మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- లీహ్ కేమిస్కీ
- బీబీసీ ఫ్యూచర్

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రపంచం పురుషులతో తయారైంది. సమాజం, వనరులు, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ అంతటా వారిదే ఆధిపత్యం.
మహిళ శరీరంపై కూడా పురుషులు తమ హక్కు చెలాయిస్తున్నారనేది మరో పచ్చి నిజం. మహిళల గుండె, మెదడు, శరీరంపై కూడా పురుషుడు ప్రభావం చూపిస్తున్నాడు. అంతే కాదు, మహిళల శరీరంలోని అవయవాలన్నీ కూడా పురుషుల పేర్లతోనే ఉన్నాయి.
మీరు ఒక మహిళ నడుము చుట్టూ చూస్తే, అక్కడ ఎంతో మంది పురుషులు కనిపిస్తారు. గర్భాశయం వెనుక చూస్తే జేమ్స్ డగ్లస్ దాక్కుని ఉంటాడు.
అండాశయం కాస్త దగ్గరగా చూస్తే గాబ్రియెల్ ఫెలోపియన్ శిబిరం కనిపిస్తుంది. యోని లేదా, వెజైనా బయటి పొరపై కాస్పర్ బార్తోలిన్ పేరు ఉంటుంది.
ఇక జీ-స్పాట్ దగ్గర ఎర్నెస్ట్ గ్రాఫెన్ బర్గ్ కలుస్తాడు.
అసలు ఈ పురుషులంతా మహిళ ప్రైవేట్ పార్ట్స్ లోపల ఎందుకు చిక్కుకుపోయారు? మీకు ఈ సందేహం రావడం సహజమే.
ఫొటో సోర్స్, Getty Images
ఇలా ఎందుకు జరుగుతుందంటే?
మహిళల్లో గర్భాశయం వెనక ఉన్న సంచిని పవుచ్ ఆఫ్ డగ్లస్ అంటారు.
వెజైనా పై పొరల్లో దాగి ఉండే గ్రంథులను కాస్పర్ బర్తోలిన్ అనే పేరుతో పిలుస్తారు. ఫెలోపియన్ ట్యూబ్స్ అనే పేరు గాబ్రియెల్ ఫెలోపియన్ పేరు నుంచే వచ్చింది. ఇక ప్రముఖంగా చెప్పుకునే జీ-స్పాట్ అనే పేరును ఎర్నస్ట్ గ్రాపెన్ బర్గ్ పేరుమీదే పెట్టారు.
పురుషుల పేర్లే కాదు, మహిళల అవయవాలకు దేవతల పేర్లు కూడా ఉన్నాయి.
వెజైనా లేదా యోని లోపల ఉండే హైమెనస్ అనే పొరకు గ్రీకు దేవత హైమెన్ పేరు పెట్టారు. వివాహం అయిన రోజు రాత్రి హైమెన్ మరణిస్తాడని చెప్పుకుంటారు.
విజ్ఞానం అయినా, మెడిసిన్ అయినా, వాటిపై పురుషులు, దేవతలు తమదైన ముద్ర వేశారు. వేల ప్రాణులకు పురుషులు, దేవతల పేర్లే పెట్టారు. ఉదాహరణకు సాల్మోనెలా బాక్టీరియాకు అమెరికా డాక్టర్ డేనియెల్ ఎల్మర్ సాల్మన్ పేరు పెట్టారు. కానీ ఆ బాక్టీరియాను కనిపెట్టింది మాత్రం ఆయన సహాయకుడు కావడం విశేషం.
ఫొటో సోర్స్, Getty Images
మహిళల పేర్లు ఎందుకు పెట్టలేదు?
నిజానికి శతాబ్దం ముందు వరకూ మహిళలకు మెడికల్ సైన్స్‌లో ప్రవేశించడం దాదాపు అసాధ్యంగా ఉండేది. అది దీనికి ఒక కారణం అయ్యుండచ్చు.
అయితే, పురుషాధిక్య సమాజం కారణంగా తరచూ ఏవైనా ఆవిష్కరణలు జరిగినప్పుడు ఆ ఘనతను పురుషులకే ఇచ్చారు. ఏదైనా కనిపెట్టినపుడు వాటికి తమ పేర్లే పెట్టుకున్నారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
భాష మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిలైడ్ ప్రొఫెసర్ ఘిల్లాడ్ జకర్మెన్ "ఏదైనా ఒక పదం మహిళకు సంబంధించింది అయితే, అందులో మృదుత్వం, నాజూకుతనం వెతుకుతారు, అదే పురుషుల పేరు ఉన్న పదాలు అయితే వాటిని దృఢత్వానికి చిహ్నంగా భావిస్తారు" అని చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
మాటల్లో లింగ బేధం
మనకు అందరికీ హిస్టీరియా అనే మాట తెలుసు. ఇది గ్రీకు భాష నుంచి వచ్చింది. హిస్టీరికా అనేది దీనికి మూలం. గ్రీకు భాషలో గర్భాశయాన్ని హిస్టీరికా అనే అంటారు. మెడికల్ సైన్స్ పితామహుడు హిపోక్రటీస్ గర్భాశయానికి ఈ పేరు పెట్టారు. దాని నుంచే హిస్టీరియా అనే వ్యాధికి పేరు పెట్టారు. దీనిని మొదట్లో మహిళల మానసిక వ్యాధిగా భావించేవారు. గర్భాశయం కదలికల వల్ల అది వస్తుందని అనుకునేవారు.
ఆరోగ్యం, జబ్బులు, లేదా చికిత్సా పద్ధతులు ఇలా దేని గురించి మాట్లాడినా, ప్రతి చోటా మనకు పురుషుల పేర్లే వినిపిస్తాయి, కనిపిస్తాయి.
మహిళ శరీరం యుద్ధంలో గెలిచిన పురుషుడి ఆస్తిలా మారిపోతుంది. అందుకే వజయినాలో ప్రధాన పదం లాటిన్ నుంచి వచ్చింది. దానికి కత్తి లేదా, ఖడ్గం అనే అర్థం ఉంది.
అలాగే క్లిటోరిస్ అనే గ్రీకు పదాన్ని కూడా శాశ్వతంగా యోనితో కలిసి ఉండేలా చేశారు. దీనికి మూసివేయడం అని అర్థం వస్తుంది.
2013లో సూసన్ మోర్గాన్ ఫిజియాలజీ అధ్యయనంలో భాగంగా జెండర్ బయాస్ రీసెర్చ్ చేశారు. వైద్య అధ్యయనాలన్నీ పురుషుల శరీరాన్ని ఉద్దేశించే చెబుతారని దీని ద్వారా వెల్లడైంది.
మనిషి శరీరం అంటే పురుషుడి శరీరం మాత్రమే అని అనుకున్నట్టు అనిపిస్తుంది. మహిళ శరీరాన్ని కేవలం వ్యత్యాసం చూపించడానికి మాత్రమే ఉపయోగించేవారు.
ఇప్పుడు మెడికల్ అధ్యయనాల నుంచి శరీర అవయవాల పేర్ల వరకూ పురుషుల పేర్లదే హవా. ఇవి మన ఆలోచనలపై, మన చదువుపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి.
"ఇది చూస్తుంటే, మెడికల్ సైన్స్‌లో జరిగిన మొత్తం అభివృద్ధికి కేవలం పురుషులే కారణం అనిపించేలా ఉందని" అమెరికా ప్రొఫెసర్ లీరా బోరోడోస్చీ చెబుతారు.
ఫొటో సోర్స్, Getty Images
మహిళ శరీరాన్ని పురుషుడు గెలుచుకుని ఆమె అవయవాలకు పురుషుల పేర్లు పెట్టినట్టు ఇలా ఉండకూడదని లీరా అన్నారు.
ఇప్పటికైనా ఈ పేర్లు మార్చాలి, మనిషి శరీరంలో అవి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అనేది ఆ పేర్లతో అందరికీ తెలియాలన్నారు.
స్వీడన్లో పురుషుల అంగానికి స్నాప్ అనే పదాన్ని ఉపయోగించినట్టు, యోనికి స్నిపా అనే పదాన్ని ఉపయోగించాలని 2000 సంవత్సరంలో అన్నా కోస్తోవిక్స్ ఉద్యమం ప్రారంభించారు.
అప్పటి నుంచి స్వీడన్‌లోని ఫెమినిస్ట్ ఉద్యమకారులు, ఇంగ్లీషులో ఉన్న పురుషుల పేర్ల స్థానంలో వాటికి సమానంగా ఉండే మహిళల పేర్లను వాడాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
ఇప్పుడు వాళ్లు యోని పై పొరను హైమెన్ అనడానికి బదులు వజయినల్ కోరోనా అనడం ప్రారంభించారు.
ఇక ముందు ముందు ఈ అవయవాలకు కొత్తగా ఎన్ని మహిళా పేర్లు పరిచయం చేస్తారనేది చూడాలి.
ఇప్పటివరకూ అంతర్గత అవయవాలకు అంటుకుని ఉన్న పురుషుల పేర్లను మహిళలు ఇక తొలగించే సమయం ఆసన్నమైందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- రామాయణంలో సీత టెస్ట్‌ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- టెక్స్టింగ్ సరే.. మరి sexting అంటే? అలా చేయొచ్చా?
- భారత్‌లో వేగంగా పెరుగుతున్న సెక్స్ టాయ్స్ వినియోగం..
- సెక్స్‌పై ఆసక్తి లేదా.. అది వ్యాధి లక్షణమా..
- #HisChoice: నేను సెక్స్ వర్కర్ల దగ్గరకు ఎందుకు వెళ్తానంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)