మీ సెల్ఫీ‌ నిజంగా మీదేనా.. కాదా?

వీడియో క్యాప్షన్,

మీ సెల్ఫీ‌ నిజంగా మీదేనా?

అందంగా కనిపించాలంటే ఏంచేయాలి? ఇంకా అందంగా, ఇంకా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఏం చేయాలి? - ఇలాంటి విషయాలను తెలుసుకొనేందుకు ఇంటర్నెట్‌లో కోట్ల మంది వీడియో ట్యుటోరియల్స్ చూస్తున్నారు. ముందెన్నడూ చూడనంత మంది వీటిని వీక్షిస్తున్నారు.

యూట్యూబ్‌లో అందంపై వీడియో బ్లాగులు పెట్టే ప్రముఖ వ్లాగర్లకు పెద్దసంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు యూట్యూబ్‌లో సగటున రోజూ పది లక్షలకు పైగా ఇలాంటి వీడియోలను జనం చూశారు. మరి ఈ వీడియోలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

ఫొటో సోర్స్, Getty Images

ఒకేలా ఎందుకు కనిపిస్తాం?

ఎక్కువ మంది కోరుకొనే రూపురేఖల గురించే వీడియో ట్యూటోరియల్స్‌లో తరచూ చెబుతారని 'పర్‌ఫెక్ట్ మి' పుస్తక రచయిత్రి హీదర్ విడ్డోస్ తెలిపారు. ''వాటిలో సూచించే చిట్కాలు పాటించడం వల్ల అందరి మధ్య ఎక్కువ పోలికలు కనిపిస్తాయి'' అని ఆమె చెప్పారు.

మన సెల్ఫీ నిజంగా మనదేనా?

''బ్యూటీ వీడియోల్లో ఎక్కువగా సెల్ఫీల కోసం ఎలా మేకప్ చేసుకోవాలో చూపిస్తున్నారు. ఆ సెల్ఫీలకు ఫిల్టర్లు కూడా ఉపయోగిస్తాం. మన అందాన్ని పెంచి చూపించేందుకు టెక్నాలజీనీ వాడతాం. మనది అనుకుంటున్న సెల్ఫీ నిజానికి మనది కాకపోవచ్చు. అద్దంలో కనిపించే మనం, సోషల్ మీడియాలో కనిపించే మనం ఒకేలా ఉండం'' అని హీదర్ వివరించారు.

అందానికి ప్రాధాన్యం లేదని తాను అనడం లేదని, అందం ఒక్కటే ముఖ్యం కాదని చెబుతున్నానని ఆమె స్పష్టం చేశారు. కోరుకొనే జీవితాన్ని పొందాలంటే అందంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించకుండా, ప్రతిభా సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచించారు.

ఫొటో సోర్స్, Youtube/Zoella

నిరుడు రూ.3.11 లక్షల కోట్ల అమ్మకాలు

2017లో అంతర్జాతీయంగా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు రూ.3.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో లిప్‌స్టిక్‌లు, పౌడర్లు మొదలుకొని సౌందర్య ఉత్పత్తులన్నీ ఉన్నాయి. 2018లో ఈ విక్రయాలు ఆరు శాతం మేర పెరుగుతాయని మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ మింటెల్ అంచనా వేస్తోంది.

గత ఏడాది అమ్మకాల పరంగా చూస్తే బ్యూటీ బ్రాండ్లలో ఫ్రాన్స్‌ సంస్థ లారియల్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కాస్మెటిక్స్ కంపెనీ ఇదే. ఇది నిరుడు రూ.1.47 లక్షల కోట్ల విక్రయాలు జరిపింది. లారియల్ తర్వాతి స్థానాల్లో యూనీలీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఈస్టీ లాడర్, షిసీడో, కాటీ ఉన్నాయి.

నిరుడు ఐరోపా దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లలో ముఖానికి సంబంధించిన మేకప్ సామగ్రిని 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలే ఎక్కువగా కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

2018: అత్యధిక వ్యయం అమెరికాదే

ఈ ఏడాది ప్రపంచంలోకెల్లా అత్యధికంగా అమెరికా సుమారు రూ.82,850 కోట్లు సౌందర్య సాధనాలపై వెచ్చిస్తుందని అంచనాలు చెబుతున్నాయి. మింటెల్ అంచనా ప్రకారం అమెరికా తర్వాతి స్థానాల్లో జపాన్, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా ఉన్నాయి. తొలి పది స్థానాల్లో భారత్ లేదు.

జపాన్, దక్షిణ కొరియాల్లోని సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలు సరికొత్త ఉత్పత్తులను పెద్దయెత్తున తీసుకొస్తున్నాయి.

శాంపిల్ ఉత్పత్తులను యూట్యూబ్ బ్యూటీ వ్లాగర్లకు పంపడం, ట్యుటోరియల్స్‌ మధ్యలో ప్రకటనలు ఇవ్వడం, యూట్యూబ్ వీడియో ప్రముఖులను ప్రచారకర్తలుగా పెట్టుకోవడం లాంటి ఎత్తుగడలను సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు వేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Claudio Beduschi/AGF/UIG via Getty Images

వీడియో బ్లాగులు పెట్టేవారిని 'వ్లాగర్లు' అని వ్యవహరిస్తారు. యూట్యూబ్‌లో మెక్సికోకు చెందిన ప్రముఖ బ్యూటీ వ్లాగర్‌ యూయాకు అత్యధికంగా 2.14 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ప్రముఖ యూట్యూబ్ వ్లాగర్లు - వారి సబ్‌స్క్రైబర్ల సంఖ్య

  • జోయెల్లా - 1.21 కోట్లు
  • బెథాని మోటా‌ - 1.05 కోట్లు
  • నిక్కీ ట్యుటోరియల్స్‌ - కోటి
  • మిషెల్లీ ఫాన్‌ - 90 లక్షలు

ఫొటో సోర్స్, Getty Images

అలా చేస్తే అవి ప్రకటనలే

'లారియల్ పారిస్'కు చెందిన 'ట్రూ మ్యాచ్' ఫౌండేషన్‌కు ప్రచార కార్యక్రమానికి ఆ సంస్థ ఇటీవల రోసీ బియా, జెన్నీ జెన్‌కిన్స్ లాంటి యూట్యూబ్ ప్రముఖులను నియమించుకొంది.

ఐదు మేకప్ కలెక్షన్లను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ఎంఏసీ కాస్మటిక్స్ సంస్థ 38 లక్షల మందికి పైగా యూట్యూబ్ సబ్‌స్రైబర్లు ఉన్న పాట్రిక్ స్టార్‌తో ఒప్పందం చేసుకుంది.

ఫొటో సోర్స్, MediaForMedical/UIG via Getty Images

యూట్యూబర్లు ఎవరైనా ఆయా ఉత్పత్తులపై పెట్టే వీడియోలకు ప్రతిఫలంగా ఉచితంగా ఉత్పత్తులను గాని డబ్బునుగాని స్వీకరిస్తే ఆ విషయాన్ని యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే చెప్పాలి. అమెరికాలోని నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి ఏ రకమైన ప్రచారం గురించైనా అడ్వర్టైజ్‌మెంట్‌ అనిగాని, స్పాన్సర్ చేసిన కార్యక్రమమనిగాని స్పష్టంగా తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)