ఆస్ట్రేలియా: ఇంగ్లిష్ రాకపోతే పౌరసత్వం ఇవ్వం

ఆస్ట్రేలియా: ఇంగ్లిష్ రాకపోతే పౌరసత్వం ఇవ్వం

ఆస్ట్రేలియాలో స్థిరపడటం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. వలస విధానాన్ని కఠినతరం చేసేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. పౌరసత్వం కోసం నిర్వహించే ఇంగ్లిష్ పరీక్ష మరింత కఠినంగా మారబోతోంది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. భారత్ నుంచి ఎంతో మంది ఆస్ట్రేలియాలో స్థిరపడుతున్నారు. అక్కడ చైనా తరువాత భారతీయుల సంఖ్యే ఎక్కువ. తాజా ప్రతిపాదనలను కొందరు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి ఫిల్ మెర్సర్ అందిస్తున్న కథనం.

రాన్ మాలిక్ ఆస్ట్రేలియాలో 10 ఏళ్లుగా పని చేస్తున్నారు. అక్కడ స్థిరపడాలన్న తన కల నిజం కాకపోవచ్చని ఇప్పుడు ఆయన భయపడుతున్నారు.

ప్రస్తుతం తాత్కాలిక వీసాపై.. ఆయన పని చేస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన ఇంగ్లిష్ పరీక్ష, అనైతికమన్నది ఆయన వాదన.

‘‘చాలా విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లిష్ పరీక్ష. గత కొన్నేళ్లలో నా స్నేహితుల్లో చాలా మంది కెనడాకు వెళ్లారు. ఇప్పుడు వారికి పౌరసత్వం కూడా లభించింది. ఇప్పుడు నా ముందు ఉన్న మార్గాలు కెనడా లేదా న్యూజిలాండ్ వెళ్లడం’’ అని రాన్ మాలిక్ చెప్పారు.

గతేడాది పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. మళ్లీ మరోసారి పార్లమెంటు ముందుకు ఆ బిల్లు రానుంది.

‘‘ఆస్ట్రేలియా కలిసికట్టుగా ఉండటానికి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి.. ఇంగ్లిష్ మాట్లాడటం ఎంతో ముఖ్యం’’ అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ చెప్పారు.

గత నాలుగేళ్లలో వచ్చిన ఆస్ట్రేలియాకు వలసదారుల్లో.. ప్రతి నలుగురిలో ఒకరికి ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండటం లేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అతి కొద్దిమంది మాత్రమే ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్తగా వలస వస్తున్న వాళ్లు ఇంగ్లిష్ నేర్చుకుంటున్నా, వారి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు మరింత కఠినంగా ఉంటున్నాయని విమర్శకులు అంటున్నారు.

‘‘కొన్ని వర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. కొత్త ఇంగ్లిష్ పరీక్ష గట్టెక్కడం అసాధ్యం. యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వారికి కూడా ఇది ఎంతో కష్టం’’ అని సోషల్ జస్టిస్ నెట్‌వర్క్ ప్రతినిధి జమల్ డౌడ్ అన్నారు.

అయితే వలసవచ్చేవాళ్లు ఇంగ్లిష్ నేర్చుకోవాలా? లేదా? అన్నది ప్రశ్న కాదు. వారు ఎంత బాగా మాట్లాడగలరన్నదే సమస్య.

దీనిపై పలువురు వలసదారులు స్పందిస్తూ.. ‘‘ఇతరులు అర్థం చేసుకునేలా ఇంగ్లిష్ మాట్లాడాలి. ఇక్కడ ప్రధాన భాష అదే. కచ్చితంగా దానిని మనం గౌరవించాలి’’ అని ఒకరంటే.. ‘‘భాష రాకపోతే ఉద్యోగం పొందడం చాలా కష్టం. ఇంగ్లిష్ వస్తే ఉద్యోగం పొందడం అంతే సులభం. అందువల్లే చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు’’ అని మరొకరు అన్నారు.

ఇంగ్లిష్ అవసరం ఎంతో ఉంది. సాధారణంగా ప్రజలు ఇంగ్లిష్ నేర్చుకోవాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని భావిస్తుంటారు. ఈ దిశగా స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని వారు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)