ఈ పసిశోకం అమెరికా వలసల కన్నీటి కథకు సంకేతం

  • గిలెర్మో డి. ఓల్మో
  • బీబీసీ న్యూస్ ముండో
బోర్డర్ పెట్రోల్ అధికారులతో మాట్లాడుతున్న తన తల్లిని చూస్తూ రోదిస్తున్న ఓ రెండేళ్ల బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జాన్ మూర్ తీసిన ఈ ఫొటో.. అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వలస కుటుంబాల పరిస్థితికి.. ప్రత్యేకించి చిన్నారుల పరిస్థితికి చిహ్నంగా మారింది

అమెరికా సరిహద్దు గస్తీ విభాగానికి ఇది మరో కేసు మాత్రమే. మెక్సికో సరిహద్దుల్లో టెక్సస్ రాష్ట్రంలోని మెక్‌అలెన్ ప్రాంతంలో పట్టుబడిన మరో నమోదుకాని వలస కుటుంబ మిది.

అయితే.. గెటీ ఇమేజెస్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ జాన్ మూర్.. అక్కడే ఉన్నారు. సరిహద్దు పోలీసులు తన తల్లిని నిర్బంధిస్తుండటాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న ఓ రెండేళ్ల బాలిక మీద అతడి కెమెరాతో దృష్టి సారించాడు.

అలా తీసిన ఈ ఫొటో.. వలస చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన ప్రతిసారీ.. ఆ చిన్నారులు, తల్లిదండ్రులు గురయ్యే వేదనకు, సంఘర్షణకు ప్రతీకగా మారింది.

అమెరికా - మెక్సికో సరిహద్దులో వలస కుటుంబాలను పెద్దలు - పిల్లలుగా వేరుచేసే ట్రంప్ ప్రభుత్వ విధానం మీద విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఫొటో కూడా వెంటనే వైరల్‌ అయింది.

‘‘ఆ చిన్నారితో ఆమె కుటుంబంతో మరింత సమయం గడపగలిగితే బాగుండేది. కానీ అది సాధ్యం కాలేదు. తాము హోండూరస్ నుంచి వస్తున్నామని ఆ బాలిక తల్లి చెప్పారు. తన రెండేళ్ల బాలికతో కలిసి నెల రోజులుగా ప్రయాణిస్తున్నానని చెప్పారు’’ అని మూర్.. బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తల్లిని అరెస్ట్ చేస్తుండగా.. ఆమె రెండేళ్ల కూతురు రోదిస్తున్న దృశ్యాన్ని జాన్ మూర్ ఫొటో తీశారు

‘‘ఆ మహిళకు సుమారు 30 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆమె తన కూతురిని చేతుల్లో ఎత్తుకుని వచ్చారు’’ అని మూర్ చెప్పారు.

‘‘ఆమె వివరాలు తెలుసుకోవటానికి, సోదా జరపటానికి ఆ చిన్నారిని కిందికి దించాలని ఆమెకు బోర్డర్ పోలీసులు చెప్పారు. కానీ వారు చెప్పినట్లు చేయగానే.. ఆ చిన్నారి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది’’ అని ఫొటోగ్రాఫర్ వివరించారు.

అమెరికా - మెక్సికో సరిహద్దులో పదేళ్లకు పైగా పనిచేస్తున్నప్పటికీ.. పాకిస్తాన్, మధ్య ప్రాచ్యం వంటి ప్రాంతాల్లో పని చేసి ఉన్నప్పటికీ.. ఇప్పుడు తన కళ్ల ముందు జరిగిన దృశ్యాలు తనకు బాధ కలిగించాయని మూర్ తెలిపారు.

‘‘నేను కొంచెం ఆగి ఊపిరి తీసుకోవాల్సి వచ్చింది. నేనొక జర్నలిస్టుని. అయినా నేనొక తండ్రిని. నాకూ చిన్న పిల్లలు ఉన్నారు. ఆ వయసు పిల్లలు ఎడబాటు ఆందోళన (సెపరేషన్ యాంగ్జైటీ)తో ఎంత బాధ పడతారో నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, John Moore for Getty Images

ఫొటో క్యాప్షన్,

బోర్డర్ పోలీసులు అడ్డుకునే వలసల్లో ఎక్కువ మంది సెంట్రల్ అమెరికా దేశాల నుంచి వస్తున్నారు

అమెరికా కొత్తగా అమలులోకి తెచ్చిన వలస విధానం కారణంగా.. ఆ చిన్నారిని ఆమె తల్లి నుంచి వేరు చేయబోతున్నారని మూర్‌కి తెలుసు. ఇకముందు జరగబోయే పరిణామాలను వీక్షించటం తనకు కష్టమని ఆయనకు అనిపించింది.

‘‘ఇది నేను చాలాసార్లు చూసిన దృశ్యమే. కానీ ఈసారి అది ఇంకా దారుణంగా అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

‘‘నేను చాలా చూశాను’’

అమెరికా బోర్డర్ పోలీసులతో కలిసి పనిచేస్తున్న సుదీర్ఘ షిఫ్ట్‌ ముగిసే సమయంలో ఈ ఫొటోలు వచ్చాయి.

‘‘దాదాపు అర్థరాత్రి సమయంలో ఈ ఫొటోలు తీశాను. అంతకుముందు పగటిపూట వలసలను కుక్కలు, హెలికాప్టర్లతో తరమటం చూశాను. చాలా దృశ్యాలు చూశాను’’ అని మూర్ వెల్లడించారు.

మెక్సికో - అమెరికాలను వేరు చేసే నది రియో బ్రావోను నాలుగు చిన్న బోటుల్లో రావటానికి ప్రయత్నిస్తున్న కొందరిని కూడా తాను చూసినట్లు ఆయన తెలిపారు. మెక్సికోలోని రీనోసా నుంచి వారు ప్రయాణిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, John Moore for Getty Images

ఫొటో క్యాప్షన్,

వలసదారుల నుంచి చిన్నారులను వేరు చేయాలన్న విధానం మీద అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

మెక్‌ అలెన్ సమీపంలో గల ‘ఎల్ రిన్కోన్’ అనే ప్రాంతంలో వీరు కలిసినట్లు మూర్ భావిస్తున్నారు.

‘‘అమెరికాలో ఆశ్రయం కోరాలని భావించే కుటుంబాలకు ఆ ప్రాంతం ఒక మీటింగ్ పాయింట్‌గా మారింది’’ అని ఆయన చెప్తారు.

‘‘వీళ్లు చాలా భయపడ్డారు. వాళ్లలో ఎక్కువ మంది సెంట్రల్ అమెరికాకు చెందిన మహిళలు, పిల్లలే. చాలా మంది అలసిపోయారు. మగతగా ఆందోళనగా ఉన్నారు’’ అని వివరించారు.

వారు వేర్వేరుగా ప్రయాణించి వచ్చారు కానీ.. అమెరికాలో ప్రవేశించటానికి కలిసి ప్రయాణం మొదలుపెట్టారు.

మూర్ కలిసి ప్రయాణిస్తున్న బోర్డర్ పోలీస్ బృందం.. ఒక మట్టి రోడ్డు మీద ఈ బాలికను, ఆమె తల్లిని అడ్డుకున్నారు.

అయితే.. అమెరికా బోర్డర్ పోలీసులు ‘‘వలసలతో అమర్యాదకరంగా ప్రవర్తించలేద’’ని మూర్ అంటారు.

ఈ వలసల వివరాలు తెలుసుకున్న తర్వాత.. వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు.

ఈ ఫొటో తీసిన తర్వాత మళ్లీ ఇప్పటివరకూ ఆ చిన్నారిని మూర్ చూడలేదు.

వీడియో క్యాప్షన్,

‘జీరో టాలరెన్స్’ అంటే పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరం చేయడమా?

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)