ఆస్ట్రేలియా: పెరుగుతున్న చైనా ప్రాబల్య వివాదం.. 'జాతివివక్ష'తో మరింత ముదురుతుందా?

  • 29 జూన్ 2018
చైనా ప్రీమియర్ లీ కికియాంగ్‌తో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా ప్రీమియర్ లీ కికియాంగ్‌తో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్

ఇటీవలి నెలల్లో ఆస్ట్రేలియా ఒక సంక్లిష్టమైన సమస్యతో ఇబ్బందిపడుతోంది. తను నమ్మే విలువలకు కట్టుబడి ఉంటూనే, పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎలా ఎదుర్కోవాలనేదానిపై ఆస్ట్రేలియా సతమతమవుతోంది.

రాజకీయాలు, ఆర్థికవ్యవస్థ, విశ్వవిద్యాలయాలు తదితరాల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా సమాయత్తమవుతోంది. ఇందులో మరో ప్రశ్న ఎదురవుతోంది. తనకు అతిపెద్ద ఆర్థిక మద్దతుదారైన చైనాను నొప్పించకుండా, చైనీస్ ఆస్ట్రేలియన్లను నొప్పించకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది చిక్కుముడిగా ఉంది. ఈ నేపథ్యంలో, చైనా ప్రాబల్యంపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న చర్చ జాతివివక్ష కోణంలోకి మారిపోయే ఆస్కారముందా?

ఆస్ట్రేలియా పట్ల చైనీస్ ఆస్ట్రేలియన్లందరి విధేయతను ప్రశ్నించేందుకు దేశంలో కొన్ని మూకలు బయల్దేరినట్లు అనిపిస్తోందని ఎరిన్ చ్యూ బీబీసీతో వ్యాఖ్యానించారు. ఆమె లాబీ గ్రూప్ ఏసియన్ ఆస్ట్రేలియా అలయన్స్ సహవ్యవస్థాపకురాలు.

ఎరిన్ చ్యూ ఆస్ట్రేలియాలో పుట్టారు. ఆమె రచయిత. ఆమె మలేసియా-చైనీస్ సంతతి కార్యకర్త కూడా.

Image copyright EPA
చిత్రం శీర్షిక చైనా ప్రభావంపై ఆందోళనకర సమాచారం అందుతోందని ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ చెప్పారు

రాజకీయ కార్యకలాపాల్లో విదేశీ జోక్యాన్ని నివారించేందుకు చట్టం తెస్తామని నిరుడు ఆస్ట్రేలియా ప్రకటించినప్పుడు ఆస్ట్రేలియాపై చైనా ప్రభావం అతిగా ఉందా అనే చర్చ తారస్థాయికి చేరింది. చైనా ప్రభావంపై ఆందోళనకర సమాచారం అందుతోందని ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ వెల్లడించారు. రహస్యంగా, బలప్రయోగంతో జరిగే కార్యకలాపాలను తమ చట్టాలు లక్ష్యంగా చేసుకొంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాలో చదువుతున్న చైనా విద్యార్థులు, వ్యాపారం చేస్తున్న చైనీయులు, ఇతర చైనీస్ ఆస్ట్రేలియన్లకు చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ)తో సంబంధాల గురించి ఆస్ట్రేలియాలో భయాందోళనలు పెరిగిపోయాయి.

లక్షన్నర మంది చైనా విద్యార్థులు

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం దాదాపు లక్షన్నర మంది చైనా విద్యార్థులు చదువుకొంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో చైనీయులు తైవాన్ లాంటి సున్నితమైన అంశాలపై చర్చను ప్రభావితం చేస్తున్నారనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ పసిఫిక్ దేశాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపైనా ఆస్ట్రేలియా ఓ కన్నేసి ఉంచింది. దేశంలోని చైనీయులపై, చైనా సంతతివారిపై అలముకొన్న అనుమానాలతో వీరిని వేలెత్తి చూపుతున్నారని, లక్ష్యంగా చేసుకొంటున్నారని ఎరిన్ చ్యూ విచారం వ్యక్తంచేశారు.

'విదేశీ ప్రభావం'పై ఆస్ట్రేలియాలో చర్చ జరగడం అసమంజసమేమీ కాదని ఆమె స్పష్టంచేశారు. అయితే 'చైనా', 'చైనీయులు' అంతా ఒక్కటేననే అపోహ ఆస్ట్రేలియన్లలో ఉందని, ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనీయుల్లో చాలా మంది తొలిసారి బంగారం వెలికితీత కోసం 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాకు వచ్చారు

నాడు బంగారం వెలికితీతలో ఘర్షణలు

చైనీయులపై ఆస్ట్రేలియాలో వ్యతిరేకత ఈనాటిది కాదు. ఇది 1850లు, 1860ల నుంచే ఉంది.

అప్పట్లో బంగారం అన్వేషణ, వెలికితీత కాలంలో జాతివివక్షతో కూడిన ఘర్షణలు కూడా జరిగాయి. వందల మంది చైనీయులు గాయపడ్డారు. ఎంతో మంది చైనీయులను బంగారు గనుల నుంచి వెళ్లగొట్టారు.

ఈ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాలకులు కఠినమైన వలస నిబంధనలు తీసుకొచ్చారు. నాటి 'శ్వేతవర్ణ ఆస్ట్రేలియా' వలస విధానం దేశానికి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ విధానం 1901 నుంచి 1973 వరకు వివిధ రూపాల్లో కొనసాగింది.

'జాతివివక్ష కోణం ఉంది'

చైనా ప్రభావంపై జరుగుతున్న చర్చ జాతివివక్ష కోణాన్ని సంతరించుకోలేదనే వాదనను ఎరిన్ చ్యూ కొట్టిపారేశారు. చైనీస్-వ్యతిరేక భావజాలాన్ని ఎన్నడూ చూడనివారే ఈ వాదనను అంగీకరించరని అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియా విద్యావేత్త క్లైవ్ హామిల్టన్ నిరుడు విడుదల చేసిన 'సైలెంట్ ఇన్వేజన్: హౌ చైనా ఈజ్ టర్నింగ్ ఆస్ట్రేలియా ఇన్‌ టు ఎ పప్పెట్ స్టేట్' పుస్తకంతో చైనా ప్రభావంపై చర్చ విస్తృతస్థాయిలో ఊపందుకొంది.

ఆస్ట్రేలియాపై చైనా నిశ్శబ్దంగా దండయాత్రను సాగిస్తోందని, ఆస్ట్రేలియాను తోలుబొమ్మగా మార్చుకుంటోందనే అర్థం వచ్చేలా ఈ పుస్తకానికి పేరు పెట్టారు. వేల మంది చైనా ఏజెంట్లు ఆస్ట్రేలియాలో భాగమైపోయారని ఈ పుస్తకం ఆరోపిస్తోంది.

చైనా లేదా చైనా అండదండలున్న సంస్థలు, వ్యక్తులు తమపై పరువునష్టం కేసు వేయొచ్చని చెబుతూ ఒక ప్రచురణ సంస్థ పుస్తకం ప్రచురణ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించింది.

హామిల్టన్‌ను, ఆయన పుస్తకాన్ని ఎరిన్ చ్యూ తీవ్రంగా విమర్శించారు.

తనపైన, తనలాంటి ఇతర కార్యకర్తలపైన జాతివివక్షతో కూడిన చాలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయని ఎరిన్ చ్యూ చెప్పారు. చైనా ప్రచారకురాలు అంటూ హామిల్టన్ కూడా ఆమెపై ఆరోపణలు చేశారు.

Image copyright ERIN CHEW
చిత్రం శీర్షిక 'చైనా', 'చైనీయులు' అంతా ఒక్కటేననే అపోహ ఆస్ట్రేలియన్లలో ఉందని ఎరిన్ చ్యూ వ్యాఖ్యానించారు

'జాతివివక్ష'పై హెచ్చరికలు

చైనా విస్తృతస్థాయి అధికారిక కుట్ర జాతివివక్ష కోణాన్ని తీసుకుంటోందని చైనా సంబంధ అంశాల్లో విశేష పరిజ్ఞానమున్న 80 మంది విద్యావేత్తలు ఇటీవల హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆస్ట్రేలియాను ఒక సామంత రాజ్యం స్థాయికి మార్చాలనే ఉద్దేశం చైనాకు ఉందని కొందరు భావిస్తున్నారని చెప్పారు.

ఆస్ట్రేలియా జాతివివక్ష నిరోధక కమిషనర్ టిమ్ సౌట్‌ఫోమ్మాసేన్ కూడా ఈ నెల్లో చేసిన ఒక ప్రసంగంలో జాతివివక్ష గురించిన ఆందోళనలను ప్రధానంగా ప్రస్తావించారు.

చైనా ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకత చైనీస్ ఆస్ట్రేలియన్లందరినీ ఆస్ట్రేలియన్లు అనుమానించేలా చేసే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. చైనా మూలాలున్న ఆస్ట్రేలియన్లు దేశంలో 12 లక్షల మంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే అది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు.

'ఆ ఆధారాల లేవు.. ముప్పుపైనే ఆందోళన'

చైనా ప్రభావంపై చర్చ జాతివివక్ష రంగు పులుముకుందనే వాదనను మెల్‌బోర్న్‌లోని స్విన్‌బర్న్ యూనివర్శిటీలో చైనా వ్యవహారాల నిపుణుడైన ప్రొఫెసర్ జాన్ ఫిట్జ్‌గెరాల్డ్ తోసిపుచ్చారు. 80 మంది విద్యావేత్తల లేఖను ఖండిస్తూ విద్యావేత్తల బృందం ఒకటి లేఖ విడుదల చేసింది. ఈ బృందంలో జాన్ కూడా ఉన్నారు.

జాతివివక్ష ఉందనే ఆధారాల కంటే జాతివివక్ష ముప్పు గురించే ఎక్కువ ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ''అమెరికా గురించో, భారత్ గురించో మీడియాలో వచ్చే సంచలనాత్మక శీర్షికలు జాతివివక్ష కిందకు రావు.. అదే విధంగా చైనా గురించి వచ్చే సంచలనాత్మక శీర్షికలు కూడా జాతివివక్ష కిందకు రావు. ఈ శీర్షికలు ఒక దేశాన్ని లేదా ఆ దేశంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే. శరీర రంగు ఆధారంగా చూపే వివక్షే జాతివివక్ష కిందకు వస్తుంది'' అని చెప్పారు.

చైనా తీరుపైనా ఆరోపణలు

చైనా ప్రభావంపై చర్చకు జాతివివక్ష రంగు అంటడంలో చైనా తీరుపైనా ఆరోపణలు ఉన్నాయి.

చైనా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, వారిని చైనా వ్యతిరేకులనో, జాతివివక్ష చూపుతున్నారనో చైనా ప్రభుత్వం ఆరోపిస్తోందని ఆస్ట్రేలియా మేధోసంస్థ లోవీ ఇన్‌స్టిట్యూట్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు రిచర్డ్ మెక్‌గ్రెగర్ పేర్కొన్నారు. ఈ కారణంగా, కనీసం చర్చించాలన్నా ఈ అంశం సంక్లిష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.

Image copyright POPPY WANG
చిత్రం శీర్షిక ''చైనీయులను చంపేయండి'' అంటూ సిడ్నీలోని ఒక విశ్వవిద్యాయలయంలో రాసిన రాతలపై నిరుడు చైనీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది

చైనా విద్యార్థులపై దాడులు

ఒకవైపు చైనా ప్రభావంపై చర్చ జరుగుతుండగా, మరోవైపు చైనా మూలాలున్నవారిపై దాడులు జరిగాయి.

2017 ఆగస్టులో కాన్‌బెర్రాలోని ఒక విశ్వవిద్యాలయం తరగతి గదిలో నలుగురు చైనీస్ విద్యార్థులపై, ఒక ట్యూటర్‌పై మరో విద్యార్థి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశాడు. ఆ ఐదుగురికి గాయాలయ్యాయి.

అక్టోబరులో కాన్‌బెర్రాలో ఇద్దరు చైనా ఉన్నత పాఠశాల విద్యార్థులపై దాడి జరిగింది.

ఈ రెండు దాడుల్లో ఏదీ జాతివివక్షతో కూడిన దాడి కాదని పోలీసులు చెప్పారు.

ఈ ఏడాది మేలో సిడ్నీలోని ఒక వీధిలో ఒక వ్యక్తి ఏడుగురిని గాయపరిచాడు. బాధితులు ఆసియావాసులని, వారు ఆసియన్లు అయినందునే అతడు దాడి చేశాడని పోలీసులు ఆరోపించారు. అతడిని అరెస్టు చేశారు.

'అధికార స్థానాల్లో దక్కని అవకాశం'

ఆస్ట్రేలియా జనాభాలో 5.6 శాతం మంది చైనీస్ ఆస్ట్రేలియన్లేనని, కానీ అధికార స్థానాల్లో వారికి అవకాశాలు దాదాపు లేవని ప్రముఖ రచయిత, జర్నలిస్టు బెంజమిన్ లా చెప్పారు.

ఆస్ట్రేలియాలోని నాలుగు అతిపెద్ద రంగాలైన గనులు, విద్య, పర్యాటకం, వ్యవసాయంలలో చైనాపై ఆస్ట్రేలియా చాలా ఎక్కువగా ఆధారపడుతోంది. తమకు వ్యతిరేకంగా జరిగే పరిణామాలకు ప్రతిస్పందనగా చైనా చర్యలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళన కూడా ఆస్ట్రేలియాలో ఉంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆస్ట్రేలియా: ఇంగ్లిష్ రాకపోతే పౌరసత్వం ఇవ్వం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)