భారత్, అమెరికాలది ప్రేమా? ద్వేషమా?

  • 28 జూన్ 2018
మోదీ, ట్రంప్ Image copyright EPA/Getty Images

అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిచర్యగా పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచేశాయి.

అయితే, ఆ దేశాల నుంచి హెచ్చరికలు, ఎదురుదాడులు పెరుగుతున్నా.. ట్రంప్ మాత్రం తన నిర్ణయంపై గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు.

"మేము ఒక బ్యాంకు, అందరూ మమ్మల్ని దోచుకోవాలని, కొల్లగొట్టేయాలని అనుకుంటారు" అని సోమవారం నాడు వైట్‌ హౌజ్ వద్ద మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ 'వాణిజ్య యుద్ధం' మొదలుపెట్టిన తర్వాత యూరప్, చైనాతో పాటు పలు దక్షిణ అమెరికా దేశాలు ఆయన్ను ఏకాకిని చేశాయి.

అయితే, భారత్‌ విషయంలో మాత్రం ట్రంప్ చర్యలు, వ్యవహార శైలి అనేక సందేహాలను కలిగిస్తున్నాయి.

Image copyright EPA

భారత్, అమెరికాల మధ్య చారిత్రాత్మకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం.. ఆర్థిక వ్యవహారాల విషయంలో ట్రంప్ భారత్‌ను ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా ఏమీ కనిపించడంలేదు.

అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచడాన్ని ట్రంప్ సమర్థించుకుంటూ.. తమ ఉత్పత్తులపై భారత్ 100 శాతం వరకూ దిగుమతి సుంకాలు విధిస్తోందని చెప్పారు.

వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రికత్తలను తగ్గించే ఉద్దేశంతో అమెరికా వాణిజ్య వ్యవహారాల సహాయ ప్రతినిధి మార్క్ లిన్స్‌కాట్ రెండు రోజుల భారత పర్యటన ప్రారంభమైన తర్వత ట్రంప్‌పై కామెంట్ చేశారు.

అయితే, అప్పటికే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ సుంకాలు పెంచినందుకు భారత్ కూడా ఎదురుదాడి చేసింది.

అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పిస్తా, బాదం, యాపిల్స్‌ సహా, మొత్తం 29 ఉత్పత్తులపై సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా సుంకాల ప్రభావం జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాలపై పడే అవకాశం ఉంది.

నిజానికి.. ఇతర దేశాలతో పోల్చితే భారత్ నుంచి అల్యూమినియం, ఉక్కు అమెరికాకు ఎగుమతి అయ్యేది తక్కువే.

కానీ, యూరప్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా స్టీల్ లాంటి సంస్థలపై అమెరికా సుంకాల ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది.

టాటా వాహనాల వ్యాపారంపై కూడా దెబ్బపడే అవకాశం ఉంది.

యూరోపియన్ యూనియన్‌లో అసెంబ్లింగ్ చేసిన కార్ల దిగుమతిపై 20శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కరోజులోనే కార్ల షేర్లు 3.9 శాతం పతనమయ్యాయి.

టాటాకు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) సంస్థ కార్లను యూకేలో తయారు చేసి, అమెరికాకు ఎగుమతి చేస్తుంది.

బ్రిటన్‌లోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఇది. టాటాకు అత్యధికంగా ఆదాయం తెచ్చిపెడుతున్న వ్యాపారం కూడా ఈ సంస్థదే.

ట్రంప్ తాజా పన్నుల ప్రభావం ఈ సంస్థపై భారీగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే, రెండు దేశాల మధ్య సమస్య సుంకాలు మాత్రమే కాదు.

మార్చిలో.. భారతీయ ఎగుమతిదారులకు కల్పిస్తున్న పన్ను, సుంకాల రాయితీల విషయాన్ని అమెరికా లేవనెత్తింది.

దాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద కూడా సవాల్ చేసింది. తక్కువ ధరకు ఉత్పత్తులను అమ్ముకునేలా భారతీయ ఎగుమతిదారులకు అవకాశం కల్పిస్తూ.. అమెరికా కంపెనీలను దెబ్బకొడుతున్నారని ఆరోపించింది.

అమెరికాలో భారతీయ వృత్తి నిపుణులు అధికంగా దరఖాస్తు చేసుకునే హెచ్‌1బీ వీసాల విషయంలోనూ ట్రంప్ మెలికలు పెడుతున్నారు.

ఈ వాణిజ్య యుద్ధం భారత్‌పై అనేక రకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

2017లో 126 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికాకు అతిపెద్ద ఏకైక వ్యాపార భాగస్వామిగా నిలిచింది భారత్.

ఇకపోతే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. దాంతో దేశ ఆర్థికాభివృద్ధి రేటు బలంగా ఉండటం చాలా అవసరం.

గడచిన త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధి సాధించింది. దాంతో ఆర్థిక వృద్ధిలో చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలిచిందని జీడీపీ లెక్కలు చెబుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి నిక్కీ హేలీ

అయితే.. సైనిక, ఉగ్రవాద నిరోధక లక్ష్యాల కోసం కలిసి పని చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ ఎలా మాట్లాడారన్నది మరో ఊహకందని విషయం విషయం.

అమెరికా తన అతిపెద్ద సైనిక స్థావరం పేరులో భారత్‌ను చేర్చింది.

యూఎస్ మిలిటరీ ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న 'పసిఫిక్ కమాండ్' పేరును 'యుఎస్‌ ఇండో పసిఫిక్‌ కమాండ్‌'గా మార్చింది.

అది అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం.

బుధవారం ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ భారత పర్యటన సందర్భంగా కూడా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య మైత్రి మరింత స్పష్టమైంది.

"భారత్, అమెరికా దగ్గరవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్ పట్ల మా ప్రేమాభిమానాన్ని పదిలపరచుకొనేందుకు, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలన్న కుతూహలాన్ని తెలియజేసేందుకు నేను ఇక్కడికి వచ్చాను." అని నిక్కీ హేలీ అన్నారు.

ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్యం కలిగిన దేశాలు భారత్, అమెరికాలని ఆమె చెప్పారు.

ఈ విషయంలో ఇటీవల ట్రంప్ కూడా భారత్ ప్రస్తావ తెచ్చారు.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశానికి నిధులు ఆపేయాలని, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నవంబర్ లోగా పూర్తిగా నిలుపుదల చేయాలని అమెరికా మిత్రదేశాలను, ప్రత్యేకించి భారత్, చైనాలను ట్రంప్ కోరారు.

ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశాలు భారత్, చైనా.

వచ్చేవారం భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖల మంత్రులు అమెరికాలోని ఆయా శాఖల మంత్రులతో సమావేశం అయ్యేందుకు వెళ్లాల్సి ఉంది.

వ్యూహాత్మక, భద్రత, రక్షణ కార్యక్రమాల్లో ఇరుదేశాల పరస్పర సహకారం ప్రధానం అంశంగా చర్చించాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఆ సమావేశాలు వాయిదా పడ్డాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని పూర్తిగా పక్కనపెట్టి, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇలాగే వికసిస్తాయా? లేదా? అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు