మీరు తాగితే ఉబర్‌కు తెలిసిపోద్ది

ఉబర్

ఫొటో సోర్స్, Getty Images

తమ ట్యాక్సీల్లో ప్రయాణించేవారు ఎంత మొత్తంలో మద్యం సేవించి ఉన్నారో తెలుసుకునేందుకు ఉద్దేశించిన టెక్నాలజీపై పేటెంట్ కోసం ఉబర్ దరఖాస్తు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత సాయంతో ఉబర్ ట్యాక్సీ సేవలు ఉపయోగించుకునేవారు ఏ స్థాయిలో ఆల్కహాల్ తాగి ఉన్నారో తెలుసుకోవచ్చని ఉబర్ చెబుతోంది.

ఈ యాప్ ఆధారంగా సేకరించే సమాచారాన్ని డ్రైవర్లతో పంచుకుంటుంది. కేవలం లొకేషన్ షేర్ చేయడమే కాదు, ట్యాక్సీని బుక్ చేసే సమయంలో ఫోన్ ఎంత కోణంలో వంగి ఉంది, ఎంత కచ్చితంగా టైప్ చేస్తున్నారు... వంటి వివరాలను కూడా ఈ యాప్ విశ్లేషిస్తుంది. మద్యం సేవించి ఉన్న వారికి సేవలు అందించడానికి ఇష్టం లేని డ్రైవర్లు... ఈ సమాచారం ఆధారంగా రైడ్‌ను తిరస్కరించవచ్చు.

"వ్యక్తిగత సమాచారాన్ని ఈ యాప్ రికార్డ్ చేయదు" అని పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో ఉబర్ పేర్కొందని అమెరికా పేటెంట్ కార్యాలయం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

క్యాబ్ బుక్ చేసేముందు ఫోన్ ఎలా పట్టుకున్నారు, వారి నడక తీరు ఎలా ఉంది, ఎలా టైప్ చేస్తున్నారనే దాని ఆధారంగా వారు ఏ స్థాయిలో తాగి ఉన్నారనేది ఉబర్ అంచనా వేస్తుంది.

వ్యక్తిగత వివరాల సేకరణ, నిర్వహణకు సంబంధించి ఉబర్‌కు సరైన చరిత్ర లేదు. 2014లో 'గాడ్ వ్యూ' అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ప్రయాణికులు, డ్రైవర్ల కచ్చితమైన లొకేషన్‌కు సంబంధించిన వివరాలను ఉబర్ రికార్డ్ చేసింది. ఇలా సేకరించిన డేటా బయటకు పొక్కడంతో దాదాపు లక్షమంది డ్రైవర్ల భద్రతకు ముప్పు వాటిల్లింది. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా 2017 జూన్‌లో ఉబర్ సహవ్యవస్థాపకుడు ట్రావిస్ కలానిక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

అమెరికాలో గత నాలుగేళ్లలో 100 మందికి పైగా ఉబర్ డ్రైవర్లు ప్రయాణికులను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయని, ఇందులో 31మంది నేరాలు రుజువయ్యాయని సీఎన్ఎన్ తెలిపింది.

ప్రయాణికుల స్థితిని అంచనా వేయడం అంటే వారి భద్రతకు ప్రమాదమే అని దీనిపై విమర్శలున్నాయి.

"ప్రయాణికులు, డ్రైవర్లు... ఇద్దరికీ ఉబర్ రైడ్‌ను మరింత మెరుగ్గా మార్చేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉబర్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎన్నో ఆలోచనలపై మేము పేటెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఆచరణలోకి రావు" అని ఉబర్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)