అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే ఉత్తర కొరియాలో సామాన్యుడికి ఏంటి?

  • 16 జూన్ 2018
ఉత్తర కొరియా Image copyright HAJUNG LIM

ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణలో పురోగతి సాధిస్తే ఆ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జూన్ 12న సింగపూర్‌లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ -ఉన్‌తో సదస్సు తర్వాత ట్రంప్ చేసిన ప్రకటన అది.

మరి ఆ ఆంక్షలను ఎత్తివేస్తే ఉత్తర కొరియాలోని సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇన్నాళ్లూ బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉన్న అక్కడి సాధారణ పౌరుల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది?

ఆ పరిస్థితులను వివరించేందుకు పలువురు విశ్లేషకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, విశ్లేషణల ఆధారంగా 'లీ' అనే ఓ కల్పిత పాత్రను సృష్టించాం. అతని కుటుంబ కథ ఇది.

తీవ్రమైన నిరుద్యోగ సమస్య

ఉత్తర కొరియాలో ఓ సాధారణ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రపంచంలో చాలామందికి తెలియదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ఆ దేశంలో చాలా మందికి ప్రధాన జీవనాధారం గనులే. కుటుంబానికి పెద్దదిక్కు అయిన లీ కూడా గనుల్లోనే పనిచేస్తారు.

ఖనిజాల ఎగుమతే ఆ దేశానికి ప్రధాన ఆర్థిక వనరు. అనేక దశాబ్దాలుగా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకునేందుకు అదే అతిపెద్ద మార్గంగా ఉంది. బొగ్గుతో పాటు, అరుదైన ఖనిజ నిక్షేపాలు తమ దగ్గర పుష్కలంగా ఉన్నాయని ఉత్తర కొరియా చెబుతోంది.

అయితే, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా 2017లో ఖనిజాల ఎగుమతులు నిలిచిపోయాయి. దాంతో అనేక గనుల్లో ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అది తీవ్రమైన నిరుద్యోగ సమస్యకు దారితీసింది. అనేక మంది కార్మికుల జీతాలకు కోత పడింది. బాధితుల్లో లీ కూడా ఉన్నారు. అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఆయనకు కష్టమైంది.

Image copyright HAJUNG LIM

చేపల వేట సాహసమే

అయితే, ఈ సమస్యను అధిగమించేందుకు చాలామంది కార్మికులు గనుల్లో కొంతసేపు పనిచేస్తూ.. అదనపు ఆదాయం కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నారు.

అలా చేయాలంటే తమవైపు చూసీచూడనట్టు ఉండేందుకు గనుల అధికారులకు లంచం ముట్టజెప్పాలి. చేపల వేట కోసం బోటు కొనాలంటే మిలిటరీకి డబ్బులు కట్టాలి.

అదలా ఉండగా.. ఉత్తర కొరియా జాలర్లకు చేపల వేట కొన్నాళ్లుగా ప్రమాదకరంగా మారుతోంది. చేపలు బాగా దొరుకుతాయన్న ఆశతో చాలామంది మత్స్యకారులు సముద్రంలో చాలా దూరం వెళ్తుంటారు.

అలా వెళ్లిన తర్వాత బోటులో ఇంధనం అయిపోవడం, లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో గల్లంతవుతున్నారు.

పలుమార్లు మృతదేహాలతో నిండిన ఉత్తర కొరియా బోట్లు జపాన్ పశ్చిమ తీరానికి కొట్టుకొచ్చాయి. జాలర్లు తిరిగి వెనక్కి వెళ్లలేకపోవడం వల్లే చనిపోయి ఉంటారని భావించారు.

ఇప్పుడు అదనపు ఆదాయం కోసం లీ కూడా అలాంటి రిస్క్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ వేట సాఫీగానే సాగినా.. చేపల ఎగుమతుల మీద కూడా ఆంక్షల ప్రభావం ఉంది. చైనాకు చేపల ఎగుమతులు నిలిచిపోయాయి.

మరోవైపు, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఉత్తర కొరియాలో 2017 వేసవి తర్వాత నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. దాంతో బోట్ల నిర్వహణ కూడా కష్టంగా మారింది.

మూతపడ్డ వస్త్ర పరిశ్రమ

లీ భార్య వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. గతంలో ఉత్తర కొరియా నుంచి చైనాకు వస్త్రాల ఎగుమతులు బాగానే జరిగేవి. కానీ, ఆంక్షల కారణంగా ఆగిపోయాయి.

ఫలితంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.

ఇప్పుడు ఆమె కూడా ప్రత్యామ్నాయం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Image copyright HAJUNG LIM

విదేశాల్లో ఉద్యోగాలు ఉఫ్..

గతంలో దాదాపు లక్ష మంది ఉత్తర కొరియా కార్మికులు ఇతర దేశాల్లో పనిచేసేవారు. లీ సోదరుడు రష్యాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ.. ఇంటికి కొంత డబ్బు పంపిస్తూ ఉండేవారు.

కానీ, వారి మీద కూడా ఆంక్షలు విధిస్తూ 2017 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దాంతో విదేశాల్లో ఉన్న ఉత్తర కొరియా కార్మికులంతా 24 నెలల్లోగా స్వదేశం వెళ్లిపోవాల్సిన పరిస్థితి. అలాగే ఆ దేశం నుంచి ఒక్క కార్మికుడు కూడా బయటకు వెళ్లే వీలులేదు.

పిల్లలు చదువుకు దూరం

లీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తే.. ఆయన తన చిన్నారి కూతురిని బడి మాన్పించి, పనికి పంపించే సూచనలు ఉన్నాయి.

ఉత్తర కొరియాలో పిల్లలు తప్పనిసరిగా 12 ఏళ్లపాటు చదువుకోవాలన్న నిబంధన ఉన్నట్టు తెలిస్తోంది. కానీ, పేద కుటుంబాలు తమ పిల్లలను బడి మాన్పించి, ఇంటి దగ్గర పనుల్లో పెడుతున్నారు.

అదనపు ఆదాయం కోసం ఉపాధ్యాయులు కొన్నిసార్లు తరగతులు మానేసి మార్కెట్లలో పనిచేస్తుంటారు.

ఆంక్షలు ఎత్తివేస్తే ఉత్తర కొరియా ఆదాయ మార్గాలు తిరిగి తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బడి మానేసిన చిన్నారులు మళ్లీ పలకా, బలపం పట్టే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అమెరికా, దక్షిణ కొరియా దేశాలు తమకు శత్రువులంటూ బోధిస్తున్న ఉత్తర కొరియా పాఠశాలల సిలబస్‌ మారొచ్చు.

అక్రమంగా వచ్చిన విదేశీ సినిమాలు, దక్షిణ కొరియా టీవీ కార్యక్రమాల వల్ల, విదేశాల్లో పనిచేసి కార్మికులు వెనక్కి రావడం ద్వారా బయటి ప్రపంచం తమకంటే ఎంత మెరుగ్గా ఉందో చాలామంది ఉత్తర కొరియన్లకు తెలుస్తోంది.

దాంతో దేశంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కిమ్ జోంగ్- ఉన్ ఆంక్షల ఎత్తివేత కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ కథనం కోసం కూక్మిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రీ లాంకోవ్, లిబర్టీ ఇన్ నార్త్ కొరియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సొకీల్ పార్క్, తదితరులతో బీబీసీ మాట్లాడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)