భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘

 • పృథ్వీరాజ్
 • బీబీసీ ప్రతినిధి
అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ర్యాలీలో పాల్గొన్న భారత మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో మహిళలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని తమ తాజా సర్వేలో వెల్లడైనట్లు థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ ప్రకటించింది.

రాయిటర్స్ తాజాగా విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం.. అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్న అఫ్గానిస్తాన్, సిరియాలు.. ఇండియా తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

భారత్ పొరుగు దేశం పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉండగా.. అగ్ర రాజ్యంగా పరిగణించే అమెరికా పదో స్థానంలో ఉంది. అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో అమెరికా ఒక్కటే ‘మహిళలకు ప్రమాదకరమైన టాప్‌ టెన్’ దేశాల జాబితాలో చేరటం గమనార్హం.

ఏడేళ్ల కిందట 2011లో నిర్వహించిన ఇదే సర్వేలో భారతదేశం నాలుగో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ప్రధమ స్థానంలోకి వచ్చిందని సర్వే సంస్థ వెల్లడించింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలివి

‘అత్యాచార మహమ్మారి ఏటా పెరుగుతోంది...‘

‘‘దిల్లీలో 2012 లో ఒక బస్సులో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన అనంతరం.. ఇండియాలో మహిళలపై హింస పట్ల జాతీయంగా అంతర్జాతీయంగా ఆగ్రహం, నిరసనలు పెల్లుబికాయి’’ అని రాయిటర్స్ ఫౌండేషన్ నాటి ఘటనను ఈ సర్వే ఫలితాల్లో ప్రస్తావించింది.

థామ్సన్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన స్వచ్ఛంద సంస్థ థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్. 2011 నాటి సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ఐదు దేశాలను ఈ సంస్థ ప్రకటించింది.

అందులో అఫ్ఘానిస్తాన్, కాంగో, పాకిస్తాన్‌లు మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలోను, సోమాలియా ఐదో స్థానంలోను ఉన్నాయి.

ఈసారి ‘మహిళలకు ప్రమాదకరమైన దేశాల’ సర్వేను పది స్థానాలకు పెంచారు.

2018 సర్వేలో భారత్ మొదటి స్థానంలోకి రాగా అఫ్గాన్ రెండో స్థానంలో నిలిచింది. సోమాలియా నాలుగో స్థానంలోకి వస్తే.. కాంగో ఏడో స్థానానికి, పాకిస్తాన్ ఆరో స్థానానికి మెరుగయ్యాయి. టాప్-5 దేశాల్లోకి సిరియా (మూడో స్థానం), సౌదీ అరేబియా (ఐదో స్థానం) వచ్చి చేరాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. భారతదేశంలో 2007-2016 మధ్య మహిళలపై నేరాల సంఖ్య (నమోదైనవి) 83 శాతం పెరిగాయని సర్వే సంస్థ విశ్లేషించింది.

‘‘భారతదేశంలో అత్యాచారాల మహమ్మారి ఏటా పెరుగుతోంటే.. మహిళలకు భద్రత కల్పించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టటం లేదని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు’’ అని సర్వే సంస్థ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, poll2018.trust.org

సర్వే ప్రాతిపదిక ఏమిటి?

మహిళలకు సంబంధించి మొత్తం ఆరు అంశాల ప్రాతిపదికగా ఈ సర్వేను నిర్వహించినట్లు సర్వే సంస్థ వివరించింది. ఈ ఆరు అంశాల్లో ఏ దేశాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయో ర్యాంకులు ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న వారిని కోరింది.

మహిళా అంశాల మీద ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్న నిపుణులను సంప్రదించి ఈ సర్వే నిర్వహించినట్లు రాయిటర్స్ ఫౌండేషన్ తెలిపింది.

‘‘మహిళల సమస్యలు, అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న సహాయ, అభివృద్ధి నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య కార్యకర్తలు, విధాన రూపకర్తలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, పాత్రికేయులు, సామాజిక వ్యాఖ్యాతలు 548 మందిని మేం సంప్రదించాం’’ అని వివరించింది.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలైన 193 దేశాల్లో.. ఈ ఆరు అంశాల్లో ఒక్కో అంశం వారీగా అత్యంత దారుణ పరిస్థితులు ఉన్న దేశం ఏదో గుర్తించాలని ఆ నిపుణుల కోరారు. ఆన్‌లైన్ ద్వారా, టెలిఫోన్‌లోనూ, ప్రత్యక్షంగానూ వారి అభిప్రాయాలను సేకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆ ఆరు అంశాలివీ..

లైంగిక హింస: యుద్ధం ఆయుధంగా అత్యాచారాన్ని ప్రయోగించటం, ఇంట్లో అత్యాచారం, అపరిచితుల అత్యాచారం, అత్యాచారం కేసుల్లో న్యాయం అందుబాటులో లేకపోవటం, లైంగిక వేధింపులు, అవినీతిలో భాగంగా సెక్స్ కోసం బలవంతం చేయటం

సంస్కృతీ సంప్రదాయాలు: యాసిడ్ దాడులు, స్త్రీ జననాంగచ్ఛేదనం, బాలికా వివాహం, బలవంతపు పెళ్లి, రాళ్లతో కొట్టడం, భౌతిక దాడుల ద్వారా శిక్ష, బాలికాశిశు హత్య, బాలికా భ్రూణ హత్య

మహిళల అక్రమ రవాణా: గృహ బానిసత్వం, బలవంతపు చాకిరీ, బలవంతపు పెళ్లి, లైంగిక బానిసత్వం

లైంగికేతర హింస: సంఘర్షణ సంబంధిత హింస, గృహ హింస, భౌతిక, మానసిక హింస

వివక్ష: ఉద్యోగంలో వివక్ష, జీవనోపాధి సంపాదించుకోలేకపోవటం, భూమి, ఆస్తి లేదా వారసత్వ హక్కుల్లో వివక్ష, విద్య అందకపోవటం, అవసరమైనంత పోషకాహారం అందకపోవటం

ఆరోగ్య పరిరక్షణ: ప్రసవ మరణాలు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవటం, పునరుత్పత్తి ఆరోగ్యంపై నియంత్రణ లేకపోవటం, హెచ్ఐవీ/ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇండియాకి ఏ అంశంలో ఏ స్థానం?

లైంగిక హింస, సంస్కృతీ సంప్రదాయాలు, మహిళల అక్రమ రవాణా.. ఈ మూడు అంశాల్లో భారతదేశం ప్రధమ స్థానంలో నిలిచింది. అంటే ఈ రంగాల్లో భారత్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సర్వే చెప్తోంది.

ఇక లైంగికేతర హింస, వివక్ష అంశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉండగా.. ఆరోగ్య పరిరక్షణలో నాలుగో స్థానంలో ఉంది.

మహిళలకు ప్రమాదకరమైన టాప్ టెన్ దేశాలివీ..

 • ఇండియా
 • అఫ్ఘానిస్తాన్
 • సిరియా
 • సోమాలియా
 • సౌదీ అరేబియా
 • పాకిస్తాన్
 • కాంగో
 • యెమెన్
 • నైజీరియా
 • అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు...

‘‘మహిళలు, బాలికలపై అన్ని రూపాల్లోని హింస, వివక్షలను 2030 నాటికి సమూలంగా నిర్మూలిస్తామని మూడేళ్ల కిందట ప్రపంచ దేశాల అధినేతలు ప్రతిన బూనారు. తద్వారా మహిళలు, బాలికలు స్వేచ్ఛగా సురక్షితంగా జీవించేందుకు.. రాజకీయ ఆర్థిక, ప్రజా జీవితంలో సమానంగా పాలుపంచుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు’’ అని ఈ సర్వే గుర్తు చేసింది.

కానీ.. ప్రపంచంలోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. తమ జీవిత కాలంలో భౌతికమైన లేదా లైంగికమైన హింసకు గురవుతూనే ఉన్నారు. బాలికల వివాహ సమస్య ఇంకా తీవ్రంగానే ఉంది. ఏడున్నర కోట్ల మంది మహిళలు, బాలికలకు.. వారి 18వ పుట్టినరోజు కన్నా ముందుగానే పెళ్లిచేశారు. దీనివల్ల టీనేజీలో గర్భధారణలు అధికంగా ఉన్నాయి. అది వారిని విద్యకు, అవకాశాలకు దూరం చేయటమే కాదు.. వారి ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతోంది’’ అని ఆ సర్వే పేర్కొంది.

వీడియో క్యాప్షన్,

వీడియో: భారత్‌లో ఎవరు ఎక్కువ సురక్షితం? గోవులా లేక మహిళలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)