ఇక్కడ ఇంట్లోనే గంజాయి పెంచుకోవచ్చు

  • 20 జూన్ 2018
కెనడా, గంజాయి, చట్టబద్ధం Image copyright AFP/GETTY

మత్తు పదార్థమైన గంజాయిని వినోద అవసరాల కోసం ఉపయోగించుకొనేందుకు అవకాశం కల్పించే చట్టానికి కెనడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

కెనడా సెనేట్ 52-29 ఓట్ల తేడాతో మంగళవారం ఈ బిల్లును ఆమోదించింది. గంజాయి పెంపకం, అమ్మకాలు, సరఫరాపై ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కెనడా పౌరులు గంజాయిని తమ వినోద అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో 2015 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త చట్టం తీసుకువచ్చారు.

ఈ బిల్లు ఆమోదంతో గంజాయిని వినోద అవసరాల నిమిత్తం చట్టబద్ధం చేసిన రెండో దేశంగా కెనడా అవతరించింది.

2013లో ఉరుగ్వే మొదటిసారిగా వినోద అవసరాల నిమిత్తం గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన దేశంగా గుర్తింపు పొందింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ఇందుకు అనుమతిస్తున్నాయి.

1923లో గంజాయిని కలిగి ఉండడాన్ని కెనడాలో నేరంగా ప్రకటించారు. అయితే 2001 నుంచి వైద్య అవసరాల నిమిత్తం దానిని ఉపయోగించడాన్ని అనుమతిస్తున్నారు.

బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇప్పటివరకు పిల్లలు చాలా తేలిగ్గా గంజాయిని పొందేవారని, అయితే దానిని ఉపయోగించుకుని నేరస్తులు లాభపడేవారని తెలిపారు. ఇక నుంచి పరిస్థితి మారుతుందని ట్రూడో అన్నారు.

మార్కెట్లో గంజాయి విక్రయానికి తగిన ఏర్పాట్లు చేసుకొనేందుకు ప్రభుత్వం 8-12 వారాల సమయం ఇవ్వనుంది. 2015లో కెనడా పౌరులు సుమారు రూ.30 వేల కోట్లను గంజాయిపై ఖర్చు చేశారు.

గంజాయి విక్రయాన్ని చట్టబద్ధం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుందా?

సెప్టెంబర్ నుంచి కెనడా పౌరులకు లైసెన్స్ పొందిన ఉత్పత్తిదారులు పండించే గంజాయి అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా దీనిని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పౌరులు తమ ఇళ్లలో నాలుగు గంజాయి మొక్కలు కూడా పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

వయోజనులు 30 గ్రాముల వరకు గంజాయిని కలిగి ఉండొచ్చు.

Image copyright Getty Images

గంజాయి ఉండే ఆహార పదార్థాలు మాత్రం ఇప్పుడే అందుబాటులోకి రావు. అందుకు కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.

గంజాయిని కొనుగోలు చేసి, ఉపయోగించడానికి కనీస వయసును ఈ బిల్లులో 18 ఏళ్లుగా నిర్ణయించారు.

బిల్లులో గంజాయి ప్యాకింగ్, బ్రాండింగ్ గురించి మార్గదర్శకాలను రూపొందించారు. అలాగే వాటిపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది.

అయితే అక్రమం ఏమిటి?

  • 30 గ్రాములకన్నా ఎక్కువ గంజాయిని కలిగి ఉండడం
  • ఇళ్లలో నాలుగుకన్నా ఎక్కువ మొక్కలను పెంచుకోవడం
  • లైసెన్స్ లేని డీలర్ నుంచి కొనుగోలు చేయడం

వీటిని నేరంగా పరిగణిస్తారు.

ఇందుకు శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. దీనిని మైనర్లకు విక్రయిస్తూ పట్టుబడితే 14 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

Image copyright Getty Images

ప్రపంచవ్యాప్తంగా నిబంధనలు ఎలా ఉన్నాయి?

గంజాయిని అనేక దేశాలలో నిషేధించారు. అయితే ఇటీవలి కాలంలో దీనిని నేరంగా పరిగణించడం లేదు.

14 ఐరోపా దేశాలు, ఇజ్రాయెల్, అర్జెంటీనా, ప్యుయెర్టొ రికో, పనామా, మెక్సికో, టర్కీ, జింబాబ్వే, జాంబియాలలో కూడా వైద్యపరమైన అవసరాల కోసం గంజాయిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అమెరికాలోని 29 రాష్ట్రాలు, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాలో దీనిని వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇటీవల బ్రిటన్ కూడా వైద్య అవసరాల కోసం గంజాయిని ఉపయోగించుకోవడాన్ని సమీక్షిస్తామని తెలిపింది.

Image copyright LARS HAGBERG

కొత్త బిల్లుకు ఎవరైనా అభ్యంతరం చెప్పారా?

అయితే కొత్త చట్టానికి కొంత మంది సెనేట్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. క్యుబెక్‌కు చెందిన కన్జర్వేటివ్ సెనేటర్ లియో హౌసకోస్, ఈ కొత్త చట్టం రాబోయే తరాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ట్వీట్ చేశారు.

గంజాయిని చట్టబద్ధం చేయడానికి కనీస వయసు 25 ఉండాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సూచించగా, ఈ చట్టంలో దానిని 18 ఏళ్లకు తగ్గించడంపై విమర్శలు వ్యకమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు