చైనా: సినీ నటుల పారితోషికాలపై పరిమితి విధించిన ప్రభుత్వం

  • 29 జూన్ 2018
ఫాన్ బింగ్‌బింగ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫోర్బ్స్ ర్యాంకుల ప్రకారం 2016లో ప్రపంచంలో అత్యంత ఎక్కువ మొత్తంలో పారితోషికం పొందుతున్న ఐదో నటి ఫాన్ బింగ్‌బింగ్

సినీ పరిశ్రమలో ‘సంపాదనపై వ్యామోహం’, పన్ను ఎగవేతల్ని అరికట్టే చర్యల్లో భాగంగా నటీనటుల పారితోషికాలపై పరిమితి విధిస్తున్నట్లు చైనా ప్రభుత్వ అధికారులు తెలిపారు.

చైనా సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటీ నటుల పారితోషికం మొత్తం నిర్మాణ ఖర్చు (ప్రొడక్షన్ కాస్ట్)లో 40 శాతానికి మించకూడదు.

ప్రధాన తారాగణానికి మొత్తం నటీనటుల పారితోషికాల్లో 70 శాతానికి మించి ఇవ్వకూడదు అని ప్రభుత్వం చెబుతోంది.

సినిమా, టీవీ స్టార్ల పారితోషికాలు, పరిశ్రమలో పన్ను ఎగవేతపై జరిగిన చర్చ అనంతరం ఈ చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏటేటా చైనా బాక్సాఫీస్ ఆదాయం పెరుగుతోంది. 2017లో ఇది 8.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది

ఈ చర్యలు ఇప్పుడెందుకు?

చైనా ప్రభుత్వ ప్రచార శాఖ, సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ, టీవీ, సినిమా నియంత్రణా సంస్థలు కలసి బుధవారం రాత్రి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

నటీ నటుల పారితోషికాలపై పరిమితులు ఇప్పుడే ఎందుకు విధిస్తున్నారనే దానిపై ప్రభుత్వం ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అయితే, ‘ఆకాశాన్ని అంటుతున్న యాక్టర్ల పారితోషికాలు’, ‘యిన్, యాంగ్ కాంట్రాక్టులు’, ‘పన్ను ఎగవేత, ఇతర అంశాల’పై చర్యలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.

‘‘ఈ సమస్యలు సినిమా, టీవీ పరిశ్రమ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. పరిశ్రమలో సంపాదనపై వ్యామోహానికి దారితీశాయి, యువత అంతా గుడ్డిగా సెలబ్రిటీల వెంట పడుతున్నారు, సామాజిక విలువలు పడిపోతున్నాయి’’ అని ఈ నోటీసులో పేర్కొంది. అయితే, ఈ పారితోషికాలపై పరిమితిని ఎలా అమలు చేస్తామనే అంశాన్ని ఇందులో వివరించలేదు.

గత నెలలో ప్రారంభమైన సెలబ్రిటీ పన్ను ఎగవేతల వివాదం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మే నెలలో టీవీ వ్యాఖ్యాత సుయ్ యంగ్‌యువాన్ సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టారు. చైనాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటి 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన కాంట్రాక్టుపై సంతకం చేశారని మొదటి పోస్టులో వివరించారు. చాలామంది సెలబ్రిటీలు ‘యిన్, యాంగ్ కాంట్రాక్టులు’గా పేరొందిన రెండు కాంట్రాక్టులపై సంతకాలు చేస్తున్నారని, వీటిలో అత్యంత తక్కువ విలువ కలిగిన కాంట్రాక్టునే అధికారులకు చూపిస్తున్నారని, తద్వారా పన్ను ఎగవేస్తున్నారని ఆరోపించారు.

ఆయన చెబుతున్న ఆ నటి ఫాన్ బింగ్‌బింగ్ అని సోషల్ మీడియా యూజర్లు భావించారు.

అయితే, ఫాన్ స్టూడియో మాత్రం ఆమె ఎలాంటి తప్పూ చేయలేదని తెలిపింది. ఫాన్ కాంట్రాక్టును ప్రచురించటం, ఆమె పన్ను ఎగవేతకు పాల్పడినట్లు చిత్రీకరించినందుకు సుయ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

జూన్ నెల ప్రారంభంలో చైనా పన్ను అధికారులు.. ‘‘ఆన్‌లైన్ చర్చల్లో ఆరోపణలు వెల్లువెత్తిన పలు సినీ, టీవీ నటీనటుల పన్ను ఎగవేత అంశాల’’పై దర్యాప్తు ప్రారంభించారు.

చిత్రం శీర్షిక ‘ఎంప్రెసెస్ ఆఫ్ చైనా’ సినిమాలో మహిళల వేషధారణ అసభ్యంగా ఉందంటూ ప్రభుత్వం సెన్సార్‌ చేసింది

ప్రభుత్వం ఇలా జోక్యం చేసుకోవచ్చా?

హాలీవుడ్, బాలీవుడ్ వంటి మిగతా సినీ పరిశ్రమల్లో నటీ నటులకు ఎంత పారితోషికాలు చెల్లించాలనే అంశంపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు.

కానీ, చైనాలో మాత్రం చాలా పరిశ్రమలపై.. అవి ప్రైవేటు రంగానికి చెందినవైనప్పటికీ ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని చూస్తుంటుంది.

సినిమా, టీవీ నిర్మాణ కంపెనీలు ‘‘కేవలం బాక్సాఫీసు ఆదాయం, రేటింగ్‌లను మాత్రమే కాకుండా తమ లాభాలను సమాజానికి ఖర్చు చేసేలా ప్రాధాన్యతలు ఎంచుకోవాలి’’ అని కూడా బుధవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

సెన్సార్‌షిప్, నియంత్రణ అనేది చైనాలో చాలా సాధారణం. సోషల్ మీడియాలో కూడా సున్నితమైన వ్యాఖ్యలు రాకుండా వడపోత జరుగుతుంటుంది. ‘‘రాజకీయాలు, ఆలోచన, కార్యాచరణ’’ల్లో దేశ నాయకత్వాన్ని అనుసరించాలని జర్నలిస్టులకు కూడా అధికార యంత్రాంగం చెబుతుంటుంది.

ప్రపంచంలోనే అత్యంత భారీ సినీ మార్కెట్‌గా త్వరలోనే చైనా అవతరించనుందని సినీ నిపుణులు భావిస్తున్నారు. చైనా ప్రేక్షకులను అలరించేందుకు అనుగుణంగా తమ సినిమాల్లో మార్పులు చేసుకునేందుకు హాలీవుడ్ నిర్మాణ కంపెనీలు ఇప్పటికే సిద్ధమైపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)