హాంకాంగ్: ప్రజాస్వామ్య అనుకూల నిరసనకు తగ్గిన జనం

  • 2 జూలై 2018
నిరసనకారులు Image copyright EPA

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం ఏటా జరిగే నిరసనకు ఈ ఏడాది ప్రజల నుంచి స్పందన తగ్గింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతల నడుమ ఆదివారం నిర్వహించిన వార్షిక ప్రదర్శనలో చరిత్రలో ఎప్పుడూ లేనంత తక్కువ మంది పాల్గొన్నారు.

గతంలో 156 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న హాంకాంగ్.. 21 ఏళ్ల క్రితం అంటే 1997 జూలై 1న చైనా చేతుల్లోకి వెళ్లింది.

అయితే.. 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అనే సూత్రంలో భాగంగా.. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి హక్కులు కలిగి ఉంది. కానీ, అక్కడ పూర్తిస్థాయి ప్రజాస్వామిక ప్రభుత్వం మాత్రం లేదు.

గొడుగు విప్లవం

తమ ప్రాంతాన్ని చైనా క్రమక్రమంగా ఆక్రమిస్తోందంటూ.. 2014లో హాంకాంగ్‌లో ఆందోళనలు పెద్దఎత్తున మొదలయ్యాయి.

హాంకాంగ్‌లో స్వేచ్ఛావాదం కోసం విద్యార్థుల నాయకత్వంలో ప్రారంభమైన ఆ ఉద్యమంలో.. లక్షల మంది నిరసన తెలిపారు.

నెత్తిన గొడులు పెట్టుకుని వచ్చిన విద్యార్థుల నినాదాలతో హాంకాంగ్ ప్రధాన వ్యాపార కూడలి దద్దరిల్లింది.

ఆ ఉద్యమాన్ని గొడుగు విప్లవం (అంబ్రెల్లా రివల్యూషన్)గా పేర్కొంటారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక 2014లో గొడుగులతో నిరసన ప్రదర్శన.

ఆ తర్వాత ఏటా 'ప్రో- డెమోక్రసీ' ఉద్యమం జరుగుతోంది. కానీ, ఉద్యమంలో కీలకమైన అనేక మందిని జైళ్లలో పెట్టడంతో గతేడాది ఆందోళనలు బలహీన పడ్డాయి.

ఈ ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో 50వేల మంది ఉద్యమకారులు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. కానీ, అందులో పాల్గొన్నది 9,800 మందే అని పోలీసులు తెలిపారు.

ఇరు వర్గాలు తెలిపిన లెక్కలు కూడా గతంలో కంటే తక్కువగానే ఉన్నాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఆదివారం హాంకాంగ్ వీధుల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రజలు

ఆదివారం వందల మంది బ్యానర్లు, పసుపు రంగు గొడుగులు పట్టుకుని వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

నిరసనల నేపథ్యంలో హాంకాంగ్ వీధుల్లో పోలీసులను భారీగా మోహరించారు.

Image copyright AFP

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చిత్రపటాలను కాల్చుతూ కొందరు నిరసన తెలిపారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక చిత్రపటాలకు అంటించిన మంటను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా సిబ్బంది.
Image copyright EPA

చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ మాస్కులతో నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

Image copyright Reuters

2014 ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్ తాజా నిరసనలో పాల్గొని ప్రసంగించారు.

అయితే, ఈ ఆందోళనలు 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' అనే సూత్రాన్ని అవమానించేలా ఉన్నాయని, ఇలాంటి చర్యల వల్ల హాంకాంగ్ అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)