#FIFA2018: ఫుట్‌బాల్ క్రీడాకారుల మూఢవిశ్వాసాలు, అలవాట్లు, ఆచారాలు

  • 17 జూన్ 2018
వ్యక్తి కాళ్లు Image copyright iStock/Getty Images
చిత్రం శీర్షిక పలువురు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి.

ఎన్నో ఏళ్లుగా విజయాలు సాధిస్తూ.. క్రీడాభిమానులను అలరిస్తున్న పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులు మూఢవిశ్వాసాలు, అలవాట్లను, ఆచారాలను పాటిస్తున్నారు.

వాటిని పాటించడం వల్లనే ఆటలో గెలుపు సాధిస్తున్నారని చెప్పలేం. కానీ, వాళ్లు మాత్రం అవి తమ వృత్తిలో భాగం అన్నట్టుగా క్రమం తప్పకుండా పాటిస్తున్నారు.

అదృష్టం కలిసిరావాలన్న ఆలోచనతోనే అవి పాటిస్తున్నామంటూ కొందరు ఆటగాళ్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

అలా వింత అలవాట్లను, విశ్వాసాలను పాటించే కొందరు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుల గురించి చూద్దాం.

Image copyright RAFAEL URZUA/AFP/Getty Images
చిత్రం శీర్షిక కొలంబియా మాజీ గోల్ కీపర్ రెనే హిగ్విటా

'నీలి రంగు లోదుస్తులతో అదృష్టం'

కొలంబియా మాజీ గోల్ కీపర్ రెనే హిగ్విటాకు ఒక వింత అలవాటు ఉంది.

అదేంటంటే.. ప్రతి ఆటలోనూ తాను నీలిరంగు లోదుస్తులే వేసుకునేవాడినని, దాంతో అదృష్టం కలిసొచ్చేదని ఆయన చెబుతారు.

"80వ దశకం ఆఖరులో మా జట్టు(కొలంబియా జట్టు) ఓడిపోయింది. దాంతో జాతకాలు చెప్పే ఓ మహిళ వద్దకు మరో వ్యక్తితో కలిసి వెళ్లాను. మా జట్టుకు కీడు ఉందని, అది పోవాలంటే ఇవి వేసుకోవాలి అంటూ మా జట్టు సభ్యులందరికీ బెల్టులు, నీలి రంగు లోదుస్తులు ఇచ్చారు. ఆ తర్వాత మాకు అదృష్టం కలిసొచ్చింది. కోపా కప్‌ గెలిచాం" అని చెప్పుకొచ్చారు రెనే.

Image copyright Clive Mason/Getty Images
చిత్రం శీర్షిక జర్మనీ జట్టు సభ్యుడు మారియో గోమెజ్‌

టాయిలెట్ ఎడమ వైపునే ఉండాలి

ప్రస్తుతం రష్యా వరల్డ్ కప్‌లో ఆడేందుకు వెళ్లిన జర్మనీ జట్టులో సభ్యుడు మారియో గోమెజ్‌కు ఓ వింత అలవాటు ఉంది.

ఇతగాడు ఎప్పుడూ తన గదిలో ఎడమ వైపున టాయిలెట్ ఉండేలా చూసుకుంటారట.

మాజీ అర్జెంటీనా గోల్‌కీపర్ సర్జియో పిచ్ మీదనే మూత్రం పోసేవాడట.

1990లో యుగోస్లేవియాతో ఇటలీలో మ్యాచ్ జరుగుతోంది. అప్పటికే ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడంతో మూత్రం తన్నుకొచ్చింది. కానీ, టాయిలెట్‌కి వెళ్లే సమయం లేదు. దాంతో పిచ్ మీదనే టాయిలెట్ పోశాడట. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిచింది.

ఆ తర్వాత ఇటలీతో సెమీ- ఫైనల్‌ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఇతగాడు అలాగే చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ అర్జెంటీనా గెలిచింది.

Image copyright PATRIK STOLLARZ/AFP/Getty Images
చిత్రం శీర్షిక గెన్నారో గట్టుసో

ఆటకు ముందు ఓ రష్యన్ కథ

గెన్నారో గట్టుసో.. ఇటలీకి చెందిన టాప్ ఫుట్‌బాల్ ఆటగాడు. రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ఏసీ మిలాన్ ఫుట్‌బాల్ క్లబ్‌కి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈయన ప్రతి మ్యాచ్‌కి ముందు 19వ శతాబ్దంలో వచ్చిన "క్రైమ్ అండ్ పనిష్మెంట్", "ది బ్రదర్స్ కరమజోవ్", "ది ఈడియట్" లాంటి రష్యన్ నవలలు చదివేవారు.

అంతేకాదు, "ప్రపంచ కప్‌లో తొలి రోజు ఏ స్వెటర్ వేసుకున్నానో.. ఆ టోర్నమెంట్ పూర్తయ్యేదాకా ప్రతి ఆటలోనూ అదే స్వెటర్ వేసుకునే వెళ్లేవాడిని. దాంతో చెమట ఏరులై పారేది. అయినా నా ఆచారాలను వదిలేయలేక అలాగే భరించేవాడిని" అని అంటారు గెన్నారో గట్టుసో.

Image copyright ODD ANDERSEN/AFP/Getty Images
చిత్రం శీర్షిక రొనాల్డో

కుడికాలు ముందు పెట్టి..

రెండు ప్రపంచ కప్‌లు, బోలెడన్ని అవార్డులు తన ఖాతాలో వేసుకున్న పోర్చుగీస్ ఆటగాడు రొనాల్డోకి కూడా ఓ నమ్మకం ఉంది.

ఇతడు ప్రతిసారీ కుడికాలు ముందు మోపి పిచ్‌లోకి ప్రవేశిస్తాడు.

తాను మూఢ విశ్వాసాలను పాటించడం వాస్తవమే అని మహోయూ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడే చెప్పాడు.

"అందరు ఆటగాళ్లలాగే, నాకు కూడా కొన్ని మూఢ విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కుడికాలు ముందు పెట్టి పిచ్‌లోకి ప్రవేశించడం. ఆ అలవాట్లను అలాగే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాను. వాటి వల్ల నాకు ఇంతకుముందు ఆటల్లో కలిసొచ్చింది" అని 2016లో రొనాల్డో వివరించారు.

ఇతని అలవాటే బ్రెజిల్‌కి చెందిన మరో ఆటగాడు రోబర్టో కార్లోస్ కూడా పాటిస్తున్నారు.

Image copyright Clive Brunskill/Getty Images
చిత్రం శీర్షిక చీలీ ఆటగాడు ఇవాన్ జమరోనో

ఆ బ్యాండేజీ ఎందుకో?

చీలీ ఆటగాడు ఇవాన్ జమరోనో ప్రతి ఆటలోనూ తన కుడిచేతి మణికట్టుకు ఓ బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తాడు.

ఓ సారి మణికట్టుకు చిన్న గాయం కావడంతో బ్యాండేజీ చుట్టుకున్నాడు. అదే రోజు మూడు గోల్స్ చేశాడు.

దాంతో ఆ బ్యాండేజీని ప్రతి ఆటలోనూ కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడట. అలాగే కొనసాగిస్తున్నాడు.

Image copyright REUTERS/Andrew Yates
చిత్రం శీర్షిక ఐకర్ కాసిల్లాస్‌‌

పిచ్‌కి గుర్తులు

2010 ప్రపంచ కప్‌, 2012 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌‌తో పాటు అనేక విజయాలు సాధించిన స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐకర్ కాసిల్లాస్‌‌కి కూడా కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉన్నాయి.

"ఎక్కువగా మూఢవిశ్వాసాలు పాటించే వారిలో ఐకర్ ఒకరు" అన్న టాక్ కూడా ఉంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు తన షర్ట్ చేతులను కత్తిరించుకుంటాడు. అలాగే సాక్సులను తిరగేసి వేసుకుంటాడు. గోల్ లైన్‌కి అంచున ఎడమ కాలితో గుర్తులు పెడతాడు.

Image copyright PA
చిత్రం శీర్షిక జాన్ టెర్రీ

బస్సులో ఎప్పుడూ ఒకే చోట

తనకు అనేక అలవాట్లు ఉన్నాయని ఇంగ్లాండ్ ఆటగాడు జాన్ టెర్రీ అంటున్నాడు.

"నేను స్టేడియంకు వెళ్లే ప్రతిసారి బస్సులో ఒకే చోటే కూర్చుంటాను. సాక్సులకు మూడు వరుసల టేపు చుడతాను. స్టేడియంకు వెళ్లేటప్పుడు రోజూ ఒకే సీడీలోని పాటలు వింటాను. ఆట మొదలయ్యే ముందు ఎప్పుడూ ఒకే చోట విరామం తీసుకుంటాను" అని జాన్ టెర్రీ చెప్పుకొచ్చాడు.

మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. పదేళ్ల కింద నుంచీ ఇతగాడు స్టాంఫోర్డ్ బ్రిడ్జ్‌కి కుడి వైపునే మూత్రం విసర్జిస్తాడట.

చిత్రం శీర్షిక బాబీ మూర్

ఎప్పుడూ ఆలస్యమే..

పిచ్ మీదకు అందరికంటే ఆఖరికి వెళ్లే ఇంగ్లాండ్ ఆటగాడు బాబీ మూర్.

అలా పిచ్‌ మీదకు ఆలస్యంగా వెళ్లే వారిలో ఐవరీ కోస్ట్‌కు చెందిన కోలో టౌరే కూడా ఒకరు.

ఇతడు 2009 నుంచి దాన్ని అలవాటుగా చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

#FIFA2018: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత ఫ్రాన్స్.. క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం

#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..

ట్విటర్‌ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి

‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన

గ్రీన్‌ల్యాండ్: ఊరిని భయపెడుతున్న భారీ ఐస్‌బర్గ్

వాట్సాప్‌ వదంతులు: చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచారని గ్రామస్తుల దాడి.. బీదర్‌లో హైదరాబాద్ వాసి మృతి

బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు