భారతీయులు వైద్య విద్య కోసం రష్యా వెళ్లట్లేదు. ఎందుకంటే..

  • 20 జూన్ 2018
భారత విద్యార్థులు, వైద్య విద్య, రష్యా

''మా అబ్బాయి వైద్య విద్య కోసం రష్యా వెళ్లాడు.''

ఉత్తర భారతదేశంలోని ఓ నగరంలో ఇలాంటి మాటలు వింటూ పెరిగాను నేను.

నేనే కాదు, చాలా నగరాల్లో ఉన్నత చదువుల కోసం తమ అబ్బాయి లేదా అమ్మాయి రష్యా వెళ్లారని తల్లిదండ్రులు చెబుతుంటారు.

కానీ గత కొన్నేళ్లుగా ఈ పరిణామం మారిపోయిందని మీకు తెలుసా?

నాకు కూడా దీనికి కారణాలు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉండింది. అందువల్ల మాస్కో చేరుకోగానే దానికి సంబంధించిన సమాచారం సేకరించే పనిలో పడ్డా.

చిత్రం శీర్షిక మాస్కోలోని భారత విద్యార్థులు

నేనుంటున్న హోటల్ నుంచి ఆర్‌యూడీఎన్ యూనివర్సిటీని చేరుకుని గేటులోనికి ప్రవేశిస్తుండగానే, అది ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అనడానికి నిదర్శనగా దక్షిణాసియా నుంచి ఆఫ్రికా విద్యార్థుల వరకు అందరూ కనిపించారు.

నేను కెమెరా తీస్తుండగానే, వెనుక నుంచి హిందీలో,''మాస్కో ట్రాఫిక్ నుంచి తప్పించుకుని వచ్చిన మీకు స్వాగతం'' అనే మాటలు వినిపించాయి.

వెనక్కి తిరిగి చూస్తే విశాల్ శర్మ, భామిని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

వాళ్లిద్దరూ మాస్కోలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

మీరట్‌కు చెందిన భామిని గత మూడేళ్లుగా రష్యాలో ఉంటోంది. మొదటి ఏడాది రష్యా భాష నేర్చుకున్న తర్వాత ఆమె గత రెండేళ్లుగా వైద్య విద్యను అభ్యసిస్తోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionరష్యాలో వైద్య విద్యపై భారతీయుల్లో తగ్గినక్రేజ్

ఇక్కడికి రావడం వల్ల వైద్య విద్యను అభ్యసించాలన్న ఆమె కోరిక నెరవేరింది కానీ, అదే సమయంలో అక్కడ చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆమె తెలిపింది.

''ఇక్కడ మన తల్లిదండ్రులు ఉండరు, మన ఇల్లు ఉండదు కాబట్టి మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఎక్కడికి పోవాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. ప్రపంచంలోనే అతి పెద్ద దేశపు రాజధాని కావడం వల్ల ఇక్కడ మనం పూర్తిగా సురక్షితం అని భావించలేం'' అని భామిని అంది.

ఇక దిల్లీకి చెందిన విశాల్, గత ఏడేళ్లుగా రష్యాలో ఉన్నాడు. రష్యాలో 'భారతీయ విద్యార్థుల సంస్థ'కు విశాల్ అధ్యక్షుడు.

అక్కడి నుంచి మేం విద్యార్థుల హాస్టల్‌కు వెళ్లాం. ఎనిమిది అంతస్తుల ఆ హాస్టల్‌కు లిఫ్ట్ లేదు. కానీ ఎయిర్ కండిషన్ మొదలైనవి మాత్రం చాలా బాగా పని చేస్తున్నాయి. లాబీలో ఒక డిపార్ట్ మెంటల్ స్టోర్, ఏటీఎం కూడా ఉన్నాయి.

Image copyright Getty Images

విద్యార్థుల ఖర్చులు

ఆ లేడీస్ హాస్టల్‌లో మేం చాలా మంది భారతీయ విద్యార్థులను కలిశాం.

అక్కడ ప్రతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు. గదిలోనే వంట సామాన్లు, వాషింగ్ మెషీన్ తదితర సామాన్లు కూడా ఉన్నాయి.

హాస్టల్ నెలసరి అద్దె రూ.12,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.

వైద్య విద్య వార్షిక ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. రష్యాలో 50కి పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మాస్కోలో చదవడం ఖర్చనుకుంటే, కురుస్క్ లేదా త్వేర్ లాంటి నగరాలలో చదువుకుంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది.

తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య

ఒకప్పుడు రష్యాలో ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసించడానికి చాలా మంది భారతీయ విద్యార్థులు వచ్చేవారు. అప్పుడు అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న కాలం. ఆ సమయంలో భారత్, రష్యాలు స్నేహపూరితంగా ఉండేవి.

అయితే కాలక్రమంలో భారతీయ విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు వెళ్లడం ప్రారంభించారు. ఈ పోటీలో రష్యా వెనుకబడిపోయింది.

విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణమేంటని నేను భామినిని ప్రశ్నించాను.

''ఇక్కడ మేం ఎదుర్కొనే అతి పెద్ద సవాలు- భాష. భాష సరిగా నేర్చుకోకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాలి'' అంది భామిని.

ఈలోగా విశాల్, ''ఇప్పుడు కూడా రష్యాకు వందకు పైగా దేశాల నుంచి మెడిసిన్, ఇతర సబ్జెక్టులను నేర్చుకోవడానికి వస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ చదువుకోవడానికి తక్కువ ఖర్చవుతుంది. అంతే కాకుండా ఇక్కడ అడ్మిషన్ కూడా సులభంగా లభిస్తుంది. అయితే ఇక్కడకు వచ్చే విద్యార్థులకు పూర్తిగా రష్యాలోనే వైద్య విద్యను అభ్యసించాల్సి ఉంటుందని చెప్పడం లేదు'' అని వివరించాడు.

గత ఏడాది వంద మందికి పైగా భారతీయ విద్యార్థులు 'స్మోలెన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ'లో ఒక ఏడాది చదువుకున్న అనంతరం భారతదేశం తిరిగి వెళ్లారు. దీనికి కారణం మొత్తం ఆరేళ్లు రష్యన్ భాషలోనే వైద్య విద్యను అభ్యసించాలని వాళ్లకు తెలియకపోవడమే.

'వెరిఫైడ్ ఏజెంట్ల'ను మాత్రమే నమ్మండి

రష్యాలో భారత రాయబారి పంకజ్ శరణ్ విద్యార్థుల సమస్యలపై బీబీసీతో మాట్లాడారు.

''నిజానికి రెండు దేశాల మధ్య సమాచారలోపం ఉంది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. రెండోది ఇక్కడ రష్యన్ భాషలో బోధిస్తుండడం మన విద్యార్థులకు కష్టంగా ఉంది. మూడోది - రెండు ప్రభుత్వాలు కలిసి ఇక్కడి డిగ్రీని గుర్తించడంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది'' అని ఆయన అన్నారు.

భారత విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోవడానికి భాషా సమస్యతో పాటు భారత్‌లో ఉన్న ఎడ్యుకేషన్ ఏజెంట్ల మోసాలు కూడా ఒక కారణం.

''భారత్ నుంచి వచ్చే విద్యార్థులు కన్సల్టెంట్ సంస్థల ద్వారా వస్తారు. అయితే వాళ్లలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఓ చోట మోసానికి గురవుతారు. విద్యార్థులకు అవి పూర్తి సమాచారం ఇవ్వవు. కన్సల్టెంట్ సంస్థలు చెప్పేదానికి, ఇక్కడ జరిగే దానికి చాలా తేడా ఉంటుంది.'' అని విశాల్ అన్నాడు.

ఇలాంటి ఫిర్యాదులు పెరిగిపోవడంతో రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు 'వెరిఫైడ్ ఏజెంట్ల' ద్వారా మాత్రమే రష్యా వెళ్లాలని ప్రచారం చేస్తున్నాయి.

Image copyright Getty Images

విద్యార్థుల సమస్యలను పక్కన బెడితే, వీళ్లంతా తమ చదువులు ముగించాక భారత్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయాలంటే మరో సమస్య ఉంది.

రష్యాలో వైద్య విద్య పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎమ్‌సీఐ) నిర్వహించే పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది.

ఆ పరీక్షను పాస్ కాలేక అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దాంతో వాళ్లు భారతదేశంలో ప్రాక్టీస్ చేయలేక, రష్యాకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేను దీని గురించి అనామిక అనే విద్యార్థినిని ప్రశ్నించినపుడు నవ్వుతూ ఉండే ఆమె మొహం ముడుచుకుంది.

''ఆ పరీక్ష పాస్ అవుతామనే అనుకుంటున్నాం. కాకుంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం'' అంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

#FIFA2018: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత ఫ్రాన్స్.. క్రొయేషియాపై 4-2 తేడాతో విజయం

#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..

ట్విటర్‌ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి

‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన

గ్రీన్‌ల్యాండ్: ఊరిని భయపెడుతున్న భారీ ఐస్‌బర్గ్

వాట్సాప్‌ వదంతులు: చిన్న పిల్లలకు చాక్లెట్లు పంచారని గ్రామస్తుల దాడి.. బీదర్‌లో హైదరాబాద్ వాసి మృతి

బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు