యుగాండా: అట్టహాసంగా పెళ్లిళ్లు.. అప్పుల పాలవుతున్న యువకులు

  • 24 జూన్ 2018
అట్టహాసంగా పెళ్లిళ్లు Image copyright iStock

యుగాండాలో ఒక కొత్త ధోరణి ఊపందుకుంటోంది. దేశమంతటా వధూవరులు తమ పెళ్ళిని భారీ ఖర్చుతో అత్యంత అట్టహాసంగా చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఖరీదైన పెళ్ళి ఆ తరువాత జీవితాన్ని ఆర్థిక సంక్షోభంలో పడేస్తే ఎలా?

యుగాండాలో ఈ ఏడాది దాదాపు రెండున్నర లక్షల జంటలు వివాహం చేసుకోబోతున్నాయి.

పదేళ్ల క్రితం హైస్కూల్ లో ఉన్నప్పుడు ఒకర్నొకరు ఇష్టపడిన జోస్, రొనాల్డ్ యుగాండాలో చాలా మంది మాదిరిగానే సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు వారు మరో వేడుకకు సిద్ధమవుతున్నారు. అదే భారీ వివాహ వేడుక. ఈ జంట 1500 మంది అతిథులను ఆహ్వానించింది. ఇటువంటి పెళ్లికి ఏడు కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పెళ్లిళ్లకయ్యే ఖర్చును తగ్గించేందుకు ఒక చట్టం తేవాలని రాజకీయ నేతలు ప్రతిపాదిస్తున్నారు

పెళ్లి కూతురికి కట్నం.. మార్చేందుకు చట్టం!!

యుగాండాలో పెళ్లిళ్లు ఇప్పుడో పెద్ద వ్యాపారంగా మారాయి. ఖరీదైన వస్త్రాలు, భారీ వేదికలు.. పెద్ద మొత్తంలో బిల్లులు.

యుగాండాలో అధిక శాతం సంప్రదాయ ప్రకారం పెళ్ళి చేసుకుంటారు. వరుడు వధువుకు కట్నం ఇవ్వడం ఈ సంప్రదాయంలో భాగం. కానీ, ఈ రోజుల్లో చాలా జంటలు అట్టహాసంగా పెళ్లి చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మూలంగా వారు శక్తికి మించిన ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.

మోసెస్, జాన్ తమ పెళ్లికి దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అందులో సగం పెళ్లి కూతురి కట్నంగా ఇచ్చారు.

వాళ్లు ఇంకా రెండున్నర లక్షల అప్పుల్లో ఉన్నారు.

‘‘దీనివల్ల నాపై చాలా భారం పడింది. తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాను. నేను నా భార్య కూడా ఇబ్బంది పడ్డాం’’ అని మోసెస్ చెప్పగా.. ‘‘అలాంటి ఒత్తిడి మూలంగా ఒక భార్యగా నేను కుంగిపోయాను. నా భర్త అంత మొత్తం సమకూర్చలేరేమోనని దిగులు కలిగింది’’ అని జాన్ తెలిపారు.

పెళ్లిళ్లకయ్యే ఖర్చును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వధువు కట్నంలో మార్పు తీసుకొచ్చేలా చట్టం తేవాలని కొందరు రాజకీయ నేతలు ప్రతిపాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు