స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు

  • 27 జూన్ 2018
చైనా రుణ వత్తిడిలో దేశాలు Image copyright Getty Images

చైనా ప్రభుత్వ బ్యాంకు తమ దేశ ప్రజలకు ఇచ్చే రుణాలకంటే ఎక్కువ అప్పులు వేరే దేశాలకు ఇస్తోంది. చైనా బ్యాంకుల ఈ చర్యలు అక్కడి ప్రభుత్వ వ్యూహాల్లో భాగమనే చెబుతున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రాజెక్ట్ ద్వారా చాలా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఈ ఒప్పందాలను ఏకపక్షంగా చేసుకున్నట్టు చెబుతున్నారు.

చైనా ప్రపంచంలోని చాలా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతోంది. వాటిలో భారీగా పెట్టుబడులు పెట్టింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం 2016లో మొదటిసారి చైనాలోని నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో మూడు బ్యాంకులు దేశంలో ఇచ్చిన కార్పొరేట్ రుణాల కంటే ఎక్కువగా బయటి దేశాలకు అప్పులిచ్చాయి.

ప్రపంచంలో ఎక్కడైతే ఒకవైపు లాభాలు ఆర్జించవచ్చో, ఆయా దేశాల్లో వ్యాపారం చేయడానికి చైనా తన కంపెనీలను ముందుకు నడిపిస్తోందని ఆ రిపోర్టులో తెలిపారు. చైనా తమ ప్రభావాన్ని పెంచుకోడానికి రుణ వ్యూహాలను వేగంగా అమలు చేస్తోందని అందులో చెప్పారు.

Image copyright Getty Images

పెరుగుతున్న చైనా రుణ పరిధి

దక్షిణ ఆసియాలోని మూడు దేశాలు-పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులకు చైనా భారీగా రుణాలిచ్చింది. గత ఏడాది ఒక బిలియన్ డాలర్లకు పైగా రుణం తీసుకున్నందుకు శ్రీలంక, తమ హంబన్‌టోటా రేవును చైనాకు అప్పగించాల్సి వచ్చింది.

దీనితో పాటు పాకిస్తాన్ కూడా చైనా నుంచి తీసుకున్న రుణాల్లో కూరుకుపోయుంది. మరోసారి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం చైనాను శరణు వేడే అవకాశం ఉంది.

మాల్దీవుల్లో కూడా చైనా చాలా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. మాల్దీవుల్లో భారత్ ఏ ప్రాజెక్టులను చేపట్టిందో, వాటిని కూడా చైనాకు అప్పగించేశారు.

Image copyright Getty Images

మాల్దీవుల్లో భారత సంస్థ జీఎంఆర్ 511 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించాలనుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒప్పందం కూడా రద్దైంది.

ఒక రిపోర్టు ప్రకారం చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ తరఫున ఇచ్చిన విదేశీ రుణాల్లో 31 శాతం వృద్ధి ఉంది. దీనితో పోలిస్తే దేశంలో ఆ వృద్ధి రేటు 1-5 శాతం మాత్రమే ఉంది.

2016తో పోలిస్తే 2017లో బ్యాంక్ ఆఫ్ చైనా తరఫున బయటి దేశాలకు రుణాలు ఇచ్చిన రేటు 10.6 శాతం పెరిగింది. 2013లో చైనా పగ్గాలు షీ జిన్‌పింగ్ చేతికి వచ్చిన తర్వాత నుంచీ, ఆయన ప్రతిష్టాత్మక పథకం వన్ బెల్డ్, వన్ రోడ్ ప్రాజెక్ట్ మరింత వేగం అందుకుంది.

Image copyright Getty Images

వన్ బెల్ట్, వన్ రోడ్

ఈ ప్రాజెక్టును 300 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీనితో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. దీని ద్వారా మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యంలో చైనా తన ఒత్తిడి పెంచాలనుకుంటోంది.

ఈ ప్రాజెక్టులో ఎన్నో దేశాలున్నాయి. కానీ దీనికి నిధులు ఎక్కువగా చైనా మద్దతు ఉన్న అభివృద్ధి బ్యాంకులు, ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకుల నుంచే వస్తున్నాయి.

చైనా ఆసియా దేశాల్లోనే కాదు, ఆఫ్రికా దేశాల్లో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. వాటిలో ఒక దేశం జిబుతి. ఈ దేశంలో అమెరికా సైనిక స్థావరం ఉంది. చైనాలోని ఒక కంపెనీ కోసం జిబూతి ఒక కీలక రేవును ఇచ్చింది. దీనిపై అమెరికా అసంతృప్తితో ఉంది.

గత ఏడాది మార్చి 6న అమెరికా తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ "చైనా చాలా దేశాలను తమపై ఆధారపడేలా ప్రోత్సహిస్తోంది. అది సొంతం చేసుకుంటున్న కాంట్రాక్టుల్లో పూర్తిగా పారదర్శకత లేదు. నియమాలు, షరతుల్లో స్పష్టత లేదు. లెక్కలేనన్ని రుణాలు ఇస్తోంది. అలా చేయడం అనర్థాలకు దారితీస్తుంది. చైనాకు మౌలిక సదుపాయాల అభివృద్ధి సామర్థ్యం ఉంది. కానీ అది ఆ పేరుతో రుణభారం మరింత పెరిగేలా చేస్తోంది." అన్నారు.

Image copyright Getty Images

ద సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రకారం వన్ బెల్ట్, వన్ రోడ్‌ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న 8 దేశాలు చైనా రుణభారం మోయలేకపోతున్నాయి. ఆ దేశాలే- జిబుతి, కిర్గిస్తాన్, లావోస్, మాల్దీవులు, మంగోలియా, మోంటేనేగ్రో, పాకిస్తాన్, తజకిస్తాన్.

రుణాల వల్ల తమ పురోగతి ఏ స్థాయిలో ప్రభావితం అవుతుందో ఆ దేశాలకు కనీసం అనుమానం కూడా రావడం లేదని పరిశోధకులు అంటున్నారు. రుణాలు చెల్లించలేని స్థితికి చేరినపుడు అప్పులు ఇచ్చిన దేశాలకు మొత్తం ప్రాజెక్టు అప్పగించాల్సి వస్తుందని చెబుతున్నారు.

చైనా రుణ భయం

నేపాల్ కూడా చైనా సాయం కోరుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ శ్రీలంక, పాకిస్తాన్ లాగే రుణాల్లో కూరుకుపోతామని భయపడుతోందని అంటున్నారు.

చైనా-లావోస్ రైల్వే ప్రాజెక్టును వన్ బెల్ట్, వన్ రోడ్ ద్వారా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం 6 బిలియన్ డాలర్లు. అంటే అది లావోస్ జీడీపీలో సగం.

పాకిస్తాన్ గ్వాదర్ రేవు కూడా అదే దారిలో ఉందని చాలా మంది చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని వివిధ ప్రాజెక్టులకు చైనా 55 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.

Image copyright Getty Images

ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు కాంట్రాక్టులను పాకిస్తాన్ బయట పెట్టలేదని అంటున్నారు. ఈ నిధుల్లో ఎక్కువ భాగం రుణాల ద్వారా వచ్చిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లోని గ్వాదర్, చైనా ఒప్పందాలను బట్టి పాకిస్తాన్.. చైనాకు ఆర్థిక కాలనీగా మారుతోంది అని చెప్పవచ్చని అంటున్నారు.

గ్వాదర్లో నిధుల పెట్టుబడి భాగస్వామ్యం, రేవుపై నియంత్రణకు 40 ఏళ్లకు ఒప్పందం జరిగింది. దీనిలో ఆదాయంపై చైనాకు 91 శాతం హక్కు ఉంటుంది. గ్వాదర్ అథారిటీ పోర్టుకు కేవలం 9 శాతం లభిస్తుంది.

పరోక్షంగా గ్వాదర్ రేవుపై 40 ఏళ్ల వరకూ పాకిస్తాన్ నియంత్రణ ఉండదనే విషయం ఈ ఒప్పందంతో స్పష్టమైంది.

Image copyright Getty Images

పాకిస్తాన్

ద సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం చైనా రుణాల వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న దేశం పాకిస్తాన్. పాకిస్తాన్‌లో ప్రస్తుతం చైనా 62 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో 80 శాతం నిధులు చైనా నుంచే అందాయి.

చైనా పాకిస్తాన్‌కు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌పై చైనా రుణ ఒత్తిడి మరింత పెరుగుతుందనే భయాలకు బలం చేకూరుతోంది.

జిబుతి

జిబుతి తీసుకుంటున్న రుణాలు ఆ దేశానికే ప్రమాదంగా మారుతాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి చెబుతోంది. కేవలం రెండేళ్లలోనే దేశ ప్రజలపై బయటి అప్పుల భారం పడింది. వారి జీడీపీని 50 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది.

దాంతో ప్రపంచంలో తక్కువ ఆధాయం వచ్చే దేశాల్లో జిబుతి మొదటి దేశంగా నిలిచింది. వీటిలో ఎక్కువ రుణాలు చైనాలోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచే ఉన్నాయి.

Image copyright Getty Images

మాల్దీవులు

మాల్దీవుల్లోని పెద్ద ప్రాజెక్టులన్నింటిలో చైనా ప్రమేయం విస్తృతంగా ఉంది. మాల్దీవుల్లో 830 కోట్ల డాలర్ల వ్యయంతో చైనా ఒక విమానాశ్రయం నిర్మిస్తోంది. విమానాశ్రయానికి దగ్గరే ఒక వంతెన కడుతోంది. దీని వ్యయం 400 కోట్ల డాలర్లు.

చైనా రుణాల్లో మాల్దీవులు పీకల్లోతు మునిగిపోయినట్టు కనిపిస్తోందని ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ చెబుతున్నాయి. ఆ దేశ రాజకీయాల్లో అస్థిరత ఉంది. ప్రస్తుతం మాల్దీవుల్లో అధికారం ఎవరి చేతుల్లో ఉందో వారు చైనా విశ్వాసపాత్రులుగా ఉన్నారు.

లావోస్

ఆగ్నేయాసియాలో ఉన్న పేద దేశాల్లో లావోస్ ఒకటి. లావోస్‌లో చైనా వన్ బెల్ట్, వన్ రోడ్ ద్వారా రైల్వే ప్రాజెక్టుపై పనిచేస్తోంది. దీని వ్యయం 6.7 బిలియన్ డాలర్లు. ఇది లావోస్ జీడీపీలో సగం.

అదే మార్గంలో వెళ్తే అంతర్జాతీయ రుణాలు పొందే అర్హతను కోల్పోతుందని ఐఎంఎఫ్ లావోస్‌ను హెచ్చరించింది.

మంగోలియా

మంగోలియా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది, ఆ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారీ పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. చైనాలోని ఎగ్జిమ్ బ్యాంక్ 2017 ప్రారంభంలో ఈ దేశానికి ఒక బిలియన్ అమెరికా డాలర్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

చైనా ఈ దేశంలోని హైడ్రోపవర్, హైవే ప్రాజెక్టులో భాగస్వామిగా మారింది. వన్ బెల్ట్, వన్ రోడ్ ద్వారా చైనా రాబోవు ఐదేళ్లలో మంగోలియాలో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని కూడా తెలుస్తోంది. అదే జరిగితే, ఆ రుణం నుంచి బయటపడడం మంగోలియాకు అంత సులభంగా ఉండదు.

Image copyright Getty Images

మోంటేనేగ్రో

ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2018లో ఈ దేశ ప్రజలపై అప్పుల భారం పడడం వల్ల వారి జీడీపీ 83 శాతానికి చేరుకుంది. మోంటేనేగ్రోకు కూడా ఆ దేశంలోని పెద్ద ప్రాజెక్టులే సమస్యగా మారాయి. ఈ ప్రాజెక్టుల్లో పోర్టు అభివృద్ధి, ట్రాన్స్‌పోర్ట్ నెట్ వర్క్ పెంచడం ఉన్నాయి.

ఈ ప్రాజెక్టుల కోసం 2014లో చైనాలోని ఎగ్జిమ్ బ్యాంక్‌తో ఒక ఒప్పందం జరిగింది. ఇందులో మొదటి దశ వ్యయం ఒక బిలియన్ డాలర్ల నిధుల్లో 85 శాతం మొత్తం చైనా ఇస్తుంది.

తజకిస్తాన్

తజకిస్తాన్‌ను ఆసియాలోని అత్యంత పేద దేశంగా భావిస్తారు. రుణ ఒత్తిడికి అణిగిపోతోందని ఆ దేశాన్ని ఐఎంఎఫ్ హెచ్చరించింది.

తజకిస్తాన్‌పై అత్యధిక రుణభారం చైనా నుంచే ఉంది. 2007 నుంచి 2016 మధ్య తజకిస్తాన్‌కు అందిన మొత్తం విదేశీ రుణాల్లో చైనా రుణాల వాటా 80 శాతం ఉంది.

కిర్గిస్తాన్

కిర్గిస్తాన్ కూడా చైనా వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టులో ఉంది. కిర్గిస్తాన్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనా ఏకపక్ష పెట్టుబడులు ఉన్నాయి. 2016లో చైనా 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. కిర్గిస్తాన్ మొత్తం విదేశీ రుణాల్లో చైనా ఇచ్చిన అప్పులు 40 శాతం ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)