అమెరికా ప్రయాణ ఆంక్షలు: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు

  • 26 జూన్ 2018
ట్రంప్ ప్రయాణ ఆంక్షలు Image copyright Reuters

పలు ముస్లిం మెజార్టీ దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రయాణ ఆంక్షలకు అనుకూలంగా ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

కింది కోర్టు గతంలో ఈ ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పగా, మంగళవారం అమెరికా అత్యున్నత న్యాయస్థానం మాత్రం కింది కోర్టు తీర్పును తిరగరాసింది. తొమ్మిది మంది న్యాయమూర్తులున్న ఈ ధర్మాసనంలో ఐదుగురు ఆంక్షలను సమర్థించగా, నలుగురు మాత్రం వ్యతిరేకించారు.

సుప్రీంకోర్టు తీర్పు.. ట్రంప్ యంత్రాంగానికి లభించిన విజయంగా చూస్తున్నారు.

ఇరాన్, లిబియా, సొమాలియా, సిరియా, యెమెన్ దేశాల నుంచి వచ్చే చాలామంది ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఈ ఆంక్షలు అడ్డుకుంటాయి.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పట్లో వలసదారుల, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.

‘‘అధ్యక్షుడి అధికార పరిధిలోని అంశం’’ ఇదంటూ ప్రధాన న్యాయ న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రయాణ ఆంక్షలపై తీర్పులో తన అభిప్రాయం రాశారు.

‘‘(ఈ నిర్ణయంపై) హేతుబద్ధమైన పునఃసమీక్ష నిలబడేందుకు కావాల్సిన జాతీయ భద్రత వివరణను ప్రభుత్వం తగినంత అందించింది’’ అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వార్తను తన ట్విటర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.

సహచర న్యాయమూర్తి జస్టిస్ రూత్ బేడర్ గిన్స్‌బర్గ్‌తో పాటు ఈ తీర్పుతో జస్టిస్ సోనియా సొటొమేయర్ విబేధించారు. మొదటి సవరణ ప్రసాదించిన మత పరమైన స్వేచ్ఛను కాపాడటంతో కోర్టు విఫలమైందని ఆమె వాదించారు.

‘‘తొలుత ‘అమెరికాలోకి ప్రవేశించే ముస్లింలపై పూర్తిస్థాయి నిషేధం’ అంటూ ఈ విధానంపై బహిరంగంగా ప్రచారం జరిగింది, దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ విధానం జాతీయ భద్రత ఆందోళనల ముసుగులో ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘(ఈ ఆంక్షలు) ముస్లిం వ్యతిరేక ద్వేషంతో ప్రేరేపించబడ్డాయని ఏ పరిశీలకుడైనా చెప్పగలరు’’ అని కూడా వివరించారు.

ట్రంప్ ప్రయాణాంక్షల్లో చాలా పొరపాట్లు దొర్లాయి. ఇరాక్, చాద్‌ దేశాలపై గతంలోనే ఆంక్షలు ఉండటంతో కొత్త ఆదేశాల నుంచి ఆయా దేశాల పేర్లను తొలగించారు.

‘‘గుర్తింపు నిర్వహణ, సమాచారాన్ని పంచుకునే సామర్థ్యాలు, విధి విధానాల్లో ఆయా దేశాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. కొన్ని కేసులకు సంబంధించి, ఈ దేశాల్లో తీవ్రవాద ప్రాబల్యం కూడా చాలా ఉంది’’ అని ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల గురించి ప్రభుత్వం తెలిపింది.

హవాయి ఈ ప్రయాణ ఆంక్షలను సవాలు చేయగా, గతంలో కింది కోర్టు ఈ ఆంక్షల అమలును నిలుపుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు