నరోదా పాటియా కేసులో దోషులకు పదేళ్ల జైలు శిక్ష

  • 25 జూన్ 2018
గుజరాత్ హైకోర్టు Image copyright gujarathighcourt.nic.in

నరోదా పాటియా కేసులో ముగ్గురు దోషులకు గుజరాత్ హైకోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.

"దోషులు పాల్పడ్డ నేరాలు సమాజానికే వ్యతిరేకమైనవి.. కాబట్టి వారు పాల్పడ్డ క్రూరత్వానికి తగినట్టుగా శిక్ష ఉండాల్సిందే" అని జస్టిస్ హర్ష దేవానీ, ఏఎస్ సుపేహియాలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

2002లో గుజరాత్‌లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో నరోదా పాటియా నరమేధం ముఖ్యమైంది.

2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని నరోదా పాటియా ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 97 మంది ముస్లింలను హత్య చేశారు.

ఈ కేసులో దోషులుగా ప్రకటించిన ఉమేశ్ భర్వాడ్, పద్మేంద్ర్ సింగ్ రాజపుత్, రాజకుమార్ చౌమల్‌ - ముగ్గురికీ హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

కింది కోర్టు 2012లో ఈ ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటించిందన్న విషయం తెలిసిందే.

అయితే బాబు బజరంగీకి కింది కోర్టు విధించిన శిక్షను గత ఏప్రిల్‌లో హైకోర్టు యథాతథంగా ఉంచింది. కానీ బీజేపీ నేత, మాజీ మంత్రి మాయా కోడ్‌నానీని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Image copyright DILIP THAKAR/BBC
చిత్రం శీర్షిక నరోదా పాటియా అల్లర్ల బాధితుడు అబ్దుల్ మజీద్ షేక్

ఇవీ కేసు పూర్వాపరాలు

2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోధ్రా వద్ద సాబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేసిన ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందూ కార్‌సేవకులు.

ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో మతహింస చెలరేగగా, దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. వీటిలో నరోదా పాటియా ఉదంతం అత్యంత ఘోరమైన సంఘటన.

ఆ అల్లర్ల సమయంలో, అహ్మదాబాద్‌లోని నరోదా పాటియా ప్రాంతంలో అల్లరి మూకలు 97 మంది ముస్లింలను హత్య చేశారు. ఆ హింసాకాండలో మరో 33 మంది గాయపడ్డారు.

కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు నరోదా పాటియా ప్రాంతానికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)