యంత్ర నగరి: రోబో విప్లవానికి దుబాయ్, చైనాల్లో నాంది

  • జేన్ వేక్‌ఫీల్డ్
  • టెక్నాలజీ రిపోర్టర్
బుర్జ్ ఖలీఫా ఎదుట రోబో పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్‌ను ఊహిస్తే భయమేస్తుంది. జీవం లేని నల్లటి కళ్లతో ఒక రోబో పోలీస్ ఆఫీసర్. మాట్లాడే నోరు, వినే చెవులు ఏవీ వుండవు. కానీ క్రిమినల్స్‌ను గుర్తిస్తుంది. సాక్ష్యాలు సేకరిస్తుంది.

బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోని అతి పొడవైన టవర్. దుబాయ్‌లో ఉంది. దాని వెలుపల జూన్‌లో ఒక ప్రదర్శన జరిగింది. అది ఒక రోబోకాప్. పోలీస్ క్యాప్‌ కూడా ఉంది దానికి. చూడగానే ఏదో తెలియని భయం. చిత్రమైన అలజడి.

టెక్నాలజీలో ముందంజలో ఉండాలని తాపత్రయ పడుతుంటుంది దుబాయ్.

పాల్ (పీఏఎల్) రోబోటిక్స్.. ఆ మర పోలీస్‌ను రూపొందించిన కంపెనీ. ఇనుముతో చేసిన ఆ పోలీస్ విధులేమిటో చెప్పింది. అదంతా వింటే.. పోలీస్ ఆఫీసర్ కన్నా టూరిస్ట్ గైడ్ అనిపిస్తుంది.

‘‘ఈ రోబో దుబాయ్ పోలీస్‌లో చేరింది. పౌరులకు వినూత్నంగా సాయం చేయటం కోసం. ఇప్పటికి వీటిని టూరిస్ట్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లో నియమించాం’’ అని ఆ సంస్థ బీబీసీకి చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ రోబోకి అనేక భాషలు తెలుసు. పర్యాటకులకు ఉపయోగపడే సమాచారం అందించగలదు. దాని సాఫ్ట్‌వేర్ అందుకు వీలుకలిగిస్తుంది. జనం కోరుకున్న చోటుకు ఎలా వెళ్లాలో తెలియజేయగలదు.

‘‘ఈ రోబోలో అంతర్గతంగా మైక్రోఫోన్లు ఉంటాయి. పౌరులు వాటి ద్వారా దుబాయ్ పోలీస్ కాల్ సెంటర్లను కాంటాక్ట్ చేయొచ్చు. పోలీసు సేవలను కూడా పొందొచ్చు. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించటం లాంటి సేవలు...’’ అని పాల్ రోబోటిక్స్ వివరించింది.

ఈ ప్రాంతపు పోలీస్ విభాగాన్ని ‘‘స్మార్ట్’’గా తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోబో‌ను ప్రవేశపెట్టారు. సిబ్బంది లేకుండా కేవలం కంప్యూటర్‌తో నియంత్రించే పోలీస్ స్టేషన్లను కూడా ప్రారంభించనున్నారు.

2030 నాటికి తమ పోలీస్ దళాల్లో నాలుగో వంతు రోబో పోలీస్‌లను నియమించాలన్నది దుబాయ్ ప్రభుత్వం ప్రణాళిక.

‘‘ఈ తరహా రోబోలు రోజులో 24 గంటలూ పనిచేస్తాయి. వారంలో ఏడు రోజులూ విధుల్లో ఉంటాయి. సెలవులు అడగవు. సిక్ లీవ్‌లు పెట్టవు. మేటర్నిటీ లీవులు కోరవు. నిరంతరం నిర్విరామంగా పనిచేయగలవు’’ అంటారు దుబాయ్ పోలీస్ ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లడుతూ.

ఫొటో సోర్స్, SOFTBANK

ఫొటో క్యాప్షన్,

ఫ్రాన్స్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల మీద సలహాలు ఇవ్వటానికి ఏర్పాటు చేసిన రోబో ‘పెప్పర్’ ఒక క్యాప్ కూడా ధరించింది

‘‘నిజానికి ఈ రోబోలను తొలుత వయోవృద్ధులకు సాయం చేయటం కోసం, టూర్ గైడ్లుగా ఉపయోగించుకోవటం కోసం తయారు చేశారు’’ అని షెఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ నోల్ షార్కీ బీబీసీకి తెలిపారు.

దుబాయ్ ప్రభుత్వం రోబోలను ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆయన పనిచేశారు. ఇప్పుడు ఈ రోబోలను పోలీస్ పాత్రలో ఉపయోగించటాన్ని ప్రొఫెసర్ షార్కీ అంగీకరించటం లేదు.

‘‘అత్యవసర పరిస్థితి కోసం ఒక బటన్ ఏర్పాటు చేయాలని మొదట ప్లాన్ చేసినట్లు నాకు గుర్తుంది. ఆ బటన్.. మనం ఎక్కడున్నామనే సమాచారాన్ని పోలీసులకు పంపిస్తుంది. అది మంచి అప్లికేషన్ అయ్యేది. కానీ.. వీటిని జనం నవ్వులాటగా తీసుకునే అవకాశముంది. కొట్టి పడేసే అవకాశముంది’’ అని ఆయన చెప్పారు.

గతంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. 2017 జూలైలో వాషింగ్టన్‌లోని ఒక ఆఫీస్ బిల్డింగ్‌లో గస్తీ కోసం ఒక సెక్యూరిటీ రోబోను ఉపయోగించారు. అది ఒక ఫౌంటెన్‌లో ‘‘మునిగిపోయి’’ కనిపించింది.

పోలీస్ రోబోలు ఇప్పటికి ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా.. మున్ముందు ‘‘ఇంకా తీవ్రంగా’’ ఉంటాయని ప్రొఫెసర్ షార్కీ జోస్యం చెప్పారు.

నిఘా రోబోలుగా, రోడ్ల మీద పేలుడు పదార్థాల వంటి ప్రమాదకర వస్తువులను పసిగట్టే యంత్రాలుగా ఇవి రంగంలోకి వచ్చే అవకాశముందని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్,

షెంజెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గత ఏడాది యాన్‌బాట్ రోబో పోలీస్‌ విధుల్లో చేరింది

ప్రపంచంలో అత్యంత భారీ కెమెరా నిఘా వ్యవస్థను నిర్మిస్తున్నామని చెప్తున్న చైనాలో కూడా.. పలు రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో రోబోలను నియమిస్తున్నారు.

ఐదడుగుల మూడంగుళాల (1.6 మీటర్ల) ఎత్తున్న ఈ ‘ఈ-పెట్రోల్ రోబో షెరీఫ్’లు హెనాన్‌లోని ఝెంగ్ఝూ రైల్వే స్టేషన్‌లో ‘‘పని చేస్తున్నాయి’’.

ఈ రోబోల్లో అనేక కెమెరాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికే తమకున్న సెన్సర్ల ద్వారా.. ఒక చిన్నపాటి రైఫిల్‌ను గుర్తించినట్లు కథనాలు వచ్చాయి.

ఈ రోబో ముఖాలను గుర్తుపట్టగలదు. ‘‘నేరస్తులను, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి అనుసరించగలదు’’ అని మాషాబుల్ చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఝెంగ్ఝూ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తించే ఈ పోలీస్ రోబో నేరస్తుల ముఖాలను గుర్తించగలదు

మరోవైపు.. షెన్‌ఝెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది ‘యాన్‌బాట్’ను మోహరించారు. ఇది తనలో ఉన్న నాలుగు కెమెరాలను ఉపయోగిస్తూ సెక్యూరిటీ చెకింగ్ నిర్వహిస్తుంది.

చైనా పత్రిక పీపుల్స్ డైలీ కథనం ప్రకారం.. ఆ రోబోలో ‘‘విద్యుత్ చార్జ్ చేసిన అల్లర్ల నియంత్రణ పరికరం’’ కూడా ఆయుధంగా అమర్చారు. ఈ విషయం ఆందోళన రేకెత్తిస్తోంది.

డ్రోన్ విప్లవంలో చైనా అగ్రస్థానంలో ఉంది. దీనిని బట్టే.. పట్టణ ప్రాంతాల్లో రోబోల పాత్ర అధికంగా మారుతుందని చాలా మంది భావిస్తున్నారు. సరుకులను ఇళ్లకు సరఫరా చేయటం, స్వయంచాలిత టాక్సీ సర్వీసులను అందించటం వంటి పనులకు వీటి వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా చేరుకోవటానికి వీలు కల్పించే హైబ్రిడ్ హోవర్-బైక్‌ను తయారు చేయటం కోసం.. మానవరహత ట్యాక్సీ డ్రోన్లు, విమానాలను దుబాయ్ ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

దుబాయ్ 2017 సెప్టెంబర్‌లో ప్రదర్శించిన ఈ డ్రోన్ ట్యాక్సీ మరో ఐదేళ్లలో సర్వీసులు ప్రారంభించే అవకాశముంది

ఆకాశంలో విహరించే రోబో విప్లవాన్నీ ప్రొఫెసర్ షార్కీ అంగీకరించటం లేదు.

‘‘దుబాయ్ మీద ఆకాశం చాలా త్వరగా రద్దీగా మారిపోవచ్చు. అది చాలా అసౌకర్యంగా ఉంటుంది. నగరం నేల ‘బ్లేడ్ రన్నర్’ సినిమా తరహాలో కృత్రిమమైన, నిగూఢమైన చీకటి ప్రాంతంగా మారిపోవచ్చు’’ అని ఆయన అంటారు.

అయినా.. సిటీ రోబోల విప్లవం అనివార్యమని ఆయన భావిస్తున్నారు. ‘‘నగరంలో రోబోలు ఎన్నో పాత్రల్లో రాబోతున్నాయని నేను ఊహించగలను’’ అని అంటారాయన.

‘‘పరిసరాలు శుభ్రం చేస్తుంటాయి. భవనాల్లో తనిఖీలు చేస్తుంటాయి. సరుకులు సరఫరా చేస్తుంటాయి. కానీ ప్రస్తుతానికైతే అవి చాలా ఖరీదైనవి’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MARBLE

ఫొటో క్యాప్షన్,

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆహారం డెలివరీ కోసం మార్బుల్ సంస్థ తయారు చేస్తున్న ఇటాంటి రోబోలు ఫుట్‌పాత్‌ల మీద తిరగకుండా నిషేధించాలని కొందరు ఉద్యమించారు

మరో శతాబ్దం లోపలే నగరాల్లోని వినువీధులు ఎగిరే రోబోలతో నిండిపోతాయని కొందరు నమ్ముతున్నారు. అవి కేవలం సరుకులు సరఫరా చేయటం మాత్రమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాల నిర్వహణకు సాయం కూడా చేస్తుంటాయన్నది వారి అభిప్రాయం.

రోడ్ల మీద గుంటలను మరమ్మతు చేయగల డ్రోన్ల శ్రేణిని రూపొందిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌ పరిశోధక బృందంలో బిలాల్ కద్దో ఒక సభ్యుడిగా ఉన్నారు.

‘‘మేం మూడు డ్రోన్ల బృందాన్ని తయారు చేశాం. ఒకటి రోడ్లను తనిఖీ చేస్తుంది. ఇంకొకటి రోడ్లను తవ్వి సిద్ధం చేస్తుంది. మూడోది తనలో ఉన్న 3డీ ప్రింటర్ సాయంతో ఆ రోడ్డును రిపేర్ చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఈ ఏడాదిలోనే.. ఈ వ్యవస్థ నమూనాను పని చేయటానికి సిద్ధమవుతుందని ఈ నిపుణుల బృందం ఆశిస్తోంది.

ఫొటో సోర్స్, ELE.ME

ఫొటో క్యాప్షన్,

చైనాలోని షాంఘై నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆహారాన్ని డ్రోన్ల ద్వారా డెలివరీ చేయటానికి ఎలి.మి సంస్థ అనుమతి పొందింది

నిర్మాణ రంగంలో స్వయంచలిత డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించే రోజు వస్తుందని డాక్టర్ కద్దో భావిస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ తరహా డ్రోన్లు తాము సేకరించిన సమాచారాన్ని వెల్లువలా పంపించటం కాకుండా.. మున్ముందు రాబోయే డ్రోన్లు తను గుర్తించిన సమస్య ఏమిటనేది మరింత నిర్దిష్టంగా నివేదించగలవని ఆయన అంటున్నారు.

మౌలిక సదుపాయాలను నిర్వహించే డ్రోన్లతో నగరాలు నిండిపోయే కాలం రాబోతోందని ఆయన జోస్యం చెప్తున్నారు.

‘‘ఒక డ్రోన్ వెళ్లి ఒక ఎత్తైన నిర్మాణం మీద దిగి.. అక్కడ ఒక దీపపు స్తంభం మీద బల్బును తన రోబో చేతితో రిపేర్ చేయటం, మార్చటాన్ని.. లేదంటే.. ఒక కమ్యూనికేషన్ టవర్ మీద కొత్త కమ్యూనికేషన్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయటాన్ని ఊహించుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటువంటి పనుల కోసం కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తాయి ఈ రోబోలు. నగరం మరింత సమర్థవంతంగా నడవటానికి సాయపడతాయి. కానీ ఇందులో అవరోధాలు కూడా ఉన్నాయి.

‘‘డ్రోన్లు రేయింబవళ్లూ రణగొణధ్వనులు చేస్తూ తిరగటాన్ని జనం ఇష్టపడరు. ఇప్పుడున్న గగనతలంలో డ్రోన్లను చేర్చటం కూడా కష్టం’’ అని కద్దో చెప్తారు.

‘‘టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ నిబంధనలు, ప్రజాభిప్రాయం మారగలవా అనేదే ఇప్పుడున్న ప్రశ్న’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)