#FIFA2018: చరిత్రలో అత్యుత్తమ జట్లివే, వీటిలో ఒకటి కప్పు కొట్టలేదు

  • 15 జూన్ 2018
Image copyright Getty Allsport
చిత్రం శీర్షిక 1974 ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం విజయోత్సవ వేడుకలలో పశ్చిమ జర్మనీకి చెందిన గెర్డ్ ముల్లర్ (ఎడమ), గెర్డ్ బ్రెయిట్నర్ (కుడి)

కొన్ని విషయాల మీద దీర్ఘకాలిక చర్చ వద్దనుకుంటే ఆ అంశాన్నే చర్చకు తీసుకోకూడదు.

అలాంటి వాటిల్లో ఫుట్‌బాల్ ఒకటి.

రష్యాలో 2018 ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పటివరకు జరిగిన అన్ని టోర్నమెంట్లలో ఆడిన అత్యుత్తమ టీమ్‌లు ఏవో ఒకసారి పరిశీలిస్తే...

పశ్చిమ జర్మనీ 1974

చాలాసార్లు ఫలితాలే మాట్లాడతాయి. 1974లో తమ స్వదేశంలో ప్రపంచ కప్‌ను గెల్చుకోవడానికి ముందు, జర్మనీ 1966లో ఫైనల్‌కు చేరింది. అయితే ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.

ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన గెర్డ్ ముల్లర్‌లాంటి ఉద్దండులున్న జర్మనీ టీమ్, పాల్ బ్రైట్నర్, 'కైసర్' ఫ్రాంజ్ బెకన్‌బాయర్‌లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉండేది. ఆ టీమ్ 1972లో యూరోపియన్ చాంపియన్‌షిప్స్ కూడా గెల్చుకుంది.

ఆ టోర్నమెంట్‌లో జర్మనీ ప్రతి మ్యాచ్‌లో సగటున 1.8 గోల్స్ చేసి, ప్రత్యర్థులకు 0.7 గోల్స్ ఇచ్చుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1998లో ఫ్రాన్స్ ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన జినేదిన్ జిదేన్

ఫ్రాన్స్ 1998

ఫ్రాన్స్ మొదటిసారి, ఇప్పటివరకు ఒకేసారి 1998లో కప్ గెల్చుకుంది. అయితే ఆ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ కప్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.

పరాగ్వేలాంటి ప్రత్యర్థులను ఓడించడానికి తీవ్రంగా శ్రమించిన ఫ్రాన్స్, శక్తివంతమైన ఇటలీ టీమ్‌పై పెనాల్టీల ద్వారా గెలిచి క్వార్టర్ ఫైనల్స్ చేరింది.

సెమీ ఫైనల్స్‌లో ఆ టీమ్ మొదటిసారి ప్రపంచ కప్‌లో ఆడుతున్న క్రొయేషియాపై విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమించింది. మొదట క్రొయేషియాకు ఒక గోల్ ఇచ్చుకున్నా, ఆ తర్వాత కోలుకుని ఆ టీమ్‌ను ఓడించింది.

అయితే ఎట్టకేలకు జినేదిన్ జిదేన్ అత్యద్భుతంగా ఆడడంతో బ్రెజిల్‌ను 3-0 తేడాతో మట్టి కరిపించింది.

రెండేళ్ల తర్వాత ఆ టీమ్ యూరో 2000 కప్‌ను కూడా గెల్చుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1950లో బ్రెజిల్‌పై గోల్ చేస్తున్న ఉరుగ్వే ఆటగాడు జాన్ ఆల్బర్టో

ఉరుగ్వే 1950

బహుశా ప్రపంచ కప్ చరిత్రలోనే, కప్ గెల్చుకుంటుందని అతి తక్కువ అంచనాలున్న టీమ్ ఉరుగ్వే కావచ్చు.

కేవలం 40 లక్షల మందికన్నా తక్కువ జనాభా కలిగిన ఆ దేశం, తన ప్రత్యర్థులకన్నా తక్కువ నైపుణ్యం కలిగిన ప్లేయర్లతో కప్ గెలవడం అనేది అద్భుత మనే చెప్పాలి. 1930లో స్వదేశంలో ఈ టీమ్ సాధించిన విజయం చరిత్రగా మారిపోయినా, 1950లో ఉరుగ్వే సుమారు 2 లక్షల అభిమానుల ముందు బ్రెజిల్‌ను అనూహ్యంగా 2-1 తేడాతో ఓడించి కప్ గెల్చుకుంది. ఉరుగ్వే ఒలింపిక్స్‌లో కూడా రెండుసార్లు విజేతగా నిలిచింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1950లలో తమ ఆటతో ప్రపంచాన్ని మైమరపించిన హంగరీ టీమ్

హంగరీ 1954

'ఎప్పడూ ప్రపంచ కప్ గెలవని అత్యుతమ జట్టు' అన్న పేరు హంగరీకి సరిగ్గా సరిపోతుంది. 1950-54 మధ్య కాలంలో హంగరీ ప్రపంచంలో సంచలనాలు సృష్టించింది. ఆ మధ్యకాలంలో ఆడిన 50 మ్యాచ్‌లలో హంగరీ 43 మ్యాచ్‌లలో గెలిచింది. 1952లో ఒలింపిక్స్ విజేత అయిన హంగరీ ఒకే ఒక్కసారి ఓటమి పాలైంది. అయితే దురదృష్టవశాత్తూ 1954 ఫైనల్లో ఆ టీమ్ గ్రూప్ దశలో తాము 8-3 తేడాతో ఓడించిన పశ్చిమ జర్మనీ చేతిలోనే 3-2 తేడాతో ఓడిపోయింది.

హంగరీ ప్రభుత్వంపై తిరుగుబాటు కారణంగా ఆ దేశానికి చెందిన అనేక మంది ఆటగాళ్లు ఇతర దేశాలకు ఆడేందుకు వెళ్లిపోయారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1958లో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో వేల్స్‌ ఆటగాళ్లతో తలపడుతున్న 17 ఏళ్ల పీలే

బ్రెజిల్ 1958-62

ప్రపంచ కప్ చరిత్రలోనే కప్‌ను నిలబెట్టుకున్న రెండో దేశంగా బ్రెజిల్ గుర్తింపు పొందింది.

పీలేలాంటి ఉద్ధండులతో 1958లో ఈ టీమ్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలుపొందింది. ఆ టోర్నమెంట్‌లో మొత్తం 16 గోల్స్ చేసిన బ్రెజిల్ ప్రత్యర్థులకు కేవలం 4 గోల్స్ మాత్రం ఇచ్చింది.

నాలుగేళ్ల తర్వాత చిలీలో గాయం కారణంగా పీలే దూరమైనా, బ్రెజిల్ మళ్లీ అదే మ్యాజిక్ చేసి కప్‌ను నిలబెట్టుకుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1974లో జోహాన్ క్రయఫ్ నేతృత్వంలో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన డచ్ టీమ్

నెదర్లాండ్స్ 1974

ఫుట్‌బాల్ ఆటలోనే నెదర్లాండ్స్ ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. ఖచ్చితమైన పాసింగ్‌తో డచ్ ఆటగాళ్లు ప్రత్యర్థులలో కలవరం సృష్టించారు. జోహాన్ క్రయఫ్ నేతృత్వంలో డచ్ గ్రూప్ దశలో ప్రత్యర్థులతో ఆటాడుకుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌లాంటి టీమ్‌లను ఓడించిన ఆ టీమ్, ఫైనల్లో మాత్రం ఆట ప్రారంభమైన మొదటి రెండు నిమిషాలలో గోల్‌తో బోణీ చేసినా 2-1 తేడాతో జర్మనీ చేతిలో ఓడిపోయింది.

డచ్ టీమ్ 2010లో మరోసారి ఫైనల్‌కు చేరినా, ఈసారి స్పెయిన్ చేతిలో ఓడిపోయింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2009లో స్పెయిన్ టీమ్

స్పెయిన్ 2010

స్పెయిన్ ఎట్టకేలకు 2010లో ప్రపంచ్ కప్ విజేతల క్లబ్‌లోచేరినా, ప్రపంచ కప్‌లో ఆ దేశం రికార్డు అంత ఘనంగా ఏం లేదు.

ప్రారంభ మ్యాచ్‌లోనే స్విట్జర్లాండ్ చేతిలో 1-0 తేడాతో ఓడిపోయిన ఆ టీమ్‌కు షాక్ తగిలింది. అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో పరాగ్వే చేతిలో గెలిచిన ఆ టీమ్, సెమీ ఫైనల్స్‌లో జర్మనీపై 10 తేడాతో గెలుపొందింది.

అయితే డచ్ టీమ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ మొత్తం గొడవలమయంగా మారింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లీష్ రిఫరీ మొత్తం 12 యెల్లో కార్డులు చూపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1970 ఫిఫా ప్రపంచ కప్‌లో పీలే 'బెస్ట్ ప్లేయర్' అవార్డును గెల్చుకున్నారు

బ్రెజిల్ 1970

చాలా మంది క్రీడా విమర్శకుల దృష్టిలో 1970లో ప్రపంచ్ కప్‌ను గెల్చుకున్న బ్రెజిల్ జట్టు అత్యుత్తమమైంది.

అంతకు ముందు 1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలు కావడంతో పీలే తాను రిటైర్ అవుతానని బెదిరించాడు. అయితే 1970లో ఆ జట్టు మొత్తం 100 శాతం రికార్డు సాధించిన టీమ్‌గా రికార్డు సృష్టించింది.

ఫైనల్‌లో ఇటలీని నిర్వీర్యం చేసిన ఆ జట్టు నైపుణ్యాలను ఇప్పటికీ ప్రపంచ కప్ అత్యున్నత మ్యాచ్‌లలో ఒకటిగా పేర్కొంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు