అమెరికా: ఆ పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చండి.. కోర్టు ఆదేశం

  • 27 జూన్ 2018
అమెరికా, మెక్సికో సరిహద్దు వద్ద తన తల్లితో కలసి వేచి చూస్తున్న ఒక చిన్నారి Image copyright Getty Images

డోనాల్డ్ ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై అమెరికా కోర్టు స్పందించింది. విడదీసిన పిల్లలను వారి తల్లిదండ్రులతో 30 రోజుల్లోగా కలపాలని శాన్‌డియాగో ఫెడరల్ జడ్జీ డానా సబ్రా ఆదేశిస్తూ ప్రాథమిక ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఆరేళ్ల తన బిడ్డకు దూరమైన ఓ తల్లి తరపున అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌యూ) దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఈ విధంగా స్పందించింది.

మరోవైపు పిల్లలను, తల్లిదండ్రులతో విడదీయడాన్ని అమెరికాలోని 17 రాష్ట్రాలు, ఒక జిల్లా వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అవి తాజాగా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేశాయి.

వాషింగ్టన్, న్యూయార్క్, మసాచూసెట్స్, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మిన్నెసొటా, న్యూ జెర్సీ, వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాలు.. కొలంబియా జిల్లా ఈ జాబితాలో ఉన్నాయి.

అక్రమంగా వలస వచ్చే వారి పిల్లలను, తల్లిదండ్రులతో విడదీయడాన్ని నిలిపివేస్తూ జూన్ 20న ట్రంప్ తీసుకున్న నిర్ణయం బూటకమని అవి ఆరోపించాయి. తల్లిదండ్రులు, పిల్లల విడదీతను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ఆదేశంలో ఎక్కడా లేదని, ఇప్పటికే విడదీసిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాజ్యంలో రాష్ట్రాలు ప్రస్తావించాయి.

పిల్లలను తల్లిదండ్రులతో కలిపేలా వెంటనే ఆదేశించడంతోపాటు, వారిని విడతీయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని న్యాయస్థానాలను రాష్ట్రాలు కోరాయి.

మెక్సికో నుంచి వస్తున్న శరణార్థులను అమెరికాలోకి అనుమతించక పోవడాన్ని, ఆ రాష్ట్రాలు సవాలు చేస్తున్నాయి. వలసదారుల్లో పిల్లలు, తల్లిదండ్రులను వేరు చేయడాన్ని అత్యంత క్రూరమైన చర్యగా అవి అభివర్ణిస్తున్నాయి.

Image copyright Getty Images

'పిల్లల్లో మానసికక్షోభ'

న్యూయార్క్ క్యాంపులో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వలసదారుల పిల్లలు మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నారని న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బరా అండర్‌వుడ్ అన్నారు. కుంగుబాటుతోపాటు వారిలో ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతున్నట్లు తెలిపారు. ట్రంప్ విధానం వల్ల పిల్లల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు 2,047 మంది పిల్లలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నట్లు అమెరికా ఆరోగ్యశాఖకు చెందిన శరణార్థుల పునరావాస విభాగం మంగళవారం ప్రసార మాధ్యమాలకు వెల్లడించింది. వీరంతా అమెరికా వ్యాప్తంగా వివిధ శిబిరాల్లో ఉన్నారు.

Image copyright Getty Images

'ఎంత ఖర్చు చేశారు?'

వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి విడదీసి శిబిరాలలో ఉంచినందుకు ఎంత ఖర్చుచేస్తున్నారో వెల్లడించాల్సిందిగా కొందరు ప్రజాప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. ఈమేరకు రాసిన ఉత్తరంపై 100 మంది ప్రజాప్రతినిధులు సంతకం చేశారు. వివరాలను వెల్లడించడానికి తుదిగడువును జులై 10గా పేర్కొన్నారు.

అయితే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వలసదారులను మరోసారి హెచ్చరించారు. అక్రమంగా ప్రవేశిస్తే సహించేది లేదని లేకుంటే మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ సోమవారం ఒక పత్రికా సమావేశంలో పెన్స్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)