రష్యా ఉద్యోగులు: 'పింఛను అందే వరకు బతికే ఉంటామా'

  • 3 జూలై 2018
ఇద్దరు వ్యక్తులు Image copyright Getty Images

రష్యా ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల ఆతిథ్య దేశంగానే వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. కానీ దేశంలో ఈ టోర్నీయే కాకుండా అనేక ముఖ్యమైన పరిణామాలూ జరుగుతున్నాయి. వీటిలో ఓ ఆరు అంశాలు చూద్దామా..

పదవీ విరమణ వయసుకు సంబంధించిన నిబంధనల్లో పెను మార్పులను ప్రతిపాదించే బిల్లును ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ జూన్ 16న పార్లమెంటుకు పంపించారు.

ప్రస్తుతం పదవీ విరమణ వయసు పురుషులకు 60 ఏళ్లుగా, మహిళలకు 55 ఏళ్లుగా ఉంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఇది మగవారికి 65 ఏళ్లుగా, ఆడవారికి 63 ఏళ్లుగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడకుండా, మార్పులను దశల వారీగా అమల్లోకి తెస్తామని ప్రభుత్వం చెబుతోంది.

రష్యాలో మగవారి సగటు ఆయుర్దాయం 65 ఏళ్లు దాటడం లేదు. ప్రతిపాదిత మార్పుల నేపథ్యంలో, తాము పదవీ విరమణ చేసి పింఛను అందుకొనేవరకు జీవించే ఉంటామా అని చాలా మంది రష్యన్లు ప్రశ్నిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉక్రెయిన్ సినీ దర్శకుడు ఒలెగ్ సెన్‌త్సోవ్

పన్ను పెంపు

జూన్‌ ప్రథమార్థంలో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైన సమయంలోనే, విలువ ఆధారిత పన్ను(వ్యాట్)‌ను 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఖజానాకు రాబడిని పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. దీనివల్ల ధరలు పెరుగుతాయని రష్యన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ప్రాథమిక ఆహార పదార్థాలు, ఔషధాలు, బాలల ఉత్పత్తులపై మాత్రం వ్యాట్‌ను ప్రభుత్వం యథాతథంగా 10 శాతంగానే ఉంచింది.

ఉక్రెయిన్ సినీ దర్శకుడు ఒలెగ్ సెన్‌త్సోవ్ ఆరోగ్యంపై ఆందోళన

రష్యా జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన ఉక్రెయిన్ సినీ దర్శకుడు ఒలెగ్ సెన్‌త్సోవ్ మద్దతుదారులు ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళన పెరుగుతోందని చెప్పారు.

లెనిన్ విగ్రహం పేల్చివేతకు కుట్ర పన్నారనే కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయన, రష్యాలోని ఉక్రెయిన్ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో మే 14న నిరాహార దీక్ష చేపట్టారు.

2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అన్ని నగరాల్లో నిరసన ప్రదర్శనలపై రష్యా నిషేధం విధించింది. అయినప్పటికీ కొన్ని రోజుల కిందట, చుట్టూ కంచె, నినాదాలతో కూడిన ఒక ప్రపంచ కప్ నమూనాను దర్శకుడి మద్దతుదారులు రష్యాలోని ఒక ప్రధాన వీధిలో పెట్టారు. తర్వాత పోలీసులు దీనిని తొలగించారు.

చిత్రం శీర్షిక యూరి దిమిత్రీవ్‌

నిర్దోషిగా తేలిన సామాజిక కార్యకర్త మళ్లీ అరెస్టు

బాలల నీలిచిత్రాల కేసులో ఏప్రిల్‌లో నిర్దోషిగా విడుదలైన చరిత్రకారుడు, సామాజిక కార్యకర్త యూరి దిమిత్రీవ్‌ను అధికారులు తిరిగి అరెస్టు చేశారు.

రష్యాలోని కరెలియా ప్రాంతానికి చెందిన యూరి దిమిత్రీవ్ 'మెమోరియల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్' సభ్యుడు. స్టాలిన్ హయాంలో సామూహిక మరణ దండన శిక్షల్లో చనిపోయినవారి సమాధులను గుర్తించేందుకు ఆయన దాదాపు మూడు దశాబ్దాలపాటు కృషి చేశారు.

కరేలియాలోని సుప్రీంకోర్టు జూన్ 14న ఆయన నిర్దోషిత్వాన్ని తోసిపుచ్చింది. కొత్త అభియోగాలపై ఆయన గరిష్ఠంగా 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్నారు.

యూరి దిమిత్రీవ్‌పై రాజకీయ దురుద్దేశంతో కేసు బనాయించారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. స్టాలిన్ హయాంలో జరిగిన వేల మంది హత్యల వెనక నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయ్నతిస్తున్నందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకొన్నారని వారు అంటున్నారు.

'మంచి సమాచారమే మీడియాకు ఇవ్వాలి'

ప్రపంచ కప్ టోర్నీ జరిగినన్ని రోజులు పోలీసు దర్యాప్తులు, ఆపరేషన్లలో విజయాల గురించి మాత్రమే వివరాలను బహిర్గతపరచాలని, మిగతావి వెల్లడించొద్దని పోలీసులను అంతర్గత వ్యవహారాలశాఖ ఆదేశించిందని 'రాయిటర్స్' వార్తాసంస్థ తెలిపింది. ఈ 'నిషేధం' జులై 25 వరకు అమల్లో ఉంటుంది.

ప్రభుత్వ ఆదేశాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 1 నుంచి జూన్ 6 మధ్య పోలీసులు మీడియాకు 1,438 రిపోర్టులు విడుదల చేయగా, జూన్ 7 నుంచి 13 మధ్య 71 రిపోర్టులే విడుదల చేశారు.

Image copyright VASILY MAXIMOV
చిత్రం శీర్షిక నావల్నీ, ఒలెగ్

ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ విడుదల

ప్రతిపక్షానికి చెందిన నాయకుడు అలెక్సీ నావల్నీని ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమైన జూన్ 14న నిర్బంధం నుంచి విడుదల చేశారు. అనుమతి లేని నిరసనలో పాల్గొన్నందుకు అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. 30 రోజులపాటు నిర్బంధంలో ఉంచారు.

నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఒక కేసులో మూడున్నరేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన అలెక్సీ నావల్నీ సోదరుడు ఒలెగ్ శుక్రవారం విడుదలయ్యారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశపూరితమని నావల్నీ, ఒలెగ్ విమర్శిస్తున్నారు.

నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తన పట్ల అంత కఠినంగా వ్యవహరించలేదని, ప్రపంచ కప్‌ జరుగుతుండటమే దీనికి కారణమని నావల్నీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టులో వ్యాఖ్యానించారు.

ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మళ్లీ పాత పరిస్థితులే వస్తాయని రష్యాలో ఇప్పుడు కనిపిస్తున్న సానుకూల వాతావరణం కొనసాగుతుందని ఆశిస్తున్నవారిని ఉద్దేశించి ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)