పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..

ఒరాంగుటాన్లు

ఫొటో సోర్స్, Getty Images

అందమైన మీ పెదవులకు రాసుకునే లిప్‌స్టిక్, ఒక జీవి అంతరించిపోవడానికి కారణంగా మారుతుందా?

మీరు లొట్టలేసుకుంటూ తినే పిజ్జా ఒక పులి జీవితాన్ని నాశనం చేస్తుందా?

చేతిలోని పిజ్జాకి, అడవిలోని పులికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోకండి. లిప్‌స్టిక్‌లు, పిజ్జాలు, బిస్కెట్లు ఇలా అనేక ఉత్పత్తుల తయారీలో పామాయిల్‌ ఉపయోగిస్తారు. పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా పామాయిల్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇందుకోసం అడవులను విచక్షణా రహితంగా నరుకుతున్నారు. దీంతో వన్యప్రాణుల మనుగడతోపాటు పర్యావరణం ప్రమాదంలో పడుతోందని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) పరిశోధన హెచ్చరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ పంట వల్ల 0.4శాతం అడవులు తరుక్కుపోయాయి. ఇండోనేషియా, మలేసియాలలో కొన్నిచోట్ల 50శాతం అడవులు పామాయిల్ పంటలుగా మారి పోయాయి.

ప్రపంచవ్యాప్తంగా లభించే ఉత్పత్తుల్లో దాదాపు 50శాతం పామాయిల్‌తోనే తయారవుతున్నాయి. ఇండోనేషియా, మలేసియాలో అత్యధికంగా కంపెనీలు ఏడాదికి లక్షల టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ దేశాల్లో పామాయిల్ పరిశ్రమ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు.

పామాయిల్‌కు పెరుగుతున్న గిరాకీ వల్ల గత 20 ఏళ్లలో వేల ఎకరాల అడవులను నరికివేశారు.

ఫొటో సోర్స్, Getty Images

లిప్‌స్టిక్‌కు ఒరాంగుటాన్‌కు సంబంధం?

రంగులను బాగా పట్టి ఉంచేందుకు లిప్‌స్టిక్‌ల తయారీలో పామాయిల్‌ను ఉపయోగిస్తారు. ఇండోనేషియాలో పామాయిల్ సాగు ఎక్కువగా ఉంటుంది. ఒరాంగుటాన్లు అధికంగా ఉండే ఇక్కడ అటవీ విస్తీర్ణం తగ్గుతుండటంతో అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది.

"పామాయిల్ సాగుతో ఒరాంగుటాన్లు మైదాన ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. దీనితో మనుషులతో వీటికి సంఘర్షణ ఏర్పడుతోంది. మనుషులు వీటిని చంపేస్తున్నారు. ఒరాంగుటాన్ల పునరుత్పత్తి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల ఒక్క ఒరాంగుటాన్‌ను చంపినా అది తీవ్ర ప్రభావం చూపుతుంది." అని ఐయూసీఎన్‌కు చెందిన ఎరిక్ మెజార్ద్ బీబీసీకి చెప్పారు.

ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

అడవులను రక్షించేందుకు ఇండోనేషియా, మలేసియా ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎరిక్ చెబుతున్నారు. అయితే ఈ చర్యలు పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, cco

ప్రజల్లో మార్పు వచ్చిందా?

ప్రజలు మాత్రం పామాయిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం లేదు. వేరే ప్రత్యామ్నాయాల వైపు చూడటం లేదని ఎరిక్ చెబుతున్నారు.

సంస్థల సంగతి?

పర్యావరణానికి హాని కలగకుండా పామాయిల్ పంటను సాగు చేయడంపై కొన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పామాయిల్ రైతులు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులు సభ్యులుగా ఉండే రౌండ్ టేబుల్ ఆన్ సస్టెయినబుల్ పామాయిల్ (ఆర్ఎస్‌పీఓ) ఈ దిశగా కృషి చేస్తోంది. అయితే తాము ఎంత కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించినంతగా సహకారం లభించడం లేదని ఆర్‌ఎస్‌పీఓ చెబుతోంది.

కానీ పామాయిల్ సాగును పర్యవేక్షించడం, తనిఖీలు చేయడం, నివేదికలు ఇవ్వడంలో ఆర్ఎస్‌పీఓ విఫలమవుతున్నట్లు నివేదిక తెలిపింది.

పామాయిల్ తయారీ సంస్థలు అడవులను నరకకుండా చూడాల్సిన బాధ్యత ఆర్‌ఎస్‌పీఓదేనని కానీ ఆ విషయంలో అది విఫలమవుతోందని గ్రీన్‌పీస్ (బ్రిటన్)కు చెందిన రిచర్డ్ జార్జ్ ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Hutan/kocp

ఫొటో క్యాప్షన్,

పామాయిల్ సాగు భూమి

పామాయిల్ సాగు నిలిపివేస్తే?

అడవులను రక్షించేందుకు పామాయిల్ సాగును నిషేధించడం పరిష్కారం కాదని ఎరిక్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల్లో పామాయిల్ వాటా 35శాతం. కానీ సాగు భూమి విస్తీర్ణం 10శాతం మాత్రమే. పామాయిల్‌కు బదులుగా సోయా, పొద్దుతిరుగుడు వంటి వాటిని సాగు చేయొచ్చు. కానీ ఈ పంటలకు తొమ్మిదిరెట్లు అధిక భూమి కావాలి. ఇలా చూసినా పర్యావరణానికి జరిగేది నష్టమే. ఎందుకంటే వంటనూనెకు గిరాకీ అయితే తగ్గదు కదా.

"ఒకచోట నిషేధిస్తే మరోచోట పామాయిల్ సాగు చేస్తారు. ఇండోనేషియాలో ఒరాంగుటాన్లు ప్రమాదంలో పడితే, మరోచోట పులులు, ఎలుగుబంట్ల మనుగడకు ముప్పు వస్తుంది" అని ఎరిక్ చెప్పారు.

కాబట్టి ఇప్పుడు కావాల్సింది కర్ర విరగకుండా పాము చావకుండా ఉండే పరిష్కారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)