చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో

  • 2 జూలై 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఈ కాకి ఎంత తెలివైనదో చూడండి

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ఓ చిన్న ద్వీపంలో ఉన్న కాకుల్లో అద్భుతమైన తెలివితేటలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

న్యూ కాలెడోనియా అనే ద్వీపంలోని ఈ కాకులు వాటికవే గాలాన్ని తయారు చేసుకుంటున్నాయి.

చెట్ల దుంగలకు రంధ్రాలు చేసుకుని లోపల ఉండే పురుగులను బయటకు రప్పించేందుకు ఆ గాలాలను వినియోగిస్తున్నాయి.

ఆ పురుగులు బయటకు రాగానే తినేస్తాయి.

అయితే అడవిలో అనేక రకాల చెట్లు ఉంటాయి. కానీ ఈ కాకులు మాత్రం తమ వేట కోసం ఎప్పుడూ ఒకే రకమైన చెట్టు పుల్లలనే ఎంపిక చేసుకుంటాయి.

Image copyright SARAH JELBERT
చిత్రం శీర్షిక ఈ మెషీన్‌లోకి కాగితం ముక్క వేస్తే.. ఓ మాంసం ముక్క బయటకు వస్తుంది.

వెండింగ్ మెషీన్‌ను వాడేస్తున్నాయి

ఈ పక్షుల మేధస్సును మరింత లోతుగా పరీక్షించేందుకు.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్. సారా జెల్బర్ట్ ప్రత్యేకంగా ఓ వెండింగ్ మెషీన్ తయారు చేశారు.

దాని లోపల చిన్నచిన్న మాంసం ముక్కలు ఉంటాయి.

మెషీన్‌లోకి కాగితం ముక్కలు వేసినప్పుడు.. ఓ మాంసం ముక్క బయటకు వస్తుంది.

ఈ మెషీన్‌ను కూడా ఇక్కడి కాకులు చాలా తెలివిగా వాడేస్తున్నాయి.

దాంతో కాకులను మరి కాస్త 'ఇబ్బంది' పెట్టేందుకు.. నిర్ణీత సైజులో ఉన్న కాగితం ముక్కలు వేస్తేనే మాంసం ముక్కలు బయటకు వచ్చేలా పరిశోధకులు మెషీన్‌లో మార్పులు చేశారు.

దాని పక్కనే ఓ పెద్ద పేపర్‌ షీట్‌ను ఉంచారు.

అయినా సరే.. ఆ పెద్ద షీట్ నుంచి అవసరమైన పరిమాణంలోనే ముక్కలుగా చించి, వాటిని మెషీన్‌లో వేయడం కూడా ఈ కాకులు నేర్చేసుకున్నాయి.

Image copyright SARAH JELBERT
చిత్రం శీర్షిక మెషీన్‌లో ఎంత సైజు పేపర్ ముక్క పడుతుందో కూడా ఈ కాకులు తెలుసుకున్నాయి.

పరిశోధనలో భాగంగా ఎనిమిది కాకుల కోసం వేరువేరు మెషీన్లు ఏర్పాటు చేశారు.

ఒక్కో దాంట్లో ఒక్కో పరిమాణం కలిగిన కాగితం ముక్కలు పట్టేలా రూపొందించారు.

అయినా.. అందుకు తగ్గట్టుగానే ఈ కాకులు పేపర్‌ను చించడం నేర్చుకున్నాయి.

"తొలుత డబ్బాలాగా ఉండే ఆ మెషీన్‌లో మాంసం ముక్కలు ఉన్నాయని, అందులోకి ఏదైనా వస్తువు వేస్తే ఆ ముక్కలు బయటకు వస్తాయని కాకులకు తెలియాలి. అందుకోసం.. ముందుగా బాక్సు మీద చిన్న గులక రాళ్లను, పేపర్ ముక్కలను పెట్టాము. కాకులు వచ్చి ముక్కుతో పొడిచినప్పుడు అవి బాక్సులోకి పడ్డాయి. అప్పుడు లోపలి నుంచి మాంసం ముక్కలు బయటకు వచ్చాయి. దాంతో రాళ్లను, కాగితం ముక్కలను లోపలికి పడేస్తే, మాంసం ముక్కలు బయటకు వస్తాయని అవి గ్రహించాయి" అని డాక్టర్. సారా జెల్బర్ట్ వివరించారు.

Image copyright JAMES ST CLAIR
చిత్రం శీర్షిక గాలం తయారీ కోసం కాకులు ఎంపిక చేసిన చెట్టు పుల్లలను మాత్రమే వాడతాయి.

మరి ఈ పక్షులు ఎలా నేర్చుకోగలుగుతున్నాయి? రంధ్రాల్లో దాక్కున్న పురుగులను బయటకు రప్పించేందుకు గాలాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాయి? వంటి విషయాలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని సారా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు