ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం

సముద్ర జలాల్లో ప్లాస్టిక్ బ్యాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలోని సముద్రాల్లోకి ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది

ఆస్ట్రేలియాలో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం అమలులోకి తేవటంతో పలు షాపుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

వ్యర్థాలను తగ్గించటం కోసం జాతీయ స్థాయిలో జరుగుతున్న కృషిలో భాగంగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం అమలులోకి తెచ్చారు. ఆస్ట్రేలియాలోని మొత్తం ఆరు రాష్ట్రాలకు గాను నాలుగు రాష్ట్రాల్లో ఆ బ్యాగులు ఉపయోగించే దుకాణాలపై జరిమానా విధిస్తున్నారు.

బ్రిటన్ సహా 60 పైగా దేశాలు ఇలా ఒకసారి ఉపయోగానికి పరిమితమయ్యే ప్లాస్టిక్ బ్యాగుల మీద నిషేధాలు, జరిమానాలు ప్రవేశపెట్టాయని ఐక్యరాజ్యసమితి చెప్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 5 ట్రిలియన్ల (5 లక్షల కోట్లు) ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తున్నట్లు ఐరాస అంచనా.

ఫొటో సోర్స్, Getty Images

నిషేధంపై సిబ్బందికి వేధింపులు

ఆస్ట్రేలియాలో వూల్స్‌వర్త్స్ రిటైల్ దుకాణాల సంస్థ జూన్ 20వ తేదీ నుంచి నిషేధం అమలులోకి తెచ్చింది. అయితే.. 15 సెంట్ల (సుమారు 8 రూపాయలు) ధరకు మళ్లీ వినియోగించుకోగల బ్యాగులను అందిస్తోంది.

కానీ.. వినియోగదారుల్లో ‘బ్యాగులపై ఆగ్రహం’ పెరగటంతో పునర్వినియోగించగల బ్యాగులను జూలై 8వ తేదీ వరకూ ఉచితంగా ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించింది.

‘‘ఈ మార్పునకు అలవాటుపడటానికి మా నుంచి వాళ్లు కొంచెం ఎక్కువ సాయం ఆశిస్తున్నారు.. అంతే’’ అని వూల్స్‌వర్త్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్లారీ పిటర్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ మార్పును వినియోగదారులకు వివరించటానికి అదనపు సిబ్బందిని నియోగిస్తామని మరో దుకాణాల సంస్థ కోల్స్ తెలిపింది.

ఇదిలావుంటే.. దుకాణాల్లో సిబ్బందితో గౌరవప్రదంగా వ్యవహరించాలని రిటైల్ స్టాఫ్ యూనియన్.. వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

యూనియన్ సభ్యుల్లో 132 మందిలో 57 మంది.. ఈ నిషేధం విషయంలో తమకు వేధింపులు ఎదురయ్యాయని యూనియన్ సర్వేలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్లాస్టిక్ సముద్రాల్లోకి ఎలా చేరుతోంది?

ఏటా 8 కోట్ల టన్నుల కన్నా ఎక్కువ ప్లాస్టిక్ ప్రపంచంలోని సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని ఐరాస లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్లాస్టిక్ బ్యాగులను 2022 నాటికి పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చింది.

ప్రపంచంలోని ప్రధాన నదుల ద్వారా ఈ ప్లాస్టిక్ సముద్రాల్లోకి వస్తోంది. దాదాపు 95 శాతం ప్లాస్టిక్ ఈ మార్గం ద్వారా వస్తోంటే.. అందులో 8 నదులు ఆసియాలో ఉన్నట్లు గుర్తించారు.

చైనా నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం కూడా భారీ ప్లాస్టిక్ కాలుష్యం చేస్తున్న దేశాల జాబితాలో ఉన్నాయి.

యూకే, యూరప్, అమెరికాల్లో వినియోగదారుల ప్రవర్తన కూడా.. ప్లాస్టిక్ బ్యాగులు సముద్ర జలాల్లోకి రావటానికి ఒక కారణం.

అమెరికా పౌరులు ఒక్కొక్కరు ఏటా సగటున 120 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారని ఒక అంచనా. అది బ్రిటన్‌లో 76 కిలోలు ఉంటే, స్వీడన్‌లో 18 కిలోలుగా ఉంది.

మిగతా ప్రపంచం ఏం చేస్తోంది?

ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి రావటాన్ని నిలిపివేయాలన్న ఐరాస ప్రణాళిక అమలుకు గత డిసెంబర్‌లో 193 దేశాలు హామీ ఇచ్చాయి. అయితే.. దీనికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట కాలపరిమితి లేదు. వేర్వేరు దేశాలు వేర్వేరు పథకాలు అమలు చేస్తున్నాయి.

దాదాపు 40 దేశాలు సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. చైనా, బంగ్లాదేశ్‌లతో పాటు.. 15 ఆఫ్రికా దేశాల్లో ఈ బ్యాగులపై నిషేధం, జరిమానాలు అమలులో ఉన్నాయి.

బ్రిటన్ సహా ఇతర దేశాలు ప్లాస్టిక్ స్ట్రాలు, కాటన్ బడ్స్ వంటి వాటిని నిషేధించే దిశగా పయనిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: గంగానదికి ప్లాస్టిక్ ముప్పు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)