కెన్యా: ‘సమోసాల్లోకి పిల్లిమాంసం’ అమ్మిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష

  • 26 జూన్ 2018
పిల్లి Image copyright Getty Images

కెన్యా రాజధాని నైరోబీ నగరానికి పశ్చిమాన ఉన్న నకురు పట్టణ శివార్లలో పిల్లుల్ని చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్న జేమ్స్ కిమని అనే వ్యక్తికి స్థానిక కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.

నకురు పట్టణ శివార్లలో పిల్లిని చంపి, చర్మాన్ని వలుస్తుండగా స్థానికులు పట్టుకుని, చితక్కొట్టారు. పోలీసు అధికారులు వచ్చి అతడిని స్థానికుల బారి నుండి కాపాడి, అదుపులోకి తీసుకున్నారు.

తాను 2012 నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా పిల్లుల్ని చంపానని కిమని అంగీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీన్ని సమోసాల్లో పెట్టి విక్రయించే వారికి ఈ పిల్లి మాంసాన్ని తాను అమ్మానని కిమని తెలిపారు.

నకురు పట్టణంలో మాంసం కీమా లేదా కూరగాయలతో తయారు చేసిన సమోసాలు ప్రజలు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి. పట్టణంలోని చాలా దుకాణాల్లో ఈ సమోసాలు లభిస్తుంటాయి.

నేరాన్ని అంగీకరించటంతో కిమనికి కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించిందని కోర్టు హాలులో ఉన్న కెన్యా దినపత్రిక ద డైలీ నేషన్‌ ప్రతినిధి వెల్లడించారు.

కెన్యా మాంసం నియంత్రణ చట్టం ప్రకారం.. పిల్లి మాంసాన్ని మానవ ఆహారంగా పరిగణించరు.

పైగా, పిల్లి మాంసాన్ని తినటం నిషిద్ధంగా చాలామంది పరిగణిస్తారు. కానీ, మరికొన్ని దేశాల్లో మాత్రం పిల్లి మాంసాన్ని చాలా ఇష్టంగా తింటుంటారు.

పశ్చిమాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు కూడా పిల్లుల్ని తింటుంటారు.

చైనా, వియత్నాం, కొరియాల్లో పిల్లి మాంసాన్ని నేరుగా లేదా అదనపు రుచి కోసం ఇతర పదార్థాలతో కలిపి తింటుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)