మెక్సికో: అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత లోపెజ్ ఒబ్రాడర్.. అమెరికాతో సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి?

ఆంద్రెజ్ మాన్యూల్ లోపెజ్ ఒబ్రాడర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డొనాల్డ్ ట్రంప్‌ను లోపెజ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ట్రంప్ హేతుబద్ధంగా ఆలోచించేలా చేస్తానని చెప్పారు

మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఆంద్రెజ్ మాన్యూల్ లోపెజ్ ఒబ్రాడర్ విస్పష్టమైన గెలుపు దిశగా పయనిస్తున్నారు.

ఆదివారం జరిగిన పోలింగ్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మెక్సికో నగరం మాజీ మేయర్ అయిన లోపెజ్ 53 శాతం ఓట్లు గెలిచారని ఎన్నికల అధికారులు చెప్పారు. ఇది తన సమీప ప్రత్యర్థికి పోలైన ఓట్లకు రెట్టింపు కన్నా ఎక్కువని తెలిపారు.

‘ఆమ్లో’గా సుపరిచుతుడైన లోపెజ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి.

ఆయన సమీప ప్రత్యర్థులిద్దరూ ఓటమిని అంగీకరించారు. విజయం సాధించిన లోపెజ్‌కి అభినందనలు తెలిపారు.

అధికార ఇన్‌స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ) అభ్యర్థి జోస్ ఆంటోనియో మీడె.. ఆరంభ ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారు. లోపెజ్‌ ‘‘గొప్ప విజయం’’ సాధించాలని తాను శుభాకాంక్షలు చెప్పినట్లు తన మద్దతుదారులతో పేర్కొన్నారు.

ఇన్‌స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ గత శతాబ్ద కాలంగా మెక్సికో రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించింది. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది.

సంప్రదాయవాద నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్) అభ్యర్థి రికార్డో అనాయా రెండో స్థానంలో నిలుస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘ఆయన భారీ విజయాన్ని నేను గుర్తించాను. నా అభినందనలు చెప్తున్నా. మెక్సికోకు మేలు చేయటంలో ఆయన గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని అనాయా చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ‘‘మెక్సికో తదుపరి అధ్యక్షుడు అవుతున్న’’ లోపెజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం నాటి మెక్సికో ఎన్నికలు దేశంలో ఇటీవలి దశాబ్దాల్లో అత్యంత హింసాత్మకంగా జరిగాయి. ఎన్నికల హింసలో 130 మందికి పైగా రాజకీయ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

లోపెజ్ ఒబ్రాడర్ విజయంతో మెక్సికో సిటీలో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు

మారిన మెక్సికో రాజకీయ ముఖచిత్రం

విల్ గ్రాంట్, బీబీసీ న్యూస్, మెక్సికో సిటీ

ఎన్నికల్లో ఓటమిని త్వరగా అంగీకరించటం ద్వారా ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులూ.. లోపెజ్ ఒబ్రాడార్‌ను అధ్యక్ష పోటీలో విజేతగా గుర్తించారు.

అధికార పీఆర్‌ఐ పార్టీకి అత్యంత క్లిష్టమైన రోజు.. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఆర్థికమంత్రి జోస్ ఆంటోనియో మీడ్.. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిగా తన ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత మరో ప్రధాన ప్రత్యర్థి పీఏఎన్ అభ్యర్థి రికార్డో అనాయా కూడా లోపెజ్ గెలుపును గుర్తించారు.

ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారనే వివరాలు పూర్తిగా తెలియటానికి అధికారిక ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. లోపెజ్, ఆయన మద్దతుదారులు 2006 నుంచి నిరీక్షిస్తున్న రోజు ఇది. ఆ సంవత్సరంలో ఆయన మొదటిసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో ప్రయత్నంలో ఆయన గెలుపొందారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

లోపెజ్ ఒబ్రాడర్, జోస్ ఆంటోనియో మీడె, రికార్డో అనాయా

ఫలితాలను ప్రభావం చేసిన అంశాలేమిటి?

మెక్సికో అధ్యక్ష పదవికి జరిగిన గత రెండు ఎన్నికల్లోనూ లోపెజ్ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడిక పీఆర్ఐ, పీఏఎన్ ఆధిపత్యానికి ఆయన ముగింపు పలుకుతున్నట్లు కనిపిస్తోంది.

ఆ రెండు పార్టీలూ ఒకే ‘‘మాఫియా అధికారం’’లో భాగస్వాములని ఆయన అభివర్ణించారు.

ప్రస్తుత అధ్యక్షుడు ఎన్‌రిక్ పెనీ నీటో సారథ్యంలోని పీఆర్‌ఐ ప్రభుత్వం మీద ప్రజలు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉండటం.. అవినీతి పెరిగిపోతుండటం దీనికి కారణం.

లోపెజ్ (64) తన ఎన్నికల ప్రచారంలో.. అవినీతిని నియంత్రించటం, వేతనాలు, పెన్షన్లు పెంచటం, అధికార దుర్వినియోగాన్ని రూపుమాపటం ప్రధాన అంశాలుగా చేర్చారు.

ఆయనవి ప్రజాకర్షక విధానాలని.. ఆర్థిక వ్యవస్థను ఆయన చేతిలో పెట్టి విశ్వసించలేమని ప్రత్యర్థులు ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికలు ఎలా జరిగాయి?

స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు భారీ క్యూలు కట్టారు. కొత్త అధ్యక్షుడితో పాటు.. 128 మంది సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు 500 మందికి కూడా ఎన్నికలు జరిగాయి.

అధికారికంగా 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రాధమిక అంచనా.

ఈ ఎన్నికలు చరిత్రాత్మకమని.. నిజమైన మార్పుకు అవకాశం లభించిందని లోపెజ్ మెక్సికో సిటీలో విలేకరులతో చెప్పారు.

అమెరికా - మెక్సికో సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

డొనాల్డ్ ట్రంప్‌ను లోపెజ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. ట్రంప్ హేతుబద్ధంగా ఆలోచించేలా చేస్తానని చెప్పారు.

వాణిజ్యం, వలసల విషయంలో మెక్సికో మీద ట్రంప్ నిరంతరం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్టా)ను సమీక్షిస్తానని, అమెరికా - మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మిస్తానని చెప్తూ ఉన్నారు.

వలస విషయంలో ట్రంప్ కఠిన వైఖరి.. ప్రత్యేకించి అమెరికా సరిహద్దు వద్ద కుటుంబాలను విడదీయటం మీద తీవ్ర ఆక్షేపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.

వలస విధానాన్ని సరళం చేయటానికి ట్రంప్ అంగీకరించినప్పటికీ.. ఇంకా దాదాపు 2,000 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల నుంచి విడివిగా ఉన్నారు.

వీడియో క్యాప్షన్,

మెక్సికో: అభ్యర్థులకు ప్రాణాంతకంగా మారిన ఎన్నికలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)