీన’’ వ్యక్తి అని, ‘అబద్ధపు ప్రకటనలు’ చేస్తున్నారంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఒక విలేకరుల సమావేశంలో అమెరికా సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానంటూ ట్రూడో చెప్పిన తర్వాత ట్రంప్ ఇలా స్పందించారు.

2. జాన్ బోల్టన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

అమెరికా అధ్యక్షుడికి అత్యున్నత భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ నియమితులై మూడు నెలలే గడిచాయి. అయినప్పటికీ ఆయన తనదైన ముద్ర వేసేశారు. ఈ సుంకాలు విధించటానికి ముఖ్య కారణం ‘జాతీయ భద్రతా కారణాలు’ అని ట్రంప్ చెబుతుండగా, దీనికి బోల్టన్ గట్టిగా మద్దతిస్తున్నారు.

3. కజుయుకి యమజాకి, జపాన్ విదేశీ వ్యవహారాల సీనియర్ డిప్యూటీ మినిస్టర్

జూలై 2017లో ఆయన పదోన్నతిపై ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యనే జపాన్ బృందంతో కలసి పాకిస్తాన్ వెళ్లారు. జపాన్, చైనా, దక్షిణ కొరియాలతో కలసి సియోల్‌లో చర్చలు జరిపి ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ (ఆంక్షల్లేని వర్తక ఒప్పందం)ను ప్రతిపాదించారు.

4. షింజో అబే, జపాన్ ప్రధాన మంత్రి

అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలు తీసుకునే అంశంలో భాగం కావటానికి ఆయన చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సత్సంబంధాన్ని పెంచుకోవటానికి ఆయన చాలా కష్టపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వీరిద్దరూ కనీసం 10 సార్లు కలిశారని చెబుతారు.

5. యశుతోషి నిషిముర, జపాన్ డిప్యూటీ చీఫ్ క్యాబినెట్

జపాన్‌లోని అధికార పార్టీ ఎంపీ. ఒకప్పుడు అంతర్జాతీయ వర్తక, వ్యాపార మంత్రిత్వ శాఖలో పనిచేశారు.

6. ఏంగెలా మెర్కెల్, జర్మన్ ఛాన్స్‌లర్

సదస్సులో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించేందుకు జరిపిన చర్చల్లో ఆమె చురుగ్గా వ్యవహరించారు, ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగానే. అమెరికా, దాని మిత్రపక్షాల మధ్య నెలకొన్న వర్తక విభేదాలను పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేద్దామని ఆమె ప్రతిపాదించారు. డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాల గురించి సదస్సు సందర్భంగా ఆమె స్పందిస్తూ.. తామిద్దరం ప్రతిసారీ ఏకీభవించకపోవచ్చు కానీ, పరస్పరం మాట్లాడుకుంటూనే ఉంటామని చెప్పారు. ‘‘అమెరికా అధ్యక్షుడితో చాలా బహిరంగంగా, ప్రత్యక్ష సంబంధాన్ని కొనసాగిస్తున్నానని నేను చెప్పగలను’’ అని ఆమె అన్నారు.

7. ఎమ్మానుయేల్ మేక్రాన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు

ఈ సదస్సుకు కొన్ని గంటల ముందే డొనాల్డ్ ట్రంప్‌తో ట్వీట్ల యుద్ధానికి దిగారు మేక్రాన్. దీంతో వీరిద్దరి మధ్యా వికసించిన ‘బ్రొమాన్స్’ (అన్నదమ్ముల మధ్య ప్రేమ) పట్ల ప్రశ్నలు తలెత్తాయి. అయినప్పటికీ, వారిద్దరూ సత్సంబంధాలను కలిగి ఉన్నట్లే కనిపించారు. డొనాల్డ్ ట్రంప్‌తో మేక్రాన్ చర్చలు ‘నిష్కపటంగా, దృఢంగా’ ఉంటాయని ఫ్రెంచ్ అధ్యక్షుడి బృందం తెలిపింది. అయితే, కెనడా ప్రధానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మేక్రాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘అంతర్జాతీయ సహకారాన్ని కోపపు పిడిగుద్దులు, చౌకబారు విమర్శలు నిర్దేశించలేవు’’ అని పేర్కొన్నారు.

8. థెరిసా మే, బ్రిటన్ ప్రధాన మంత్రి

గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆమె ఫోన్లో మాట్లాడారు. అమెరికా సుంకాలు ‘అర్థంలేని, తీవ్రంగా నిరాశపర్చేవి’ అని తెలిపారు. కానీ, సదస్సులో మాత్రం ఆమె రాజీ ధోరణిలో మాట్లాడారు. వర్తక యుద్ధం తలెత్తే పరిస్థితుల నుంచి వెనక్కు తగ్గాలని సహచర దేశాధినేతలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

9. లారీ కుడ్లౌ, అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్

ట్రంప్ అత్యున్నత ఆర్థిక సలహాదారు. ఈయన కూడా సుంకాలను సమర్థించారు. వర్తక ఆందోళనలకు తమ బాస్‌ను నిందించొద్దని అన్నారు. తాము సదుద్దేశంతో సదస్సుకు వెళ్లామని, ట్రూడో మాత్రం ‘‘వెన్నుపోటు పొడిచారు’’ అని సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ లారీ అన్నారు.

ఫొటో సోర్స్, French presidency

అయితే, ఇదే సందర్భానికి సంబంధించిన మరొక ఫొటోను ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ ట్వీట్ చేశారు. ఇది వేరే కోణంలో తీసిన ఫొటో. డొనాల్డ్ ట్రంప్‌ను జీ7 దేశాధినేతలు, వారి సహాయ సిబ్బంది చుట్టుముట్టినట్లుగా ఉంది.

ఫొటో సోర్స్, Reuters

కెనడా ప్రధాని ట్రూడో అధికారిక ఫొటో గ్రాఫర్ ఆడమ్ స్కాట్టి కొంత సంతోషకరమైన దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్న ఫొటో ఒకటి తీశారు. ఇందులో ట్రంప్‌తో కలసి ఏంగెలా చిరునవ్వు చిందిస్తుండగా, ట్రూడో నవ్వుతున్నట్లుంది.

మెర్కెల్ ఫొటో మాత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తూ, వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

చాలా మంది.. ఫొటోలో శక్తివంతమైన జర్మనీ నాయకురాలి ఆత్మవిశ్వాసం ఉట్టిపడే శారీరక భాష, నిలబడ్డ తీరు గురించి చర్చిస్తున్నారు. అల్లరి విద్యార్థి (ట్రంప్)తో పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతున్నట్లుగా ఆమె కనిపిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

జర్మనీకి చెందిన టీ-ఆన్‌లైన్ వెబ్‌సైట్ అమెరికా ప్రతినిధి ఫాబియాన్ రీన్‌బోల్డ్.. వివిధ ఫొటోగ్రాఫర్లు భిన్న కోణాల్లో ఈ దృశ్యాన్ని బంధించిన తీరును ఒక ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

చివరగా, కొందరు మాత్రం అసలు అక్కడేం జరిగిందంటే.. అంటూ తమలోని హాస్యచతురతను ప్రదర్శించారు. ఇలా..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)