జీన్ థెరపీ: పక్షవాతానికి పరిష్కారం

  • 17 జూన్ 2018
ఎలుకలు, పక్షవాతం, వెన్నెముక Image copyright Getty Images

పక్షవాతం వచ్చిన వ్యక్తుల చేతులు మళ్లీ పని చేసేలా పరిశోధనల్లో పురోగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఎలుకలపై పరిశోధన అనంతరం లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని ప్రకటించింది.

తమ పరిశోధన ద్వారా వారు దెబ్బ తిన్న ఎలుకల వెన్నుపూసను సరిచేశారు.

దీంతో అవి ఇప్పుడు తమ ముందు కాళ్లను ఉపయోగించి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాయని వెల్లడించారు.

ఇది చాలా ప్రాథమిక దశలో ఉన్న పరిశోధన అయినప్పటికీ, భవిష్యత్తులో చేతులకు పక్షవాతం వచ్చిన వారు తిరిగి వాటిని ఉపయోగించలుగుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

నరాల సముదాయమైన వెన్నుపూస, మెదడు నుంచి ఇతర శరీర భాగాలకు సూచనలను మోసుకు వెళుతుంది.

అయితే వెన్నుపూసకు ఏదైనా దెబ్బ తగిలినపుడు, కొత్తగా ఏర్పడిన కణజాలం నరాల మధ్య అడ్డుగా నిలవడం వల్ల, మెదడు సూచనలు శరీరభాగాలకు అందడంలో అంతరాయం కలుగుతుంది.

Image copyright Getty Images

శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగంలో వెన్నుపూసలో కొత్తగా ఏర్పడిన కణజాల ప్రభావాన్ని నిర్వీర్వ్యం చేయడానికి ప్రయత్నించారు.

ఇందుకోసం కొత్తగా ఏర్పడిన కణజాలానికి వారు జీన్ థెరపీ చేశారు. ఈ థెరపీలో 'కాండ్రోటినేజ్' అనే ఎంజైమ్‌కు ఒక డ్రగ్ ద్వారా వారు కొన్ని జన్యుపరమైన సూచనలు పంపారు.

ఇలా రెండు నెలల పాటు ఎలుకలకు జీన్ థెరపీ చేయగా, ఎలుకలు తమ ముందు కాళ్లను తిరిగి ఉపయోగించడం మొదలుపెట్టాయి.

ఈ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ ఎమిలీ బర్న్‌సైడ్, థెరపీ అనంతరం ఎలుకలు చక్కెర ముక్కలను ఖచ్చితంగా పట్టుకోగలిగాయని తెలిపారు. అంతే కాకుండా ఎలుకల వెన్నుపూస కార్యకలాపాలు కూడా నాటకీయరీతిలో పెరిగినట్లు తెలిపారు. దీనిని బట్టి వెన్నుపూసలోని నరాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఏదైనా ప్రమాదంలో కింద పడి వెన్నుపూస దెబ్బతిన్న వారికి ఈ పరిశోధన బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Image copyright Getty Images

ఈ పరిశోధనలో పాల్గొన్న మరో ప్రొఫెసర్ ఎలిజబెత్ బ్రాడ్‌బరీ, ఈ ప్రయోగ ఫలితాలు చాలా ఉత్తేజపూరితంగా ఉన్నాయని తెలిపారు. వెన్నుపూస దెబ్బ తిన్న వారిలో చేతులను ఉపయోగించడమనేది చాలా ప్రాధాన్యత వహిస్తుందని ఆమె అన్నారు.

''కాఫీ కప్ లేదా టూత్ బ్రష్‌ను పట్టుకోవడం వంటి వాటి వల్ల వెన్నుపూస దెబ్బ తిన్న వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు ఇతరుల మీద ఆధారపడడం తగ్గి, తమ పనులను తామే చేసుకోగలుగుతారు'' అని ఆమె అన్నారు.

ఈ జీన్ థెరపీని ఇంకా మానవులపై ప్రయోగించేందుకు సిద్ధం కాలేదు.

అయితే వెన్నుపూస దెబ్బ తినడం కారణంగా పక్షవాతానికి గురైన వారిని తిరిగి మామూలుగా మార్చే కాలం ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు