అభిప్రాయం: పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పెద్ద నేతలంతా నిరుపేదలే

  • వుసహతుల్లా ఖాన్
  • సీనియర్ జర్నలిస్టు, బీబీసీ కోసం, పాకిస్తాన్ నుంచి
పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఎన్నికల బండి ఇప్పుడు సెకండ్ గేర్‌లో పడింది. పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ తమ ఆస్తులు, వ్యాపారాలు, భూములు ఎన్నున్నాయో, వాటి విలువెంతో ఎన్నికల కమిషన్‌కు ఒట్టేసి మరీ నిజాలు చెప్పేస్తున్నారు.

దాంతో మనం ఇప్పటి దాకా బాగా ధనవంతులు అని అనుకున్న వాళ్లంతా మిడిల్ క్లాసు వాళ్లో లేదా అప్పర్ మిడిల్ క్లాసు వాళ్లుగానో తేలిపోయారు. ఇప్పటి దాకా పేదవాళ్లు అనుకొని తేలిగ్గా కొట్టి పారేసిన వాళ్లేమో బాగా డబ్బున్న వాళ్లని బోధపడింది. ఇక వీళ్ల దగ్గర ఎంత ఎక్కువ డబ్బుందంటే.. ఐఎంఎఫ్‌కు సైతం పాకిస్తాన్ అప్పులు ఇవ్వడం మొదలుపెట్టెయ్యొచ్చు.

ఉదాహరణకు పంజాబ్‌లోని ముజఫర్‌గఢ్ జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ హుసేన్ షేఖ్‌నే తీసుకోండి. తనకు మొత్తం 4 వేల కోట్లకు పైగా విలుప చేసే భూములున్నాయని ఆయన తన ఆస్తి వివరాల్లో ప్రకటించారు. దాంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద కుబేరుడు ఆయనే అయ్యారు.

ఇకపోతే అందరికీ బాగా తెలిసిన ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్పారో చూడండి. ఇస్లామాబాద్‌లోని బనీ గాలా పహాడీపై 300 కనాల్‌ల (దాదాపు 1,80,000 చదరపు గజాలు) విస్తీర్ణంలో ఉన్న తన ఇంటి విలువ కేవలం 30 లక్షల రూపాయలేనట. అంతే కాదు, ఆయనకు సొంత కారు కూడా లేదట. ఉన్న 14 ఇళ్లూ తండ్రులు, తాతల నుంచి సంక్రమించినవేనట. విమాన ప్రయాణాలకు టికెట్లు ఆయనకు తన దోస్తులే కొని ఇస్తారట. ఆయనెంత పేదవాడంటే పోయిన సంవత్సరం కనాకష్టంగా 1 లక్షా 4 వేల రూపాయల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించగలిగారు.

ఫొటో సోర్స్, ASIF HASSAN/AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఇమ్రాన్ ఖాన్

ఇక ఆసిఫ్ జర్దారీ గురించైతే జనాలు ఉన్నవీ, లేనివీ చాలానే మాట్లాడుకున్నారు. సింధ్‌లో ఉన్న సగం చక్కెర మిల్లులకు ఆయనే యజమాని అనుకున్నారు. దుబాయ్‌లో, బ్రిటన్‌లో బంగళాలు ఉన్నాయని నమ్మారు. వేల ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు ఉన్నాయనే పుకార్లు మరోవైపు. కానీ అవేవీ నిజం కావట.

ఆయన ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ కేవలం 75 కోట్ల రూపాయలే. అంటే భారతీయ రూపాయల్లోనైతే కేవలం 38 కోట్లే.

జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో నాలుగు వేల గజాల ఇంట్లో ఉంటారు. ఈ ఇంటి పక్క నుంచి వెళ్లే రోడ్డులో సగం భాగాన్ని ఆయన వాహనం వెళ్లడానికే ఉపయోగిస్తారు. అయినా ఈ ఇంటి విలువ 30 లక్షల రూపాయలనే ఆయన ప్రకటించారు. కానీ ఆయన ఇంటికి ఇటు పక్క, అటు పక్క ఉన్న ఇళ్లలో ఏ ఒక్కటీ 30-40 కోట్లకు తక్కువ చేయదు.

30 లక్షల బిలావల్ ఇంటిని 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలకైనా కొంటామని నాతో పాటు వేలాది మంది ముందుకు వచ్చారు. కానీ దీన్ని అమ్మడానికి బిలావల్ ససేమిరా అంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter/bilawalbhuttozardari

ఫొటో క్యాప్షన్,

తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీతో తనయుడు బిలావల్ భుట్టో

నవాజ్ షరీఫ్ పరిస్థితి అందరికన్నా దయనీయంగా ఉంది. పాపం ఆయన లాహోర్‌కు వెళ్తే వృద్ధురాలైన తన తల్లి ఇంట్లో, మరీకి వెళ్లినపుడు తన భార్య ఇంట్లో, లండన్‌కు వెళ్తే తన కుమారుడి ఫ్లాట్‌లోనే పడక వేస్తారు.

సొంతంగా వ్యాపారం ఏదీ లేదాయనకు. జేబు ఖర్చులు పిల్లలే ఇస్తారు. కాగా ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్, కుమారుడు హమ్జా వద్ద కలిపి మొత్తం ఒకటిన్నర నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఆస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నవాజ్ షరీఫ్

ఈ నాయకులందరూ దేశంలోని మూడు అతి పెద్ద రాజకీయ పార్టీలకు దేవుళ్లతో సమానం. తాము గెలిస్తే ప్రతి వ్యక్తీ పన్ను చెల్లించే, ప్రతి వ్యక్తి నిజమే మాట్లాడే విధంగా నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తామంటూ వీరు ప్రతి ఐదేళ్లకోసారి చెబుతుంటారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ధనికులు మరింత ధనికులుగా ఎదగకుండా, పేదలు మరింత నిరుపేదలుగా దిగజారిపోకుండా కట్టుదిట్టమైన చట్టాలు చేస్తామని అంటుంటారు.

పాకిస్తాన్ ఆసియన్ టైగర్ అనిపించుకునేలా ఆర్థికవ్యవస్థను పటిష్టం చేస్తామంటారు.

ఇక ప్రజల విషయమంటారా! పాత సరకునే కొత్తగా ప్యాకేజింగ్ చేసి ముందుంచితే చాలు ఎగబడి అందుకునేందుకు వాళ్లెప్పుడూ సిద్ధమే.

అవును, ఇప్పుడు ప్రజలు ఈ పని కూడా చేయకపోతే ఈ మూర్ఖులను ప్రజలు అని ఎలా పిలుస్తారు మరి!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)