ఈ మెషీన్ మనుషులతో వాదులాడుతుంది

మెషీన్

ఫొటో సోర్స్, IBM

ఒక అంశం మీద వాదనలు వినిపించడం, అభిప్రాయం చెప్పడం అంత సులువేమీ కాదు. కానీ, టెక్నాలజీ సంస్థ ఐబీఎం రూపొందించిన స్మార్ట్ మెషీన్ మాత్రం క్లిష్టమైన అంశాలపై కూడా వాదనలు వినిపిస్తోంది.

కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ మెషీన్‌కు ఐబీఎం 'ప్రాజెక్ట్ డిబేటర్' అనే పేరు పెట్టింది.

వక్తలు వెల్లడించే అభిప్రాయాలపై ఈ మెషీన్ తనదైన రీతిలో అభ్యంతరాలను కూడా వ్యక్తంచేస్తుంది.

అంతేకాదు, తన వాదన ఎందుకు బలమైనదో కూడా సమగ్రంగా వివరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

లక్షల పత్రాలను వడపోస్తుంది

ఏదైనా ఒక అంశం మీద చర్చించాలంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. క్లిష్టమైన అంశంపై అభిప్రాయం చెప్పాలంటే అనేక పుస్తకాలను, వార్తా పత్రికలను, అధ్యయన పత్రాలనూ వడపోయాల్సి ఉంటుంది.

అదంతా చేయాలంటే మనుషులకు చాలా సమయం పడుతుంది. ఈ మెషీన్ మాత్రం అప్పటికప్పుడే తన అభిప్రాయం చెప్పేస్తుంది.

అదెలా సాధ్యమంటే..

ఈ మెషీన్ కోసం ఓ డేటా బ్యాంకు ఉంటుంది.

అందులో ఐబీఎం పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయన పత్రాలు, విశ్లేషణాత్మక వార్తా కథనాలు, పుస్తకాలలోని సమగ్ర సమాచారాన్ని పెడతారు.

ఏదైనా అంశంపై చర్చలో పాల్గొన్నప్పుడు ఈ మెషీన్ అప్పటికప్పుడే తన డేటా బ్యాంకులోని సమాచారాన్ని వడపోసి, ఓ అభిప్రాయానికి వస్తుంది.

అలా కొన్ని లక్షల డాక్యుమెంట్లను ఈ మెషీన్ క్షణాల్లో విశ్లేషించగలదని ఐబీఎం పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, IBM

వ్యాఖ్యాతో వాదన

తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యాత నోవా ఒవాడియాతో, ఈ మెషీన్ చర్చించింది.

నోవా ఒవాడియా '2016 ఇజ్రాయెల్ నేషనల్ డిబేటింగ్' పోటీల్లో విజేతగా నిలిచారు.

అంతరిక్ష యాత్రల కంటే, అత్యవసర కార్యక్రమాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చుచేయాలని ఒవాడియా వాదించారు.

అందుకు ఈ మెషీన్ స్పందిస్తూ.. "డబ్బు ఖర్చు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని చెప్పడం చాలా సులువు. దానితో నేనేమీ విబేధించడం లేదు. అయితే, అంతరిక్ష పరిశోధనలతోనూ సమాజానికి మేలు జరుగుతుంది. ఈ విషయం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. నేను నా వాదనకు కట్టుబడి ఉంటాను" అని సమాధానమిచ్చింది.

ఫలానా అంశం మీద వాదన జరుగుతుందని మెషీన్‌కి ముందుగా ఎలాంటి క్లూ ఇవ్వలేదు. కానీ, అప్పటికే తన డేటా బ్యాంకులో దాదాపు 100 అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది. అందులోంచి అర్ధవంతమైన సమాచారాన్ని తీసుకుని తన అభిప్రాయం చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ముందున్న సవాల్

అయితే, "ఇలా తన సమాచార నిధిలోని డేటాను విశ్లేషించి అభిప్రాయానికి రావడం గొప్ప విషయం. ఇది సాంకేతికంగా గొప్ప ముందడుగు. కానీ, మెషీన్ విషయంలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ తన డేటాబేస్‌లోని సమాచారం ఏకపక్షంగా ఉంటే, ఈ మెషీన్ అభిప్రాయం కూడా అలాగే ఉండొచ్చు" అని యూనివర్సిటీ ఆఫ్ డండీ ప్రొఫెసర్ క్రిష్ రీడ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)