రాషిద్ ఖాన్: క్రికెట్ పాకిస్తాన్‌లో నేర్చుకున్నా.. ప్రేమించటం భారతీయుల నుంచి నేర్చుకున్నా

  • 16 జూన్ 2018
రాషిద్ ఖాన్ Image copyright Rashid-Khan-1480520732221607/facebook

ఆఫ్ఘనిస్థాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తే కావచ్చు. కానీ, ఆ దేశానికి చెందిన ఈ ఆటగాడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న దశ నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రాషిద్ ఖాన్‌తో బీబీసీ ప్రతినిధి సూర్యవంశి ప్రత్యేక ఇంటర్వ్యూ..

క్రికెట్ ఆటలోని ఏ విభాగంలోనైనా ఈ క్రికెటర్ రిపోర్ట్ కార్డ్ అడిగితే, అద్భుతమైన రిపోర్ట్ మీ చేతికి అందుతుంది. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్.. 44 వన్డేలలో వంద వికెట్లు తీసిన బౌలర్.. ఇలా రికార్డులు చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. అతనే రాషిద్ ఖాన్.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆఫ్ఘన్ క్రికెట్ లేటెస్ట్ సెన్సేషన్ రాషిద్ ఖాన్ స్పెషల్ ఇంటర్వ్యూ

రిపోర్టర్: మీకు ఈ రికార్డులన్నీ ఎలా సాధ్యమయ్యాయి. రోజూ ఎలా సాధన చేస్తారు. ఉదయం లేవగానే గూగ్లీ ఎలా వెయ్యాలి.. అని ప్రాక్టీస్ చేస్తారా?

రాషిద్ ఖాన్: ప్రత్యేకంగా ఏమీ చెయ్యను. ఏదైనా రికార్టు నెలకొల్పాలన్న ఆలోచన ఏమీ లేదు. నా మనసులో ఉన్నది క్రికెట్ మాత్రమే. జట్టు కోసం బాగా ఆడాలని అనుకుంటాను, అంతే.

రిపోర్టర్: మిమ్మల్ని అభిమానించే విషయంలో సరిహద్దులు చెరిగిపోతాయి. ఆఫ్ఘనిస్థాన్‌ కావచ్చు లేదా భారతదేశం కావచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన అభిమాని ఎవరైనా ఉన్నారా?

రాషిద్ ఖాన్: ఓసారి రెస్టారెంట్‌కి వెళ్ళాను. కొండల నుంచి నడిచి వెళ్లినందుకు బాగా అలసిపోయాను. కూర్చోగానే ఓ చిన్న పిల్లాడు పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను అల్లుకుపోయాడు. నేను ఏమైంది అని అడిగాను. నేను మీకు పెద్ద అభిమానిని అని అన్నాడు. నాకు నవ్వొచ్చింది. నన్ను మరోసారి బాగా చూసి, మళ్ళీ గట్టిగా బుగ్గ గిల్లాడు. ఏం చేస్తున్నావని ఆ అబ్బాయిని అడిగాను. మీరు ఒరిజనలా కాదా అని చెక్ చేస్తున్నానని బదులిచ్చాడు. నాకు నవ్వాగలేదు.

నా తల్లిదండ్రులు నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహించలేదు. నేను బాగా చదువుకోవాలని వాళ్లు కోరుకున్నారు

ఈ ఇంటర్వ్యూలో రాషిద్ ఖాన్ చెప్పిన మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు..

  • పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరం నుంచే క్రికెట్ నేర్చుకున్నాను. పెషావర్ సమీపంలోని ఖురాసన్ ప్రాంతంలో ఈ శరణార్థి శిబిరం ఉండేది. తొలుత టెన్నిస్‌బాల్‌తో క్రికెట్ ఆడటం నేర్చుకున్నాను. బాగా ఆడుతుండటంతో నన్ను పెషావర్ అకాడెమీకి పంపించారు.
  • 2015 అక్టోబర్ 26వ తేదీన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జింబాబ్వేపై ఆడాను. అదే సంవత్సరం టీ20ల్లో కూడా ఆడాను
  • మర్చిపోలేని ప్రదర్శన ఐర్లాండ్‌పై. గతేడాది మార్చి 10వ తేదీన గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీశాను
  • ఐపీఎల్‌ కారణంగా భారత్‌లో గడిపాను. చాలామంది నన్ను అభిమానిస్తున్నారు. ఇదంతా చూస్తే.. ‘నేను భారతీయుల ద్వారానే ప్రేమించటం నేర్చుకున్నాను’ అని నాకనిపిస్తుంది.
  • నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. మేం 11 మంది సంతానం. ఏడుగురు సోదరులం, మాకు నలుగురు అక్కచెల్లెళ్లు
  • నా తల్లిదండ్రులు నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహించలేదు. నేను బాగా చదువుకోవాలని వాళ్లు కోరుకున్నారు. నాకూ అదే చెప్పేవాళ్లు
  • హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ సినిమాలు. అలా హిందీ సినిమాలు చూస్తూ.. చూస్తూ హిందీ మాట్లాడటం నేర్చుకున్నాను
Image copyright Rashid-Khan-1480520732221607/facebook

రిపోర్టర్: మీరు షాహిద్ అఫ్రిదీ నుంచి బాగా స్పూర్తి పొందారనుకుంటా! షార్జాలో ఆడినప్పుడు, శిక్షణ తీసుకున్నప్పుడు షాహిద్ అఫ్రిదీతో మాట్లాడారా?

రాషిద్ ఖాన్: అఫ్రిదీ, అనిల్ కుంబ్లేలను బాగా ఫాలో అవుతాను. యూట్యుబ్‌లో వారి వీడియోలను చూస్తుంటాను. వరల్డ్ ఎలెవన్ జట్టులో ఆడినప్పుడు ఆయన మా కెప్టెన్. కలవగానే నా సక్సెస్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఐపీఎల్‌ లో మంచి ప్రదర్శనకు అభినందించారు.

విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ వికెట్. ఎం.ఎస్ ధోనీ వికెట్ కూడా. ఈ ముగ్గురు కూడా స్టార్ ఆటగాళ్లు. ఏ ఫార్మాట్‌లో వారి వికెట్ తీసుకున్నా సంతోషిస్తాను. వాళ్లను ఔట్ చేయడాన్ని, బౌల్డ్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. జట్టుకు అవసరమైన చోట వికెట్ సాధించడం చాలా ఆనందం కలిగించింది.

రిపోర్టర్: పదేళ్ల రాషిద్ ఖాన్ శరణార్థి శిబిరాలకు చేరాడు. అక్కణ్ణుంచి ఇక్కడి దాకా వచ్చారు. ఈ ప్రయాణం ఎలా సాగింది?

రాషిద్ ఖాన్: మొదట్లో చాలా కష్టంగా ఉండేది. శరణార్థి శిబిరాల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళం కాదు. ఇంట్లో వాళ్ళూ వెళ్ళనిచ్చేవారు కాదు. కుటుంబ సభ్యులు ఎక్కువగా చదువుకోమని చెప్పేవారు. నాకూ బాగా చదువుకోవాలని ఉండేది. ఎంతో ఇష్టంగా చదువుకునేవాణ్ణి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సోదరులతో బాగా ఆడుకునేవాణ్ణి. దేశీయ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇచ్చాను. అండర్ 19 జట్టులోకి వచ్చాను. మా కోచ్ దౌలత్ నన్ను అండర్-19కు సెలెక్ట్ చేశారు. మూడు నెలలు బాగా కష్టపడితే పెద్ద క్రికెటర్ అవుతావని అప్పుడే ఆయన నాకు చెప్పారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)