మాట మార్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘ఉత్తర కొరియా ఇప్పటికీ ప్రమాదకరమే’

  • 23 జూన్ 2018
ట్రంప్, కిమ్ Image copyright Getty Images

సరిగ్గా పది రోజుల క్రితం ఇక 'ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రమాదమూ లేదు' అని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు.

ఉత్తర కొరియా అణ్వాయుధాలతో అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశం మీద విధించిన ఆంక్షలను అలాగే కొనసాగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

ఈ నెల 12న సింగపూర్‌లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ -ఉన్‌తో ట్రంప్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ తర్వాతి రోజు అంటే జూన్ 13న "ఇక ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అణ్వాయు ముప్పు ఉండదు" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

"ఇక ఈరోజు రాత్రి అమెరికన్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చు" అని మరో ట్వీట్ చేశారు.

అంతేకాదు, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించాల్సిన సైనిక విన్యాసాలను రద్దు చేశారు. దౌత్యపరమైన సంప్రదింపులకు మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

ఆ పరిణామాలతో ఇక అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండబోదని అంతా భావించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే

ఉత్తర కొరియాపై ట్రంప్ స్వరం మారిందా?

ఉత్తర కొరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ 2008 జూన్ 26న అమెరికా "జాతీయ అత్యవసర పరిస్థితి"ని ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించింది.

అయితే, అప్పటి నుంచి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షలందరూ ఆ ఆంక్షలను పునరుద్ధరిస్తూ వచ్చారు.

ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేశారు.

"కొరియా ద్వీపకల్పంలో ప్రమాదకరంగా పొంచిఉన్న విధ్వంసకర ఆయుధాలు, ఉత్తర కొరియా ప్రభుత్వ చర్యలు, విధానాల కారణంగానే జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నాం" అని ట్రంప్ పేర్కొన్నారు.

"ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధాల వల్ల అమెరికా జాతీయ భద్రతకు, విదేశీ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు ముప్పే" అని కాంగ్రెస్‌కు పంపిన నోటీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నందున ఆ దేశంపై విధించిన ఆంక్షలు అలాగే ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపేయో అన్నారు.

అయితే, పది రోజుల కింద ట్రంప్ చెప్పిన మాటలకు, తాజా ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉందని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ ఛుక్ ష్యూమర్ విమర్శించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈమెను ఉత్తర కొరియా ఇవాంకా అంటూ దక్షిణ కొరియా మీడియా అభివర్ణిస్తోంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు